అమ్మ సంధ్యావందనంలో పాల్గొనేందుకు సో॥ శ్రీ బి.జి.కె. శాస్త్రిగారింటికి వెళ్ళాను. పూజ, తీర్థ ప్రసాద స్వీకరణానంతరం వారి ఇల్లంతా చూపించారు. పూజా మందిరం, డ్రాయింగ్ రూమ్ అన్నీ మామూలే. ఒక ప్రత్యేకత ఉంది. ఒక గదిని అమ్మకి విశ్రాంతి మందిరంగా తీర్చిదిద్దారు. దానిని ధ్యాన మందిరంగా, బంగారు కోవెలగా సంభావన చేస్తారు. అక్కడ అమ్మ ఉంటుంది; అమ్మే ఉంటుంది; ప్రాపంచిక వస్తుసామగ్రి, విషయ సముదాయము, బంధ హేతువైన వాసనాభారమునకు తావు లేదు. శ్రీ శాస్త్రిగారి మనో మందిరంలో సుప్రతిష్ఠితమైన అమ్మే విరాజిల్లుతున్నది అక్కడ. అదీ వారి నుంచి నేర్చుకోవాల్సింది.
బెంగుళూరు సో॥ శ్రీ అంగర సూర్యనారాయణ గారింటికి రెండు మూడు సార్లు వెళ్ళాను. కుటుంబ సమేతంగా శ్రీ అనసూయా వ్రతం, శ్రీ హైమవతీ వ్రతాలను కడు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అది డిసెంబర్ నెల. హేమంత ఋతువు. కావున ఒక పాత్రలో వేడి నీళ్ళు తీసికొని తగుపాళ్ళలో దానికి చన్నీటిని చేర్చి గోరువెచ్చని ఆ ఉష్ణోదకంతో అమ్మను అభిషేకించారు. వారి అపూర్వ అపురూప ఉపచారానికి నాకు ఆనందం ఆశ్చర్యం కలిగాయి ! యదార్ధమే.. మనం వేడి నీళ్ళతో స్నానం చేసి అమ్మని చన్నీళ్ళతో స్నానం చేయించటం భావ్యమా? లౌకిక దృష్టిలో అది ఒక పంచలోహవిగ్రహం; కానీ వారి ఉపనయన దృష్టిలో అది రక్తమాంసాదులతో, కరచరణాద్యవయవాలతో మన కళ్ళ ముందు నడయాడిన మధుర మమకారాకృతి, మహిమాన్విత మాతృమూర్తి ‘అమ్మ’. అదీ వారి నుంచి నేర్చుకోవాల్సింది.
1972 సంవత్సరము ఏప్రిల్ నెల మాతృశ్రీ సంచికలో శ్రీరామకృష్ణ అన్నయ్య “నేనందరినీ ప్రేమిస్తాను” అనే సంపాదకీయం వ్రాశారు. ఇటీవల దాని కోసం “మాతృసంహిత’ తెరిచాను. కానీ అందు కొన్ని పంక్తులు లుప్తమైనవి. మరొక ప్రయత్నంగా (M.D.C)ని ఆశ్రయించాను. అందునా ఆ సంచికలో మొదటి పది పేజీలు ముద్రితం కాలేదు. ఏతా వాతా సంచిక ఎక్కడ లభిస్తుంది’ అని అన్వేషించాను. ‘మాతృశ్రీ’, ‘విశ్వజనని’, ‘Mother of All’ పత్రికలు ఆవిర్భవించినది మొదలు నేటి వరకు ముద్రితమైన ప్రతుల నన్నింటినీ binding చేయించి శ్రద్ధగా అద్దాల బీరువాలో భద్రపరచుకున్న ఒక సోదరులు గుర్తుకు వచ్చారు. వారు శ్రీ పి.ఎస్.ఆర్. ఆంజనేయప్రసాద్. అదీ వారి నుంచి నేర్చుకోవాల్సింది.
ఇటీవల ఫైలిన్ తుఫాన్ కోస్తా ప్రాంతాన్ని గజగజ లాడించిన రోజు అది. నాటి రాత్రి గం 11.00లకు హైదరాబాద్ నుండి సో॥ ఈమని కృష్ణ సతీ సమేతంగా జిల్లెళ్ళమూడి వచ్చారు. అందరింటి ముంగిలి పరమ ప్రశాంతంగా ఉంది. తుఫాన్ తాకిడికి జనసంచారం లేదు. వారు రాగానే సోదరి బ్రహ్మాండం శేషు స్వయంగా అన్నపూర్ణాలయం తలుపులు తెరచి ఆదరణగా అన్నం పెట్టి తగిన వ్యక్తికి కబురుచేసి వసతి ఏర్పాటు చేసింది. అందుకు వారెంతో సంతోషించారు. మనం అమ్మను చూసి నేర్చుకున్నది ఆదరణ, ఆప్యాయతలనే కదా!
