ఈ మాట అన్నది సాక్షాత్తు అమ్మ. ఇందులో ఇమిడియున్న విశేషార్ధము తీవ్ర ముముక్షువులకు తప్ప, తదితరులకు అవగాహన కాదు. నన్నయ, తిక్కనాది మహా కవులు శ్రీమద్భాగవతాన్ని తెనిగించక, ఆ అవకాశం శ్రీ బమ్మెర పోతన్నగారికి దక్కెట్లు చేశారు. అలాగే శంకర భగవత్పాదులు శ్రీ లలితా సహస్రనామాలకు తానుగా భాష్యం వ్రాయక, ఆ అవకాశాన్ని అమ్మ ఆశీస్సులతో మచిలీపట్నం వాస్తవ్యులు శ్రీమల్లాప్రగడ శ్రీరంగారావుగారికి సంక్రమింప చేశారు. ఆ వ్యాఖ్యాన గ్రంథం ‘భారతవ్యాఖ్య”గా ప్రసిద్ధి నొందినది. మన సోదరీ సోదరులలో ఈ వ్యాఖ్యాన గ్రంధమును భక్తి ప్రపత్తులతో పఠించని వారుండరు. చదివి లాభపడని వారూ ఉండరు.
అందరూ మహానుభావులే అన్న మాటను అసంపూర్ణ ప్రజ్ఞావంతులు జీర్ణించుకోలేరు. కొంత అర్థమైనట్లనిపించినా, ఆచరణలో ఆ చూపునలవరచు కోవటానికి ఇబ్బంది పడతారు. ఇది అర్థం కావటానికి, ముముక్షువులైనవారు, సిగ్గు విడిచి, తమ తమ తప్పులను ఒప్పుకొని అమ్మకు మోకరిల్లాలి. అప్పుడుగాని ఇతరుల రూపంలో అమ్మ మన వద్దకు వచ్చి చేసిన రహస్య బోధ స్పూరింపనే స్పురింపదు. మన తెలివితేటలు, పాండిత్యాలు ఈ విషయంలో ఎందుకు కొరవగావు. అమ్మ అలతి పదాలలో ఏ మాట చెప్పిన అలానే ఉంటుంది. అందుకే అమ్మ వాక్యాలు కలిగిన ఈ మీ రచనలు మా వంటి వారికి వచనా మృతాలనిపిస్తు శిరోధర్యలవుతయి.