భాగవతంలో శ్రీకృష్ణపరమాత్మ దశమస్కంధంలో తండ్రియైన నందునికి కర్మసిద్ధాంతం ఎరుకపరిచాడు. దాన్ని పోతనగారు చక్కని పద్యంలో వివరించారు.
కం॥కర్మమునఁబుట్టు జంతువు
కర్మమునన్ వృద్ధిఁ బొందు కర్మమున జెడున్
కర్మమె జనులకు దేవత,
కర్మమె సుఖదుఃఖములకు కారణమధిపా!
ఈ కర్మజ్ఞానం కలిగియుంటే కర్మఫలితాలు అనుభవించగలం. కానీ “అజ్ఞానే నావృతం జ్ఞానం” ప్రతివాని యందుండే జ్ఞానం అజ్ఞానంవల్ల మసకబారి పోతున్నది. కనుక గ్రహించాల్సింది ఏమిటంటే “జ్ఞానేనతు తదజ్ఞానం”ఈ అజ్ఞానానికి జ్ఞానమే ఔషధం. ఈ జ్ఞానోదయం కలగాలంటే పూర్వజన్మ సుకృతాలు విశేషంగా ఉండాలి. సంచితాలు బలంగా ఉంటే చేసే కర్మల కనుగుణంగా ఫలితాలు ఏర్పడతాయి. ఆ ఫలితాలు మనిషికి అనుభవాలుగా ఏర్పడతాయి. ఈ అనుభవాలసారం తైలధారగా సాగాలంటే అతను చేసే కర్మలు అతనిని లబ్ది ప్రతిష్ఠితుని చేస్తాయి. ఇది గీతలో పరమాత్మ సంక్షిప్తంగా చెప్పిన కర్మసన్యాసయోగ విశ్లేషణ అమ్మ ఆధ్యాత్మక విశ్లేషణ లిచ్చి, ఉపన్యాసాలు చెప్పిన దాఖలాలు లేవు. కానీ చిన్న చిన్న మాటలతో ఉదాత్తమైన పారమార్థిక, ఆధ్యాత్మిక సందేశాలు బిడ్డలకి అందించింది. “ఎవరు ఏది సహించ లేరో అది మాత్రమే హింస” అని అమ్మ చెప్పగలిగిందంటే హింసను గూర్చి అమ్మ సందేశం నిగూఢం. విశ్లేషణలకి కూడ అందని అర్థాలు అందులో ఇమిడ్చింది అమ్మ. అలాగే కర్మయోగం గురించి కూడ అమ్మ పెద్ద పెద్ద మాటలతో ఉపన్యాసాలు చెప్పలేదు. అసలు కర్మయోగంలో అమ్మ ప్రయత్నం గమనిస్తే చాలా విచిత్రంగా వుంటుంది. కర్మలు వాటికర్తృత్వాల గురించి తన బిడ్డలకి తెలియాల్చిన అవసరం లేకుండా చేసింది. అమ్మ చెప్పిన సందేశం గమనించండి. “దైవం సంకల్పిస్తేనే తాను సంకల్పిస్తాడు. తన సంకల్పాలన్ని అమ్మ సంకల్పాన్నీ కనుక ఇక్కడ కర్తకి తాను చేసే కర్మల గురించి సంకల్పంచేయాల్సిన అవసరం ప్రశ్నార్థకమే కదా! “మీరు జిల్లెళ్ళమూడి రావాలని నేను సంకల్పం చేస్తేనే మీరు వస్తారు”. ఇక బిడ్డ నేను వెళ్ళాలి అనే సంకల్పానికి కర్త ఎలా అవుతాడు. వాడిలో సంకల్పం లేకపోతే అతని కర్తృత్వంలో అర్థమేమున్నది. కనుక సంకల్ప వికల్పాలకి అమ్మ సంకల్పమే కీలకం. “ఈ రోజు వద్దు. రేపు వెళ్ళు” అని నిక్కచ్చిగా చెప్పినా కాదని వినక రాత్రికి రాత్రే వెళ్ళినా అమ్మ ఉపకరణం అమ్మ ఇచ్చి పంపిన మజ్జిగ త్రాగి తన ఇంటి అరుగుమీదే పడుకొన్న అనుభవాలు అమ్మ సంకల్పానికి ఉదాహరణలు. పరమాత్మ చెప్పినట్లు ‘న కర్తత్వం న కర్మణి” చేయాలనే సంకల్పం. నీకు కలగకపోతే నీవు చేసే కర్మ ఏమిటి? అన్నీ తన మీద వేసుకొన్న అమ్మే కర్తృత్వాలకి, కర్మలకి, ఫలాలకి సృష్టి కర్తయని గ్రహించాలి. ఈ జ్ఞానం కలిగితే అజ్ఞానం తొలగి జ్ఞానోదయం జరిగినట్లే. అందుకే అమ్మ ఈ బాదరబందీలన్నింటిని తన మీద వేసుకొని కర్మసన్యాస యోగం నుండి మనల్ని దూరంగా వుంచింది. దీనికి అమ్మ ప్రసాదించిన తియ్యని తాయిలం “అందరికీ సుగతే” అని తీర్మానం చేయటమే. అసలు విషయం ఆలోచిస్తే గతుల నిర్ధారణ కోసమే కదా కర్మలు కర్తృత్వాలు, ఫలితాలు, అనుభవాలు. ఆ గతుల ఫలితాలు అమ్మ ముందుగానే మనందరి గతి “సుగతి” అని తేల్చి చెప్పిన తర్వాత ఇక కర్మల అవసరం ఏమిటి ? దానిపై విశ్లేషణల అవసరం వున్నదా?” “అందరి సుగతే” అన్న సందేశంలో అమ్మ విశ్వవ్యాప్తమైన కర్మసన్యాసయోగ సారాంశాన్ని నిక్షిప్తం చేసింది.