సకల జగదాధార జగదారాధ్య అయిన అమ్మను మన సోదరీ సోదరు లెందరో సహస్రరీతుల్లో అర్చిస్తున్నారు. డా॥ ప్రసాదరాయ కులపతి, డా॥ పన్నాల రాధాకృష్ణ శర్మ, డా॥ పొత్తూరి వెంకటేశ్వరరావు, శ్రీ మన్నవ బుచ్చిరాజుశర్మ, డా॥ బి.యల్. సుగుణ మొదలైన అన్నయ్యలు, అక్కయ్యలు సాహిత్య ప్రసూనాలతో వాఙ్మయరూపిణి, అక్షరస్వరూపిణి అమ్మ శ్రీచరణాల నర్చిస్తున్నారు.
సో॥ శ్రీ పొత్తూరి ప్రేమగోపాల్ అద్వైతామృత వర్షిణి ఆశ్రిత కల్పవల్లి, కరుణారస రంగవల్లి అయిన హైమక్కయ్య అతిమానుషతత్వానికి, ఆర్తత్రాణ పరాయణత్వానికి దర్పణం పడుతున్నారు.
సో॥ శ్రీ వి. ధర్మసూరి సౌరశక్తి పథకం, ఊరగాయల ఉత్సవం వంటి జనకళ్యాణ పథకాలను జయప్రదంగా నడిపిస్తున్నారు.
జిల్లెళ్ళమూడి అమ్మ సేవా సమితి అధ్యక్షులు శ్రీ వి.ఎస్.ఆర్. ప్రసాదరావు. అన్నయ్య కారుణ్య రసామృతమూర్తి అమ్మ హృదయానికి దర్పణం పడుతూ భాగ్యనగరంలో అసంఖ్యాక అభాగ్యులకు సేవలనందిస్తున్నారు.
కొందరు అమ్మకు ప్రియాతి ప్రియమైన అన్నపూర్ణాలయ నూతన భవన నిర్మాణం, నిత్యావసర వస్తు సముదాయ సేకరణ సమర్పణలోనూ మాతృయాగ క్రతునిర్వహణలో బద్ధకంకణులై శ్రమిస్తున్నారు: జగన్మాత ఉపకరణాలుగా, అవయవాలుగా తపిస్తూ…
కొందరు జిల్లెళ్ళమూడిలో స్థిరనివాసం ఉంటూ సుప్రభాతం, సంధ్యావందనం, నామ సప్తాహాలు, ఏకాహాలు నిర్వహిస్తూ….
కొందరు విద్యాలయం, వైద్యాలయం, వేదపాఠశాల, యాగశాల… వంటి సేవాకార్యక్రమాల్ని దీక్షతో దక్షతతో నిర్వహిస్తూ….
కొందరు అనునిత్యం ఉదయం అమ్మకు స్నానం చేయించి బొట్టుపెట్టి, చీరెకట్టి ఆభరణాల్ని అలంకరించి – రాత్రి ఆలయ పూజాది కైంకర్యానంతరం పవళింపు సేవ నిర్వహిస్తూ….
ఎందరో స్వచ్ఛందంగా, నిర్విరామంగా, నిర్విఘ్నంగా జన్మదాత జగన్మాత అమ్మను అర్చిస్తున్నారు; అమ్మప్రసాదించిన జీవితకుసుమాన్ని అమ్మ శ్రీచరణ సేవకే వినియోగిస్తున్నారు.
అంతేకాదు.
‘పట్టెడన్నముకూడ కరవై
కష్టాల సుడులలో బ్రతుకంత బరువై
గర్భదారిద్ర్యమున కృంగి కృశించు
నిర్భాగ్య జీవులకు నిత్య శ్రీరస్తని’ ॥
శ్రీరస్తని – శుభమస్తని
దీవించుమమ్మా! దీర్ఘాయురస్తని ॥’ అని అమ్మను అభ్యర్థించారు శ్రీరాజు బావ.
‘పట్టె డన్నము కూడ కరవై’ అంటే కూడు గుడ్డ లేని నిరుపేదలనే కాదు; Sugar, B.P., Rheumatism … వంటి రుగ్మతలతో అన్నీ ఉన్నా ఏదీ తినటానికి ఎక్కడికీ తిరగటానికి లేని దీనస్థితిలో ఉన్న ఆపన్నులూను. అట్టివారికి రక్తసంబంధ బాంధవ్య అనురాగంతో చేయూతనందించే వారు శ్రీమాతకి వారసులే.
వారెక్కడున్నా అది జిల్లెళ్ళమూడే. కావున,
ఎందరో మహానుభావులు కాదు:
అందరూ మహానుభావులే.