1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అక్షరయజ్ఞమ్ – అభిలషణీయమ్

అక్షరయజ్ఞమ్ – అభిలషణీయమ్

A V R Subramanyam
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 14
Month : August
Issue Number : 1
Year : 2014

అమ్మను గురించి వెలువడిన గ్రంధాలు 150కి పైబడి వెలుగు చూచినా 50 లోపు గ్రంధాలే నేడు లభిస్తున్నాయి. ఇటీవల ‘జిల్లెళ్ళమూడి అమ్మ నా అనుభూతులు’, ‘అమ్మత్వం’, ‘లో చూపు’ వంటి నూతన గ్రంధాలతో పాటు ‘ధన్యజీవులు’, ‘శ్రీవిశ్వజననీవీక్షణం’ వంటి సంకలన గ్రంధాలు, ‘మాతృదర్శనం’, ‘పూజాపుష్పాలు’ వంటి పునర్ముద్రణ గ్రంధాలు ఆవిష్కరించబడ్డాయి.

ఒక్క జులై 14 నెలలోనే ‘బ్రహ్మాండేశ్వరి’ సంకలన గ్రంధం, ‘అమ్మ అందించిన తత్త్వదర్శనం’ నూతన గ్రంథం, ‘మహోపదేశం’ పునర్ముద్రణ గ్రంథాలు ఆవిష్కరించ బడ్డాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రంధం వ్రాస్తున్నారు. ఇంత అవసరమా?- అనుకోవటం సహజం; కానీ అభిలషణీయమ్. ఎందువలన?

ఒక అవతారమూర్తికి సన్నిహితంగా మెలగటం పురాకృత తపఃఫలం. అందునా తరతమభేదం లేని యోగ్యతా యోగ్యతలను పరిగణించని అమ్మతో అసంఖ్యాకులు మమేకమై జీవించారు. అపురూపమైన అపూర్వమైన అనుభవాలను మూటగట్టుకున్నారు. ఆ మూటను విప్పి ఆ మధురానుభూతులను కొందరు మాత్రమే తోటివారితో పంచుకున్నారు.

ప్రేమైకరసామృతమూర్తి అయిన అమ్మ అందరికీ ఒకేరకమైన అనుభవాన్ని ఇవ్వలేదు. ఇందుకు నిరూపణ: ఇటీవల శ్రీ రావూరి ప్రసాద్ ఎంతో శ్రమకూర్చి 200 మంది పైగా సోదరీసోదరుల వీడియో ఇంటర్వ్యూలను భద్రం చేయటం. వాటిని అక్షరబద్ధం చేస్తే కనీసం వంద గ్రంధాలు వెలుగు చూస్తాయేమో!

అమ్మ హృదయంలో ఎవరిస్థానం వారిదే. అలాగే ఎవరి సమస్య, ఆర్తి, జిజ్ఞాస, తృష్ణ వారివే. వారి స్థాయికి తగ్గట్టు అమ్మ అందించిన పరిష్కారాలు, అనుగ్రహించిన విధానాలు, ప్రసాదించిన స్థితులు వ్యక్తిగతమైనవే, నిస్సందేహంగా ఎవరి అనుభవం వారికే పరిమితం; వేరొకరి కానే కాదు.

కాగా భగవద్విలాసాన్ని విభూతిని ఆర్తత్రాణపరాయ ణత్వాన్ని కరావలంబాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక్క భాగవతోత్తముని చరిత్ర చాలదా ? ఒక్క అసుర సంహార వృత్తాంతం చాలదా ? ప్రహ్లాద చరిత్ర, మార్గండేయ చరిత్ర, ధృవచరిత్ర, కుచేలోపాఖ్యానం, గజేంద్రమోక్షం, ద్రౌపదీమాన సంరక్షణం, సక్కుబాయి చరిత్ర; శుంభనిశుంభ, రావణ కుంభకర్ణ, నరకాసుర సంహారం ఇన్ని అవసరమా? అవశ్యం – అత్యవసరం. సర్వేశ్వరుని అనంత కళ్యాణ గుణవైభవాన్ని పునః పునః మననం చేసుకోవటం అత్యంత అవశ్యకం. అది కేవలం కృతజ్ఞతా పూర్వక స్మరణ. అమ్మ అవతారకాలంలో వీటికి ఉదాహరణలు కోకొల్లలు.

మనం రోజూ తినే అన్నం ఒకటే, అధరువులు అనేకం. అమ్మ విధానాలు అగ్రాహ్యములు, అనేకములు;

– ఎందరినో ప్రత్యక్షంగా పరోక్షంగా రక్షక కవచాన్ని కప్పి కాపాడుతోంది.

– ఎందరికో ఆయుర్దాయాన్ని పొడిగించింది. విధాత వ్రాసిన తలరాతను చెరిపి తిరగవ్రాసింది.

– అఖండ ఐశ్వర్యాన్ని, అనంత జ్ఞాన సంపదను ప్రసాదించింది.

– మనుష్యులకే కాదు, పశువులు – పక్షులు – మొక్కలకు యోగసాధనలో పరాకాష్ఠస్థితిని చిటికెలో అనుగ్రహించింది.

– స్వస్వరూప సందర్శన భాగ్యాన్ని అనాయాసంగా అలవోకగా నోటికి గోరుముద్దలా అందించింది.

