లోకంలో సాధకులు, యోగులు, జ్ఞానులు అనేకమందికి అంతిమ లక్ష్యం మోక్ష సాధన. జన్మ పరంపర
నుండి విముక్తి.
“పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం
ఇహ సంసారే బహు దుస్తారే
కృపయా పారే పాహి మురారే” అని భజగోవింద శ్లోకం.
కాశీలో మరణిస్తే మోక్షం ధ్రువం అని ‘స్కాంద పురాణం’ లోని కాశీ ఖండం చెపుతున్నది.
“దక్షిణ శ్రుతి మీదుగా ధాత్రి తెళ్ళి
పెద్ద నిద్రకు మ్రోగన్ను పెట్టు వేళ
పంచజనులకు తారక బ్రహ్మ విద్య
అభవు డుపదేశ మొనరించు నపుడు కాశి”
ప్రాణనిర్యాణ వేళలో సాక్షాత్తూ పరమశివుడే వచ్చి, మన కుడి చెవిలో తారక మంత్రం ఉపదేశం చేసి మోక్షం ప్రసాదిస్తాడని శ్రీనాధుడు కాశీ ఖండంలో చెప్పారు.
శాస్త్రం చెప్పేది మాత్రం సూటిగా, నిష్కర్షగా వుంటుంది. సత్కర్మాచరణ ద్వారా చిత్తశుద్ధి, చిత్తశుద్ధితో జ్ఞానం, జ్ఞానంతో మోక్షం. ఇవీ మోక్షసాధనకు సోపానాలు.
కర్మలు దగ్ధమయేది జ్ఞానం తోనే. “జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణమ్” అని కదా భగవానుని వాక్యం! “గీతలో చెప్పనిది నేనేదీ చెప్పటం లేదు – చెప్పే విధానం వేరు కావచ్చు గాని” అన్నది అమ్మ వాక్యం! అలాగే “జ్ఞానాదేవ తు కైవల్యం” అని ఆర్షవాక్యం! అదే అమ్మ ప్రసాదించే సుగతి.
మరి “అందరికీ సుగతే” ఎలా సాధ్యం? అంటే దానికి రాజమార్గం జిల్లెళ్ళమూడి మాత్రమే! ఒకటి “అన్నపూర్ణాలయం”. మనకు తెలియకుండానే మన కర్మలను దగ్ధం చేసి, అంతిమంగా జ్ఞానాన్ని ప్రసాదించి, తద్వారా కైవల్యాన్ని అందించేది “అన్నపూర్ణాలయం”.
ఇక్కడ మనం ఒక్కసారి గురుదేవులు శ్రీ శివానందమూర్తి గారి వాక్యాలు గుర్తు చేసుకోవాలి. “అమ్మ పెట్టే ముద్దలోని ఒక్కొక్క మెతుకు ఒక్కొక్క జన్మకు సరిపోతుంది. ఆ జన్మలిక నీకుండవు” అని సద్గురువుల వ్యాఖ్యానం. వారు ఇంకా ఇలా అంటారు.
“మాతృవాత్సల్యం కోరుకుంటారు మనుషులు. నిన్ను తీసుకువెళ్ళటానికి వచ్చాను అంటే భయపడతారు. ఆ మాట వాళ్ళకి చెప్పకూడదు. మామూలు మాతృవాత్సల్యంతో ఏదో అన్నం ముద్దలు పెడుతున్నదే, అలా పెట్టినట్లే పెట్టాలి. పెట్టి, వారికి ఏమి పెడుతుందో, ఎందుకు పెడుతుందో అమ్మకి తెలుసు. వీళ్ళు – అమ్మ నాకు ప్రసాదం పెట్టింది. ఆ మర్నాటి నుండే నాకు ఆరోగ్యం బాగుపడింది. నా పిల్లలు పరీక్షలు పాసయ్యారు, అమ్మ అన్నం తిన్నాక అని అనుకుంటారు. అయితే కావచ్చు కాని, అమ్మ దానికోసం అన్నం పెడుతుందా? ఆమె పెట్టే ఒక మెతుకూ ఒక జన్మకు సరిపడా తృప్తమయిపోయింది. అనేక జన్మ పరంపర హ్రస్వమయి పోయింది. జన్మ పరంపర అంతా జీరో అయిపోయింది” అంటారు సద్గురు శ్రీ శివానంద మూర్తి గారు.
