అడవుల దీవిలో మాతృవన విహారి శ్రీ యల్లా ప్రగడ వేంకట మధుసూదన రావు గారి (అమ్మ కృపావృష్టి గ్రంథావలోకనం)
“తనదైన అనుభూతి తనదిగాన” అన్నట్టు అమ్మతో తమతమ అనుభవాల్ని వివరిస్తూ ఎన్నో గ్రంథాలు వచ్చాయి. అమ్మ సాహిత్యంలో అధికశాతం ఇలాంటి గ్రంథాలే కనిపిస్తాయి. అమ్మ చెప్పిన దేమిటి? ఆచరణలో చూపినదేమిటి, అమ్మ మాటల అంతరార్థమేమిటి అని విశ్లేషణలు, వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చినవి తక్కువగానే ఉన్నాయి. ఈ రెండిటిని కొంతవరకు సమన్వయం చేస్తూ వచ్చినది “అమ్మ కృపా వృష్టి”. కారణ జన్ములు, మహనీయులతో సాన్నిహిత్య, సేవా భాగ్యాలు పొందిన వారు తమ ప్రత్యక్షానుభవాలను లోకానికి చెప్పటం ఆ మహానీయులను మన ముందు నిలపటం వంటిదే. మధు అన్నయ్య మొదటిసారి జిల్లెళ్ళమూడి వెళ్లి అమ్మను దర్శించుకున్నపుడు ఏ స్పందనా లేదు,
కానీ కష్టాల కడలిలో ఉన్న మా అమ్మకు గొప్ప ఉపశమనం కలగటం చూశాను అంటారు. తదాది తరచుగా జిల్లెళ్ళమూడి వెళ్ళటం, అమ్మ సన్నిధిలో లభించిన ఆప్యాయత,ఆత్మీయత అనుభవ మవటం, జీవితంలో వివిధ సందర్భాల్లో ఎదురైన అనుభవాల మాల “అమ్మ కృపావృష్టి”.
జీవితంలో నిరాడంబరత, అమ్మ సేవలో నిబద్ధత, అమ్మపట్ల నిశ్చల భక్తి తత్పరత కలగలసిన త్రివేణి సంగమం మధు అన్నయ్య జీవనయానం అనిపిస్తుంది. వారి సర్వ శక్తులను ఏ మాతృమూర్తి సేవకై అర్పణం చేశారో, ఏ మాతృసంస్థలు నిరాటంకంగా సాగాలని ఆతురత పడేవారో – అదే వారి ధర్మాచరణ. వారి జీవిత మంతా మాతృ సేవాభిముఖంగానే సాగింది, సాగుతూ ఉన్నది. వారి వూరు ఆడవులదీవి. వారి జీవిత సంచారమంతా మాతృ వాత్సల్య వనాల లోనే ! వారి జీవిత శైలిని తెలిపే ఈ స్వీయ అనుభవాలు
నేటితరం తెలుసుకుంటే గొప్ప స్పూర్తి కలుగుతుంది. అహమిక, కర్తృత్వ భావన వంటి వ్యర్థ పదార్థాలను, కలుపు మొక్కలను ఏరిపారేసి, నాదేం లేదు అమ్మ దయవల్లే చెయ్య గలిగేను అనే, అనుకునే, అనుకోమనే వినయ విభూషితులు మధు అన్నయ్య, మామూలు మాటల్లో చెప్పలేని ఒక అనిర్వచనీయ మానసిక అనుసంధానమేదో జరిగింది అమ్మతో. బాల్య చాపల్యం వల్లనో మరెందువల్లనో అమ్మకు కొన్ని “పరీక్షలు” పెడితే అద్భుతమైన రీతిలో సందేహ నివృత్తి జరిగింది. తదనంతరం వారి జీవితంలో తల్లి తండ్రి, గురువు దైవం అమ్మే అయి, అచంచల విశ్వాసం కుదిరి ‘అన్యధా శరణం నాస్తి… ‘అన్న నిశ్చయానికి రావటం గమనిస్తాం. రచయితగా మధుసుదనరావు అంతగా తెలియదు . ఇంత కాలానికి ఇట్టి రచన వెలువడటం అమ్మ నిర్ణయమే. కాలం గడచిన కొద్దీ వయోపరిపక్వతకు అనుభవపరిపక్వత, తాత్విక పరిపక్వత తోడై రచన జవజీవాలు సంతరించుకుని వెలుగు చూసింది. అందుకే. అంటున్నా, ఎప్పుడు వెలుగు చూడాలో అమ్మ సంకల్పం ప్రకారమేనని, రవి అన్నయ్య చెప్పనే చెప్పాడు- వ్రాసిన చెయ్యి మధుదే అయినా వ్రాయించిన అదృశ్యహస్తం అమ్మదే అని.
ఏ సందర్భంలోనూ తన కర్తృత్వాన్ని అంగీ కరించని అమ్మ మధు అన్నయ్య విషయంలో భౌతికంగా కనిపించేవి కనిపించనివి తన ప్రమేయంతో జరిగాయని అంగీకరించింది. అంతగా అమ్మ జోక్యం చేసుకోవటం, మిగతా వారి జీవితంలో జరగటం నేచూడలేదు అంటారు పి.ఎస్.ఆర్. గారు. బి.ఏలో నిద్రలేపి చదివించటం, హైమ అక్కాచెల్లెళ్లు లేని లోటు తీర్చిన వైనం, తన వివాహంలో ఆడపడుచు పాత్ర పోషించటం, వారి వివాహం స్వయంగా అందరింట్లో జరిపించటం, లలితక్కయ్యకు సుఖప్రసవం అయ్యేటట్లు అశీర్వ దించటం వంటి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి.
తన అనుభవాన్ని ఉన్నదున్నట్టు చెప్పటమే గాని అతిశయోక్తులు హిత బోధలు లేకపోవటం ఈ రచన ప్రత్యేకత. అట్టి స్వోత్కర్షలు రూపక ఉత్ప్రేక్షాది అలంకారిక మోహం దరిచేర నివ్వకుండా నిగ్రహము నిబద్ధత పాటించిన స్వభావోక్తులే ఈ రచన. అమ్మ సాన్నిహిత్య సేవా భాగ్యాలు పొందిన అదృష్టవంతులకు అమ్మను చూడని జిజ్ఞాసువులకు మధ్య వారధిగా నిలిచి, ఆ వారధి దాటి “పెంజీకటి కవ్వలి వెలుగు” లాంటి మాతృస్వరూపాన్ని లీలా మాత్రంగా నైనా దర్శింప చేస్తుంది ఈ పుస్తకం.
మానవరూపంలో ఈ లోకానికొచ్చి వాత్సల్యా మృతాన్ని పంచిన దివ్య విభూతి అమ్మ. అమ్మ ఒక జాగృత చైతన్యం. అమ్మ చేతలు బాహ్యంగా ప్రేరణ నిచ్చినట్లే, అమ్మ మాటలు అంతరంగాన్ని తట్టి చైతన్య వంతం చేయగలవు. ఆ ప్రేరణను ఆ చైతన్యాన్ని అందిపుచ్చుకున్న ధన్యజీవి సోదరుడు మధు. అమ్మ మలచిన పాత్రలు ఈ దంపతులు. చివరగా లలితక్కయ్య గారు వ్రాసిన రెండు వ్యాసాలూ గ్రంథానికో కొస మెరుపు! లలితమతియైన లలితక్కయ్య పలుకుల కేల కలిగే అతులిత మాధురీ మహిమ ? అంటే జవాబు – అమ్మ అనుగ్రహమే!