మన దగ్గర నున్న బంగారు ఆభరణాలు అన్నింటిలోను బంగారాన్ని శుద్ధమైన బంగారపు కణికగా చేయటానికి వీటన్నింటిని కలిపి ఒక పాత్రలో పోసి అగ్నిలో పుఠం పెడతారు. అది కరిగిన తరువాత దానిని పూర్తిగా కడిగి దానిలోని మిశ్రమ పదార్థాలన్నీ పోయిన తరువాత దానిని మూసలో పోసి దానిని తీసి కొలిమిలో పెట్టి సమ్మెటతో దానిని బంగారు కణిక తయారు చేస్తారు.
మనకు నెయ్యి కావాలంటే పాలను పాత్రమీద వేడి చేసి దానిని తోడు పెట్టి పెరుగు చేసి దానిని చిలికి మజ్జిగ చేసి దానిలోని వెన్నను కరగపెట్టి నెయ్చి చేస్తారు. అప్పుడు గాని నెయ్యి రాదు. పాల నుండి పంచబడ్డ పంచామృతాలను తియ్యటానికి, శుద్ధబంగారం తియ్యటానికి ఎట్లా ఆ పాలుకాని, బంగారు నగలుకాని రూపాంతము చెందవలసి వచ్చిందో వాటి processing ను పరికిస్తే జీవాత్మ పరమాత్మగా రూపాంతరం చెంది అదే పరమాత్మగా అవుతుంది. అట్లాగె మనలో ఉన్న సంసారము మనమున్న సంసారము నుండి విముక్తి పొంది అనగా అనేక నేనులుగా వున్న వీరండరు ఒకే నేనుగా రూపాంతరం చెంది ఈ ఒక్క నేను మాత్రమే మిగిలితే అదే అహం బ్రహ్మాస్మి లేదా అందరినీ ప్రేమించి అందరిలో తననే చూచుకున్నట్లయితే అంతా తానౌతాడు.
ఈ విధానమే కాబోలు రాజు రాసిన పాటలో –
అందరి హృదయాల వెలుగు హైమ
ఎందు దాగినావో తెలుపుమమ్మా
ఈ జగతికి పావనమై ఈ ప్రగతికి జీవనమై
– అమరమైన అమ్మ లాంటి హైమ।।
జాలిలోన జీవితమే చిలికి
కాలపురుషు కరములలో నలిగి
తారలలో తారకవై – మాలో ధృవతారకవై
నిలిచినట్టి నీలి కనుల హైమ ॥
అని అనటంలో నాకు ఈ పైభావం స్ఫురించింది.