నీ కరములు శ్రీ కరములు భయహరములు
నీ చరణమె శ్రీచరణము భవహరణము
నీ నామమె ఈ జగము ‘అనసూయ’ము
అరుణకాంతు లెదజల్లును ‘ఇనుడు’ నీదు నుదుటినుండి
శ్రీ వామనమూర్తివీవు, అపర త్రివిక్రమవు నీవు
నీదు నామమును వీడి “నామరహిత”వైనావు
రూపాన్ని త్యజించినావు “విరూప”గా మారావు.
ఈ దేహము వీడి నీవు “విదేహ”గా మారావు
బంధాలను వీడి నీవు “రాగరహితవై”నావు
‘పరిణామమె’ కాని నీవు లేదంటివి నాశనము
అన్నార్తుల, విద్యార్థుల, వ్యథా తప్తహృదయుల
రోగార్తుల, శోకార్డుల ఆర్తులన్ని తీర్చినావు
‘పెండ్లిలో పెద్దపులి’ యేదీ లేదని’
ముక్తి మార్గాన్వేషణకై ముక్కు మూసుకొనవలదని
‘సంసారం సంతానం’ అవరోధం కాదంటివి
“అంతా తనుగా చూచుటే’ ఆత్మసాక్షాత్కారమంటివి.
‘అడుగకుండపెట్టేదే అమ్మ’ యని చెప్పినీవు
ఆచరించిచూపావు “లోకోక్తి”కి భిన్నంగా!
దుష్టశిక్షణ కాదు. దుష్టత్వానికి శిక్షణయని
‘ప్రేమాయుధధరవై’ ప్రేమామృతం పంచితీవు
జగము యొక్క మాత కాదు “జగమే మాతంటి” వీవు
జడచేతనములందున సమముగ ప్రసరించు ప్రేమ
నీదు ప్రేమ అనంతం కనుక విశ్వజనని వీవు
రాగాలకు రోగాలకు అతీతం నీ దేహం
‘గడ్డాల తాతలను – అడ్డాల బిడ్డ’లంటు
మాతృత్వపు మమకారం చవి చూపించితి వీవు
‘మానవత్వం’ నా మతమని మతముల నిరసించినావు
‘శుక్ల- శోణితాల కులమె – నా కులమని నిర్వచించి
‘సమసమాజ’ స్థాపనకై నడుంకట్టి నిలచావు
‘ఏక ప్రపంచ’ భావనను ఆచరణలో చూపావు
‘మరపే మరణమ’న్న నీదు వాక్కు మరవబోము
మాలో నున్న నీకు మరణమే లేదమ్మా!
అజరామరవీవు ‘అమ్మ’ నీవు జగమునకు
అందుకో అమ్మా! ఈ “అక్షర నీరాజనం”!!
(అమ్మ ఆలయ ప్రవేశ సందర్భంలో స్పందించిన ఎదసొదలు)