మా స్వస్థలం గుంటూరు. జిల్లెళ్ళమూడి అమ్మను గురించి వినడమేకానీ నేను చూసి ఉండలేదు. ప్రత్యేకించి నాకు అంత పెద్దగా తెలియదు. నాకు వివాహమైంది – పిల్లలు హైదరాబాద్ వచ్చేశా; ఉద్యోగం చేసు – కుంటున్నాను. జీవితం సాఫీగా గడుస్తోంది.
రెండు మూడు నెలల క్రితం నాకు ఒక కల వచ్చింది. కలలో తెల్లవారు జామున గం. 3.30 ల ప్రాంతంలో Bath Room కి వెళ్ళానట. అది ఇంటి బయట ఉన్నది. మా ఎదురింటివారి పూజా మందిరము మా ఇంటికి అభిముఖంగా ఉంది. 70 ఏండ్ల పెద్ద ముత్తైదువ ఆమె. నేను లోపలికి వస్తూంటే నన్ను చూసి, “అనసూయా! పూజ మొదలు పెట్టుకుంటున్నాను. దణ్ణం పెట్టుకుందువు గాని ఒక్కసారి రా!” అని పిలిచారు. నేనేదో Bath Room కి వెళ్ళి లోపలికి పోయి పడుకుందా మనుకుంటూంటే ఈమె రమ్మని పిలుస్తున్నారే. ఆ మాట అంటే ఎలా ఉంటుందోనని కొంచం మొహమాటంగా ‘నేను స్నానం చేయలేదు, పూజ అంటే రాలేనండి’ అన్నాను. ‘అలాకాదు. నువ్వు ఒక్కసారి వచ్చి అమ్మవారిని చూసివెళ్ళు. ఎంత బాగున్నారో!’ అన్నారామె. సరే. కాదనలేక నిద్ర మొహంతో అలాగే వెళ్ళాను. ‘చూడు. అమ్మవారికీ నాకూ ఒకేరకమైన చీర కొనుక్కున్నాను – పసుపురంగుకి ఎర్రటి అంచు. చీర అమ్మవారికి కట్టి నేను కూడా కట్టుకున్నాను’ అన్నారు. ఆ దృశ్యం ఇప్పటికీ కళ్ళకి కట్టినట్లు కనిపిస్తోంది నాకు. ‘చాలా బాగుందండి’ అంటూ అమ్మవారిని చూశాను. ఆ గది మధ్యలో అమ్మవారు, చుట్టూ ధూపదీపాలు – పూజాద్రవ్యాలు. ఆ వాతావరణం అంతా బ్రహ్మాండంగా ఉంది; అద్భుతంగా ఉంది. చూస్తే – అక్కడ జిల్లెళ్ళమూడి అమ్మవారు. అక్కడ విగ్రహంలా కాకుండా (సశరీరంగా) మనిషిలాగ కూర్చొని కనిపించారు. ఆమెకు నేను నమస్కారం చేసుకుంటూంటే “దగ్గరకు రా” అని పిలిచారు. నాకు మరింత మొహమాటం వేసింది; అమ్మవారు పిలుస్తున్నారు. “అమ్మా! నేను స్నానం చేయలేదు, ముఖం కూడా కడుక్కోలేదు” అన్నాను. “ఏం ఫరవాలేదులే, రా!” అంటూ సైగచేస్తూ ‘దా! నా దగ్గరికి’ అని పిలిచారు. సరే, వెళ్ళి దణ్ణం పెట్టుకున్నా. నా తలమీద ఆమె కుడిచేత్తో గట్టిగా వత్తి “నీకేం భయం లేదు. అంతా మంచే జరుగుతుంది ఎప్పుడూ. వెళ్ళు”అన్నారు. ఆమె చేతిస్పర్శ ఇప్పటికీ నేను అనుభవించగలుగుతున్నా. మీతో మాట్లాడుతూ నాఅనుభవాన్ని పంచుకుంటూంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది.ఆమె నా కలలోకి ఎందుకు వచ్చారో, ఎందుకు అనుగ్రహించారో – దీవించారో తెలియదు. ఆ తర్వాత Internet లో ఆమెను గురించి వెదకటం మొదలుపెట్టాను. ఆమెపేరూ అనసూయే, నా పేరూ అనసూయే; నాకు అంతవరకే తెలుసు. యాదృచ్ఛికం అయినా భలే ఆశ్చర్యం అనిపించింది. అది నాకు మరుపురాని సంఘటన. అంతేకాదు.
ఈ విషయం నేను వెంటనే శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మిగారితో పంచుకోవాలనిపించింది. అనుకోకుండా 14-08-21న వారింటికి వెళ్ళటం, ఆమెతో చెపుతూండగా ప్రక్కనే మా ఆరేళ్ళ అమ్మాయి చైత్ర కూడా ఉంది. విజయలక్ష్మి గారింటికి వెళ్ళగానే అక్కడ అమ్మ ఫొటో చూసి మా అమ్మాయి “అమ్మా! వీరిని నేను చూశాను” అంది. “నువ్వు ఎక్కడ చూశావు?’ అని అడిగితే కాస్సేపు మాట్లాడలేదు. తర్వాత “నువ్వు Internet లో చూస్తున్నపుడు నేను చూశాను” అంది. ‘ఓహో! అలాగా’ అనుకున్నా.
తర్వాత, ‘వాళ్ళ ఇంటికి వెళ్ళినపుడు చూశాను’ అంది. ‘వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళావు నువ్వు?”అని అడిగా. “ఒక తాతగారు పెంచుకుంటున్నారు కదా, వాళ్ళింటికి వెళ్ళాము కదా!” అంది. నేను కాసేపు ఆలోచించా. ఈ ఏడాది జనవరి నెలలో మేము బాపట్ల వెళ్ళి, అక్కడినుంచి చందోలు వెళ్ళాము. చందోలు పూజ్యశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణశాస్త్రి గారింటికి వెళ్ళినపుడు తనతో చెప్పాను “ఇక్కడ బాల అమ్మవారు తిరిగారు. అలాంటి ఇల్లు ఇది. దణ్ణం పెట్టుకో” అని. “జిల్లెళ్ళమూడి అమ్మవారినే చందోలు శాస్త్రిగారు పెంచుకున్నారు. ఆ ఇల్లే మనం చూశాము. ఆవిడే ఈవిడ” అనే ఆలోచన కలిగింది దానికి. మరి అలా ఎందుకు కలిగిందో అలా చెప్పింది; అది భలే అనిపించింది నాకు. ఆ కల వచ్చిన తర్వాత Internet లో Photo చూసినపుడు – అదే చీర – ఎరుపు రంగు అంచుగల పసుపుపచ్చని చీర కట్టుకుని ఆమె చిత్రం ఎలా అయితే ఉన్నదో, నాకు స్వప్నంలో కనిపించింది అచ్చం ఆ రూపమే. అదే. ఇప్పటికీ నా కళ్ళముందు ఆ దృశ్యం – దర్శనం కదలుతూనే ఉంటుంది. నాకు ఎంతో సంతోషదాయకం అది.
(సహోదరి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి సౌజన్యంతో)