– సర్వజ్ఞత్వ, సర్వవ్యాపకత్వ, సర్వశక్తిమత్వ అలౌకిక లక్షణాల్ని అనుదినం అనుక్షణం సహజంగా దినచర్యలో భాగంగా కళ్ళకి కట్టినట్లు దర్శింపచేసింది.

– మనోమాలిన్యాన్ని క్షాళనం చేసి సంస్కరించింది. 

– కర్తృత్వభావనకి బాధ్యత వహించి సముద్ధరించింది.

కనుక అస్తిక్యభావనికి, భగవత్కైంకర్యానికి దర్పణం పట్టే ఏ గ్రంధానికి ఆ గ్రంధమే విశిష్టమైనది, మధురమైనది, మహిమాన్వితమైనది, మార్గదర్శకమైనది.

మనుష్య జనతాభాగ్యరూపిణి అమ్మకి సన్నిహితంగా 1000 మంది సంచరించి ఉంటే 1000 గ్రంధాలు రావచ్చు. అవన్నీ మూల గ్రంథాలు; అనుభవ సంజనితాలు, చరిత్ర బద్ధాలు. 1965లో, 1972లో, 1980లో అని స్పష్టంగా ఉంటుంది. అవి కల్పితాలు, ఊహా సంజనితాలు

కావు.

తమ పాండిత్యాన్ని, శాస్త్రజన్యజ్ఞానాన్ని రంగరించి అమ్మ మాటలకి, బిడ్డల అనుభవాలకి తమ తమ వ్యాఖానాల్ని సంతరించే గ్రంధాలు రేపు ఎన్నైనా రావచ్చు. అవి రెండవ వరుసలోకి వస్తాయి. వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణాన్ని రచిస్తే కాలక్రమంలో వందల కొద్దీ రామాయణాలు వెల్లి విరిశాయి. అమ్మ బిడ్డలు తెలుగువారు, భారతీయులే కాదు వందలు వేలే కాదు కోటాను కోట్లమంది.

అమ్మ సాన్నిధ్యమహిమ, ఆశ్చర్యకరవాత్సల్యం, స్వీయ అనుభవ పూర్వక ప్రకటిత వినూత్న విప్లవాత్మక సిద్ధాంతాలు, సముద్ధరణ దీక్ష . ఇంకా తత్వపరంగా అధ్యయనం చేసినవారు, అనుభవించినవారు, అనుభవిస్తున్న వారు, అనుభవించబోవు వారు ఎందరు ? ఎందరో !

అమ్మ అవతారకాలంలో అమ్మను దర్శించలేక పోయినా తత్త్వతః దర్శించిన ప్రొ.కె.శివరామకృష్ణగారు, శ్రీ కె. వి. ప్రసాదవర్మగారు వంటి మహనీయులు అమ్మ మధుర మాతృప్రేమను, మాధవత్వగరిమను వేనోళ్ళ కీర్తిస్తున్నారు. ఈ సందర్భంలో ఒక ముఖ్యమైనమాట:

“అమ్మ సాహిత్యం ఎక్కువగా English లో రావాలి” అని అన్నది అమ్మ. అది International Link Language అన్న సంగతి సువిదితమే. ఈ దిశగా Richard Schiffman, Timothy Convey, Dr. Sreepada Gopal Krishna Murthy, M. Dinakar, E. Bhardwaja, Gorden Westerland వంటి 

సోదరులు స్వతంత్ర రచనలు చేశారు. శ్రీ కె.శివరామకృష్ణగారు, శ్రీ ఎమ్.దినకర్, డాక్టర్ శాంత, డాక్టర్ శ్రీనివాస్ సంస్కృత, ఆంధ్రభాషల్లోని గ్రంధాల్ని ఆంగ్ల భాషలోనికి అనువదించారు. ఇది ఎంతో ఆనందదాయకం.

చివరిమాట. అలనాటి గంగరాజు పున్నయ్యగారు, లక్ష్మణాచార్యులుగారు, తురుమెళ్ళ వెంకటప్పయ్యగారు, గుండేల రావుగార్ల పావన చరితలే కాదు; కాలక్రమంలో అమ్మపావన కృపావృష్టిలో తడిని చరితార్ధతను సంతరించుకున్న నేటి జనసందోహం యొక్క అనుభవాలూ, దర్శనాలూ అమూల్యములే, సార్ధకములే, చిర స్మరణీయములే. భగవచ్ఛిద్విలాసాన్ని లక్షణాల్ని అర్థం చేసుకోవాలంటే భక్తుని కదలికలే ఆధారం.

కొందరు వారి అమూల్య అనుభవసారాన్ని పదిమందితో పంచుకుంటూ భావితరాల వారి కోసం భద్రపరిచే మహదాశయంతో వాటిని అక్షరబద్ధం చేసి గ్రంధస్థం చేసి పూజాపుష్పాలుగా అమ్మ శ్రీ చరణాల చర్చిస్తున్నారు. అలా చేయక వారంతా కాలగర్భంలో కలిసిపోతే వారి అనుభవసంపద శాశ్వతంగా కనుమరుగై పోతుంది.

కనుక ఈ అక్షరయజ్ఞం నిస్సందేహంగా అభిలషణీయమే ఒకసారి విశ్వవిఖ్యాత హిందీ చలన చిత్రదర్శకులు శ్రీ శాంతారామ్న ‘Which is your best picture?’ అని అడిగితే, ‘Yet to come’. అన్నారాయన.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!