కర్మ, భక్తి, జ్ఞాన యోగాల గురించిన విచారణ ఈ నాటిది కాదు. మనసుతో చేసే కర్మలను దైవభావనతో చేస్తే అది కర్మ యోగం. చిత్తైకాగ్ర స్థితిలో చేసే పనులన్నీ భక్తిమయాలే. దైవాన్ని చూడాలనుకున్న స్పృహతో కూడినది భక్తి యోగం. మమకారం మానవ జీవలక్షణం. బిడ్డపట్ల మమకారం వాత్సల్యమౌతుంది. భగవంతుని పట్ల ఉండే మమకారమే భక్తి. ప్రాపంచికంగా కానీ, పారలౌకికంగా గానీ ఏమీ అక్కరలేని స్థితే జ్ఞానం. తనతో తాను కూడి ఉన్నదే జ్ఞానయోగం. అదే ఆత్మ నిష్ఠ.
దైవం చేయిస్తున్నాడనుకోవడం కర్మయోగం.
దైవం కోసం చేస్తున్నాననుకోవడం భక్తియోగం
అంతా దైవమేనన్న స్థిరభావం జ్ఞానయోగం.
ఇదే అసలైన సాంఖ్యం. మనసు భగవంతుని యందు లగ్నం చేసుకోగలిగితే అదే అనన్య భక్తి. పరిస్థితులెట్లా ఉన్నా శక్తి ఉనికిని గ్రహించి నిలకడ చెందడం అచంచల భక్తి. భారతీయ గురు శిష్య పరంపరలో గురువు మాట ద్వారానో, మౌనం ద్వారానో వైజ్ఞానిక, మార్మిక, జ్ఞాన సంబంధ విషయాలను శిష్యుడికి ప్రసారం చేస్తూనే ఉన్నాడు. ఈ దివ్య విధానానికి జిల్లెళ్లమూడి అమ్మ సైతం భిన్నం కాదు. అమ్మ వైఖరి మాత్రం ప్రత్యేకం. ఆమె అన్న మాటల్లా స్మృతిమయమే. శాస్త్ర ప్రమాణమే. ఆస్తికుణ్ని, సాధకుణ్ణి, భక్తుణ్ని, సంస్కర్తను, పండితుణ్ని, శాస్త్రవేత్తను ఏకకాలంలో సమన్వయం చేయగల వరమ శక్తివంతమైన వాగ్వైఖరి ఆమెది. నిజానికది వాగ్విభూతి. పైకి వినిపించే మాటల వెనుక దాగిన మహిత సత్యాన్ని ఒడిసిపట్టుకోవాలి. అదే అసలు సాధన. పరమాత్మను అనుభవ పరిధిలో అనుభూతి చెందటానికి ప్రపంచం కావాలి. కనిపిస్తున్న ప్రపంచం భ్రమ. నడిపిస్తున్న శక్తి బ్రహ్మ. గుర్తుపెట్టుకుని, అను కుంటూ ఉండటం ఆరాధన. నిశ్శబ్దంలోంచి శబ్దం, శబ్దంలోంచి నిశ్శబ్దం, చీకటి నుండి వెలుగు మలిగితే చీకటి. జనన మరణ చక్రం సూచిస్తున్నదంతా అద్వైతమే. జ్ఞానం పొందటమే ఆఖరు. జ్ఞాని కావడం కాదు. జ్ఞానిగా ఉండడం ప్రధానం. అంతరంగ అనుభవాలు వస్తూపోతూ ఉంటయ్. అవన్నీ ఆత్మాను భవాలు కావు. ఒకసారి వచ్చి, కడదాకా నిలకడ చెందటమే ఆత్మానుభవం. ఆత్మ… జ్ఞానేంద్రియాలను ప్రేరేపిస్తే, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను కదిలిస్తున్నయ్. నిజానికి సృష్టిలో జరిగే కలాపమంతా ఆత్మ విలాసమే! మనసుతో, మెదడుతో చూస్తే ప్రకృతంతా సైన్సు, హృదయంతో, నిరపేక్షతో చూస్తే ఆ ప్రకృతే దైవం. ఆధారపడి ఉన్నవన్నీ కంటికి కనిపిస్తున్నయ్. ఆధారం మాత్రం కనపడటం లేదు. పునాదులు కనబడవు. భవనం కనిపిస్తుంటుంది. అదే కర్త, శక్తి, ప్రాణం, దైవం! ఇంతటి గంభీరమైన విషయాలను అమ్మ ఎంత సరళంగా బోధించిందో గమనించినప్పుడు. అమ్మ తన విలక్షణ ముద్రతో గురుదైవంగా అనుభవంలోకి వస్తుంది.
(13 మే, 2020 ఆంధ్రజ్యోతి దినపత్రిక సౌజన్యంతో)