(గత సంచిక తరువాయి)
‘జాత్యంధమేన మవలోక్య వివేక విత్తం
కామాది తస్కరగణో రభసాజ్జహార |
మోహాంధకార పతితస్య శివే 2 నసూయే!
మాతర్భవాని! మమదేహి కరావలంబమ్ ॥’ – (13)
దీని అర్థం: ‘అమ్మా! పరమేశ్వరీ! పుట్టు గుడ్డి ఐన నా యొక్క వివేకం అనే ధనాన్ని ‘కోరికలు అనే చోరులు దోచుకుపోయారు. వివేకహీనుడనై అజ్ఞానాంధకారములో పడి మార్గం కానరాకున్నాను. దయతో నాకు నీ చేయూత నిమ్మా!’ – అని.
సాధారణంగా ప్రతి ఒక్కరికి రెండు నేత్రాలుంటాయి; అవి భౌతిక ప్రపంచాన్ని చూపిస్తాయి, ఎండమావుల్లాంటి కోరికలు పిచ్చివానిని చేస్తాయి. కావాల్సింది జ్ఞాననేత్రం. ఆ దృష్టి అమ్మ అనుగ్రహం వలననే లభ్యం. ధృతరాష్ట్ర మహారాజుకి శ్రీకృష్ణపరమాత్మ విశ్వరూప సందర్శన భాగ్యాన్ని ప్రసాదించారు. అట్లే అంధులైన సోదరులు శ్రీ కాసు రాధాకృష్ణరెడ్డి, శ్రీ యార్లగడ్డ రాఘవయ్య గారలు అమ్మ దివ్యదర్శన భాగ్యాన్ని పొందారు. ఆ విధంగా తర్కించుకుంటే చాలమంది కళ్ళు ఉన్నా గుడ్డివాళ్ళే. విద్యాగంధము లేని వారంతా జనుషాంధులే. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. కావున శ్రీ శర్మగారు ప్రస్తావించిన అంధత్వము అజ్ఞానాంధతమసం, అవిద్యా సంజనితం.
‘కష్టం! బలాన్నియమితం చ మనో మదీయం
దుర్భావనాపథముపైతి ముహుర్వినింద్యమ్ |
రుగ్నస్య భుగ్న హృదయస్య శివే 2 నసూయే !
మాతర్భవాని! మమదేహి కరావలంబమ్ ॥’ – (20)
దీని అర్థం: పరమేశ్వరీ! తల్లీ! బలవంతంగా నిగ్రహించినప్పటికీ నా మనస్సు నా వశము దప్పి మాటిమాటికి చెడు తలంపుల్ని పొందుతోంది. నన్ను ఆదుకొనుమమ్మా! అని.
తల్లి అనగా ‘తొలి’, మూలము అని అమ్మ నిర్వచించింది. అంటే ఆది భవం; దేవతా గణానికి పూర్వమే ఉన్నది. అట్టి సత్యం, జ్ఞానం, అనంతం అయిన బ్రహ్మే అమ్మ. అమ్మ అవతార లక్ష్యం: మిధ్యాహంకారాన్ని నశింపజేసి ఆత్మనిష్ఠను ప్రసాదించడం. అది ‘నేను నేనైన నేను’ అయిన అమ్మకే సాధ్యం. ‘ఏం చేస్తే బ్రహ్మత్వ సిద్ధి వస్తుంది.’ అని అడిగితే అమ్మ, “ఏం చేసినా రాదు. వాడు (దైవం) ఇస్తే వస్తుంది” – అన్నది. అది సంశయచ్ఛేద వచనం. ముమ్మాటికీ వాస్తవం. మన మనోమాలిన్యాలను కడిగి శుభ్రం జేసేది అమ్మ; తరింపజేసే తల్లి అమ్మ. గుణభేదం లేనిది అమ్మ. అనన్య సామాన్య కారుణ్య వారాశి అమ్మ. అమ్మ దరిజేరటమే తత్త్వతః ఆత్మాన్వేషణ మార్గం, సత్యశోధనం.