ఇక్కడ మనం ఒక కథ చెప్పుకొందాము. ఒక స్త్రీ మూర్తి అడవిలో సంచారం చేస్తుంటే పాము ఆమె కుమారుణ్ణి కాటేసింది. కొడుకు మరణించినందుకు ఏడుస్తున్నది. ఇంతలో ఒక బోయవాడు ఆ పామును పట్టి తెచ్చి అమ్మా ఈ పామే నీ కొడుకును కాటేసింది దాన్ని చంపుతాను అంటాడు. అయ్యా ఆ పాముని చంపితే నా కొడుకు తిరిగివస్తాడా ? ఆ పాముని వదిలివేయి అంటుంది. ఇది విషప్రాణి దానిని చంపటం హింసకాదు. దాన్ని చంపుతాను అంటాడు. అపుడు పాము అయ్యా నేను మృత్యు అధీనురాలను ఈమె కుమారునిపై ద్వేషం లేదు ప్రత్యేక అభిమానము లేదు. ఇందులో నా ప్రమేయం లేదు అంటుంది. మృత్యువు చంపమంటే మాత్రం సొంతబుద్ది నుపయోగించనవసరం లేదా అంటాడు. బోయవాడు. దీనికి పాము అయ్యా యాగంలో యాజకులు హవిస్సులు చేస్తుంటే ఫలితం యజమానులకి వస్తుంది. గాని యాజకులకి కాదు గదా. అలాగే ఈ విషయంలో నా ఇష్టాల ప్రసక్తి ఉండదు. కనుక నన్ను చంపవద్దు.. అంటుంది పాము. అంతలో మృత్యువు వచ్చి ఇందునా తప్పిదం కూడ లేదు. నన్ను కాలుడు నిర్దేశించాడు నేను పామును ఆదేశించాను. నా తప్పేమీ లేదంటుంది మృత్యువు. మీరిద్దరు ప్రసంగాలతో తప్పించుకోవాలని చూస్తున్నారు అంటుండగా కాలుడు ప్రవేశించి నాయనా ఈ బాలుని మరణానికి నేనుగానీ, మృత్యువుగానీ, పాముగాని కారణం కాదు అతడు చేసిన దుష్కర్మల ఫలితమే అతని మరణానికి కారణం కర్మలవల్ల జననమరణాలు సుఖదుఃఖాలు ఏర్పడతాయి. ఎంతటి వారికైనా కర్మఫలం అనుభవించక తప్పదు అని అంటాడు. దానికి స్త్రీ మూర్తి నా కుమారుడు అకాలమరణం పొందే పాపం చేసి ఉన్నాడు, నేను పుత్ర శోకాన్ని అనుభవించే పాపం చేశాను. అందుకే ఇలా జరిగింది. దయచేసి ఆ పాముని వదిలిపెట్టు అంటుంది. దానికి బోయవాడు క్షయవృద్ధులకు కర్మఫలాలు కారణాలు అంటూ పాముని వదలిపెడతాడు. ఈ కథ మహాభారతంలోనిది. కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన వారందరికి తన రాజ్యకాంక్ష కారణమని చింతిస్తున్న ధర్మరాజుకి అంపశయ్య పైన పడుకొన్న భీష్ములవారు పై కథ చెప్పి ఊరడిస్తారు. ఒకరి కర్మలకి మరొకరు కర్తలు కారు. ఇది కర్మసన్యాస యోగసిద్ధాంతం. అమ్మ ఈ యోగాలన్నింటికి అతీతంగా తన బిడ్డలకి సుగతిని ప్రసాదించింది. “మీరు బురద పూసుకున్నా, ఏం పూసుకున్నా దాన్ని కడిగి శుభ్రపరచ వలసిన బాధ్యత నాది” అని అమ్మ సందేశంలో మనందరికి ‘శేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం” అన్న ధైర్య వచనాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి.