నియమబద్ధత, నిరాడంబరత, నిశ్చల భక్తితత్పరత అనే ఉదాత్త గుణాల త్రివేణీ సంగమం శ్రీ తంగిరాల కేశవశర్మగారు.
ఆత్మ విశ్వాసం, పరమాత్మ విశ్వాసం శ్రీ కేశవశర్మగారి జీవలక్షణాలు. తాము రాజ రాజేశ్వరిగా విశ్వసించిన ‘అమ్మ’ను అచంచల భక్తితో ఆరాధించి, అమ్మ చూపిన బాటలో అహంకార మమకారాలకు అతీతంగా నిబ్బరంతో బ్రతుకు సాగించిన మహనీయులు శ్రీ కేశవశర్మగారు. అమ్మ ప్రబోధించే జీవన సూత్రాలను నమ్మి, ఆచరించి, ప్రచారానికి తన్ను తాను అంకితం చేసుకున్న ఆదర్శ కార్యకర్త శ్రీ కేశవశర్మగారు. విశాఖ ‘మాతృశ్రీ అధ్యయన పరిషత్’ కార్యదర్శిగా, మన్నవలో ‘అమ్మ జన్మస్థల ధర్మనిధి’ వ్యవస్థాపకులుగా, అన్నపూర్ణాలయ స్వర్ణోత్సవ రధసారధిగా శ్రీకేశవశర్మగారు నిర్వహించిన కార్యక్రమాలు నిండు మనస్సుతో నిర్వ్యాజంగా వారు చేసిన కృషికి నిలువుటద్దాలు. వాడవాడలా వారు నిర్వహించిన అన్న సంతర్పణలు, సంకీర్తనలు, తత్త్వప్రచార సభలు అన్నీ ఒక క్రమశిక్షణతో, ప్రశాంత సుందరంగా సాగిన విషయం అందరికీ తెలిసినదే. అందరినీ తన ఒడిలోని పసిపాపలుగా దర్శించే అమ్మ విశ్వమాతృత్వానికి ఆచరణ రూపం డోలోత్సవం. ఎన్నో దశాబ్దాలుగా అమ్మబిడ్డలు కలలుగంటున్న ఆ కార్యక్రమం జరిగిందంటే, శ్రీ కేశవ శర్మగారి దీక్షాదక్షతలే అందుకు నేపధ్యం అనే మాట అభిమానపూరితం కావచ్చునేమో గాని, అసత్యంకాదు. అమ్మను అనన్యభక్తితో ఆరాధిస్తూ ఆ ఆరాధనా ఫలాన్ని సేవారూపంగా సమాజానికి పంచిపెట్టిన అమృత హృదయులు శ్రీ కేశవశర్మగారు. సేవ, ఆధ్యాత్మికతలు జీవనయానంలో గమ్యానికి చేర్చే రైలు పట్టాల వంటివని, ఆ రెండూ పరస్పర పరిపూరకాలు, ప్రేరకాలేకాదని, ఆ రెండింటి మధ్య వైవిధ్యం తప్ప వైరుధ్యం లేదని త్రికరణ శుద్ధిగా విశ్వసించిన విశిష్టమూర్తి శ్రీ కేశవశర్మగారు.
మహత్తర కార్యక్రమాలను సంకల్పించి, వాటిని బృహత్తర ప్రణాళికతో సార్థకంగా నిర్వహిస్తూ, ఆదర్శ జీవనానికి ఆనవాలుగా నిలిచిన సోదరులు శ్రీ కేశవశర్మగారికి ఆర్తితో అక్షర నీరాజనం సమరిస్తూ….