‘సూచీముఖ ప్రతిభటైః శృతి భేద నోగ్రైః
సోల్లుంఠనైః కటుభిరుద్ధత బాంధవానామ్ ।
విద్ధస్య శాంతి వికలస్య శివే 2 నసూయే!
మాతర్భవాని! మమదేహి కరావలంబమ్ ॥’ – (21)
దీని అర్థం: ‘అమ్మా! శివంకరీ! గర్వంతో కన్ను మిన్ను కానని బంధువుల యొక్క సూటిపోటి మాటలు శూలాల్లా నా చెవులను గాయపరచి బాధిస్తున్నాయి. మనశ్శాంతి లేదు. అమ్మా! దయతో నాకు నీ చేయూతనిమ్మా!’ – అని.
రాబందులు జంతువులను ముక్కుతో పొడిచి చీల్చి పేగుల్ని వడేసిలాగి ఆరగించి విందు చేసుకుంటాయి. అదే విధంగా బంధువులు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తారు. కష్టకాలంలో నిష్ఠుర వచనాలతో దెప్పి పొడుస్తూ నాలుగు రాళ్ళు విసురుతారు; పుండు మీద కారం చల్లి వినోదిస్తారు. ఈ శ్లోకంలో కవి వాస్తవాన్ని యధాతథంగా అక్షరబద్ధం చేశారు. ఇది ఊహ కాదు; కల్పనా చాతుర్యం కాదు. రెక్కలు అలిసి కదలలేని అసహాయ స్థితిలో గుండెల్లో గునపాల్ని దించుతారు రక్తసంబంధీకులే. ‘మాకు ఏం ఇచ్చారు? ఏం చేశారు? నాకు మొదటి నుంచీ అన్యాయమే జరిగింది’ అంటూ మాటలు అనే బాకుల్ని విసురుతారు. ఆ నిస్సహాయుల కన్నీటిని తుడిచి వారి గుండె నిండుగా శాంతిని నింపేది వృద్ధాశ్రమాలు కాదు; ఆత్మబంధువు, ఆప్తబంధువు అమ్మ మాత్రమే.
‘అజ్ఞాతయుష్మదతి మానవ దివ్యతత్వః
యామి త్వదీయ పదముల మహో! కుతో పి |
జ్ఞేయావబోధపరయా కృపయా 2 నసూయే !
మాతర్భవాని! మమదేహి కరావలంబమ్ |’
దీని అర్థం: ‘అమ్మా! అనసూయాదేవీ! అలౌకికమైన నీ దివ్యస్వరూపం నాకు తెలియదు. అయినా నీ పానవ పాదసన్నిధికి చేరుకున్నాను. దయతో తెలిసెడి తెలివిని తెలుపవమ్మా! పరమార్థాన్ని బోధించవమ్మా! దయతో నీ చేయూత నిమ్మా!’ అని. “నేను దగ్గరకు తియ్యటం తప్ప, మీరు దగ్గరకు రావటం కాదు” అని అన్నది అమ్మ.
కుల, మత, వర్ణ, వర్గ విభేదరహితంగా జడచైతన్య భేద రహితంగా అందరినీ అన్నిటిని తన సంతానంగా ప్రేమిస్తుంది అమ్మ. తన ఒడిలో వేసుకుని లాలించి గుండెలకు హత్తుకుంటుంది. ఉగ్గుపాలతో ఉపనిషత్సారాన్ని రంగరించి పోస్తుంది. చేతలు చేతుల్లో లేవని విస్పష్టం చేస్తుంది; సంసార బాధ్యతలూ ఆధ్యాత్మిక సాధనే అని వెన్నుతట్టి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ‘నీకున్నది తృప్తిగా తిని, ఇతరులకు ఆదరంగా పెట్టుకో’ అని పంచటమే పరమార్థం అని ఆచరణాత్మకంగా ప్రబోధిస్తుంది.