ఆలోచిస్తే, “ఇక్కడ ఎవరి అన్నం వారి కున్నది” అన్న అమ్మ మాటలలోని అంతరార్థం కూడా ఇదే ననిపిస్తుంది. మరి ఎవరి కర్మ వారిదే కదా! ఇది అన్నదానం కాదు. కర్మ నిర్మూలనం చేసే మాతృయాగం. “నేను ఏది వేసినా అన్నపూర్ణాలయంలోని గాడిపొయ్యిలోనే వేస్తాను” అన్న అమ్మ మాటలు కూడా ప్రస్తుతం స్మరణీయమే.
ఈ వాక్యాలలోని సత్యం సుబోధకం కావాలంటే కొంత అంతర్ముఖత్వం కావాలి. మరి అమ్మ “అంతర్ముఖ సమారాధ్య” కదా!
ఇక, రెండవ రాజమార్గం – అమ్మ నామ జపం, సంకీర్తన. నామ జపంతో, నామ సంకీర్తనతో కర్మలు దగ్ధమవుతాయని కూడా అమ్మ వాక్యం! దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ కూడా ఉంది.
సోదరుడు రావూరి ప్రసాద్ తండ్రిగారైన రావూరి నరసింహ మూర్తి గారు దేహం చాలించారు. అంత్యక్రియలు ప్రసాద్ గారు పూర్తి చేశారు. మరునాటి నుండీ సాంప్రదాయకంగా నిత్యకర్మ చేయవలసి వుంది. ప్రసాద్కి ఏదైనా అమ్మ చెప్పినట్లు చేయటమే తెలుసు. అమ్మ వద్దకి వెళ్ళి అనుమతి కోరాడు. ఆ సమయంలో అమ్మ చెప్పిన మాటలు చిరస్మరణీయం!
“నాన్నా! కర్మ అంటూ వుంటే అది వాడు చేసిన నామంతో దగ్ధమయిపోయింది. ఇక ఏ కర్మకాండా అవసరం లేదు. నువ్వు వెళ్ళి హైమాలయంలో అభిషేకం చేసుకో ఈ పదిరోజులూ!” అని ఆదేశించింది. అమ్మ ఆదేశం శిరోధార్యంగా భావించి, బంధువులందరూ వ్యతిరేకిస్తున్నా ప్రసాద్ అమ్మ చెప్పినట్లే చేశాడు.
ఇక్కడ అమ్మ చెప్పిన మాటలలోని ఆంతర్యం జాగ్రత్తగా గ్రహించాలి. ప్రసాద్ అలా చేశాడు కదా అని అందరూ కర్మకాండ మానేసి అభిషేకం చేసుకోమని అర్థం చేసుకుంటే పొరపాటు. రావూరి నరసింహమూర్తి గారి విషయంలో ఆ ఆదేశం ఇస్తూ లోకానికి అందించిన ఒక అపూర్వ సందేశం అది! అఖండ నామస్మరణలోని అమోఘ ప్రభావం ఆ సందర్భంగా తెలియజేసింది. నామస్మరణ త్రికరణ శుద్ధిగా చేసినవారికి అంతిమంగా లభ్యమయే మహెూన్నత స్థితిని తెలియచేసింది అమ్మ! మన విధ్యుక్త ధర్మం విస్మరించమని కాదు.
జిల్లెళ్ళమూడిలో అమ్మ ఏర్పరచిన ఈ రెండు వ్యవస్థలు, “అన్నపూర్ణాలయం”, “అఖండ నామ సంకీర్తన”
ఈ రెండూ మానవాళి అభ్యుదయానికి, తరించడానికి సులభోపాయాలు.