క్షరముల పూలు తెచ్చితిని అమ్మా! నీ పదములకు
పద్యమ్ముల మాల లల్లితిని పరాత్పరీ! నీగళమునకు
రసమధురమ్మౌ నీ మాటలు విని రాగాలెన్నో తీసితిని
మనసు చూరగొను శాబ్దిక శక్తికి తాళాలెన్నో వేసితిని
కరుణచిందు నీ కరుణాంబుధిలో లయలుహోయల నే కలిసితిని
॥అక్షర॥
మనసు చూరగొను మధురహాసమున మమతల పందిరి చూచితిని
మహిమాన్వితమౌ పాదతీర్థమున పునీతుడైతిని బహిరంతరముల
అమృతమొల్కు నీ చేతిముద్దలో జన్మతరించెడి జ్ఞానమందితిని
ప్రణవ నాదమౌ నీ నామములో పరవశతను నే గంతులు వైచితి
ముగ్ధ మోహనము నీ రూపముగని అప్రతిభుడనై అట్టే నిలచితిని
ప్రేమపూర్ణమౌ నీ గుణగానములో రసరమణీయపు రాజ్యమేలితిని
దేహబుద్ధితో దాసుడనైతిని జీవబుద్ధి నీ అంశన నిలచితి
ఆత్మబుద్ధిలో నీవేనేనని తెలుసుకొంటి ఆ తెలివే నీవని
నేనూ నీవు అంతా అదియను స్థిరమౌబుద్ధిని నిలుపుము మదిని
ఎట్లు తలచెదనొ ఎట్లు కొలిచెదనో ఎరుగజేయవే తల్లీ
పాపపుణ్యముల ఊసేలేని పథము చూపితివి నీ సన్నిధిలో
సుఖదుఃఖమ్ముల ఊహే రాని యోగము కంటిని నీ పెన్నిధిలో
||అక్షర॥