దివ్య మాతృప్రేమ స్వరూపిణి అమ్మ. అమ్మకి ప్రేమ సహజం, సహజాతం; అది వ్యక్తుల గుణగణాల్ని, ప్రయోజకత్వాన్ని, సిరిసంపదల్ని, పాండిత్యాన్ని, పరాక్రమాన్ని చూసి కాదు. ఏవిధంగా ఎవరెవరు అమ్మదరి చేరగలిగినా, అమ్మ శ్రీచరణ సేవాభాగ్యానికి నోచుకున్నా వారంతా ధన్యులే. ‘ధన్యాస్తే భవ దీక్షణ క్షణగతేః పాత్రీకృతాః స్వీకృతాం’ అని అన్నారు శంకరులు. జగన్మాత అనుగ్రహానికి పాత్రులై ఎంపిక అయిన వారంతా చరితార్థులే.
‘పశ్యన్తి కేచన పశావపి మానవత్వం
హా! మానవే 2 హమధమః కలయే పశుత్వామ్ |
కోవాస్తి మత్సమ జడోభువనే 2 న సూయే !
మాతర్భవాని! మమదేహి కరావలంబమ్ ||’ (23)
దీని అర్థం: ‘అమ్మా! పరమేశ్వరీ! కొందరు పశువులో కూడా మానవత్వాన్ని చూస్తుంటే, నేను మనిషిలో పశుత్వాన్ని చూస్తున్నాను. మూఢుడను. నన్ను ఆదుకొనుము తల్లీ!’ అని.
అమ్మ దివ్య పాద సన్నిధిలో జంతువులు సైతం యోగమార్గంలో ఉన్నత భూమికల్ని సాధించాయి; నియమనిష్ఠలు పాటించాయి, ఆహారాన్ని స్వీకరించ కుండా ఉపవాసాలూ, ఉపాసనలు చేశాయి. మానవజన్మే ఉన్నతమైనది, ఉత్కృష్టమైనది అని తలపోయటం సర్వసాధారణం. కానీ అమ్మ, “మానవజన్మే ఉత్తమ జన్మ అని అనను” అన్నది. పరోపకారార్థం చెట్లు ఫలాన్ని అందిస్తున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, జంతువులు పాలు ఇస్తున్నాయి, వాయువు వీస్తోంది. జంతువులు, మొక్కలు, జడపదార్థాలుగా పిలువబడేవి మూర్తీభవించిన సేవాభావంగా తమ జీవితాన్ని కరిగించి కర్పూరహారతి పడుతున్నాయి. కాగా మనుష్యుల్లో కొందరిలో ఒక్కొక్కసారి దైత్యప్రవృత్తి, దౌర్జన్యాన్నీ చూస్తున్నాం. “తమకై అన్యహితార్థ ఘాతుకజనుల్ దైత్యుల్’ అని భర్తృహరి అంటే, ‘దయలేని వాళ్ళంతా దయ్యాలే’ అన్నది అమ్మ. అమ్మ సన్నిధిలో కుక్కలు, పాములు, ఆబోతు మొదలగు జంతువులు భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గాల్లో యోగసాధనలో సేవాతత్పరతలో ఆదర్శప్రాయంగా విరాజిల్లాయి.
రఘువంశంలో కాళిదాసు మహాకవి అత్రి మహాముని ఆశ్రమ వాతా వరణ ప్రభావాన్ని వర్ణిస్తూ ‘అనిగ్రహత్రాస వినీత సత్వం, అపుష్పలింగా త్ఫలబంధి వృక్షం’ అని అన్నారు. క్రూరజంతువులూ పెంపుడు జంతువుల్లా తిరుగుతాయి సహజంగా. మొక్కలు పుష్పించకుండానే ఫలభరితమౌతాయి. అది అతి మానవ దివ్యత్వం.
పశుపాశ విమోచని అయిన అమ్మ అనుగ్రహం ఉంటే విశేషం సహజం అవుతుంది, అసాధ్యం సుసాధ్యం అవుతుంది, అవాజ్మానసగోచరమైనది కన్నుల ముందు అమ్మ చేతిలో గోరుముద్ద అవుతుంది. అందరికీ అందుతుంది.
(సశేషం)