1. Home
  2. Articles
  3. Viswajanani
  4. “అద్భుతచారిత్ర” ఆవిష్కరణ

“అద్భుతచారిత్ర” ఆవిష్కరణ

Phani Rama Lingeswara Sarma
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 10
Month : May
Issue Number : 10
Year : 2011

శ్రీమతి మల్లాప్రగడ శ్రీవల్లి రచించిన “అద్భుతచారిత్ర” గ్రంథావిష్కరణ సభ మాతృశ్రీ అధ్యయన పరిషత్, గుంటూరుశాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. గుంటూరులోని బృందావన్గార్డెన్స్లో గల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో అన్నమయ్య కళావేదికపై ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు ‘విశ్వజనని’ పత్రికా సంపాదకులు శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ గారి అధ్యక్షతలో జరిగిన ఈ సభలో ఆంధ్రవిశ్వ విద్యాలయం రిటైర్డు తెలుగు ప్రొఫెసర్ ఆచార్య కోలవెన్ను మలయవాసినిగారు గ్రంథాన్ని ఆవిష్కరించారు.

ప్రముఖ సాహితీవేత్త, గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాల సంస్కృతశాఖాధ్యక్షులు శ్రీమతి డాక్టర్ వి.నాగరాజ్యలక్ష్మిగారు సభకు అందించిన స్వాగత వచనాల విరిజల్లులతో ఆరంభమై, మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి సంస్కృతోపన్యాసకులు శ్రీమతి ఎల్. మృదుల గారి ప్రార్థనా గీతంతో సభ శ్రీకారం చుట్టుకుంది. శ్రీమతి వసుంధర అక్కయ్య జ్యోతి వెలిగించి, అమ్మకు నీరాజన సమర్పించారు. సభాధ్యక్షులు శ్రీ పి.యస్.ఆర్. గారు మాట్లాడుతూ, లలితాసహస్రనామాలకు, అమ్మతత్త్వానికీ శ్రీవల్లి చేసిన సమన్వయం సమగ్ర సుందరంగా ఉన్నదని, ప్రతి వ్యాసం ప్రామాణికంగా సాగిందని ఉద్ఘాటించారు. సభా ప్రారంభకులు, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ పాలక వర్గం ఉపాధ్యక్షులు శ్రీమతి గద్దె రామతులశమ్మగారు అమ్మను చాలా కాలం క్రితం చూశానని, ఆ విశ్వప్రేమ అసాధారణమని తమ అనుభూతిని వివరిస్తూ రచయిత్రిని అభినందించారు.

గ్రంథాన్ని ఆవిష్కరించిన ఆచార్య కోలవెన్ను మలయవాసినిగారు శ్రీవల్లి చేసిన కృషిని ప్రతిభా పాండిత్యాలను ప్రస్తుతించారు. అవతారమూర్తి ‘అమ్మ’తో ఇంతటి సాన్నిహిత్యం గల శ్రీవల్లి, తన సాన్నిహిత్యాన్ని సార్థకం చేసుకున్నదన్నారు. స్వీయానుభవాలు వివరించడంలో శ్రీవల్లి అనుసరించిన శైలి హృదయం గమంగా ఉన్నదని, ఈ గ్రంథం చదివితే, ‘అమ్మ దర్శనం’ తప్పక లభిస్తుందని ప్రకటిస్తూ, అమ్మతత్వాన్ని వివరిస్తూ, శ్రీవల్లి మరెన్నో రచనలు చేయాలని ఆశీర్వదించారు.

గ్రంథ ప్రశస్తిని వివరిస్తూ – మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ఆంధ్రశాఖాధ్యక్షులు శ్రీమతి డాక్టర్ బి.యల్. సుగుణగారు అమ్మ చరిత్రలో చేరవలసి ఉన్న ఎన్నో అద్భుతాంశాలను వినూత్నంగా శ్రీవల్లిగారు ఈ రచన ద్వారా వెల్లడించారని, అమ్మతత్త్వ అధ్యయనానికి ఈ గ్రంథం చక్కగా దోహదం చేస్తుందని అన్నారు. శ్రీమతి డాక్టర్ యు.వరలక్ష్మిగారు తమ ప్రసంగంలో “ఉత్తమ కవిత్వానికి ఉదాహరణ ఈ గ్రంథం” అన్నారు. “చూడనివాడికి సన్నివేశం చూసినట్లుగా అనిపించేలా చెప్పడమే నిజమైన కవిత్వానికి నిర్వచనం” అని “అమ్మ” చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ లక్షణం ఈ గ్రంథంలో పరిపూర్ణంగా కనిపిస్తుందని సోదాహరణంగా వివరించారు.

గౌరవ అతిధిగా పాల్గొన్న ఆలయపాలకవర్గ అధ్యక్షులు శ్రీ సి.హెచ్. మస్తానయ్య గారు ‘అమ్మ’ సాహిత్యానికి తమ ఆలయం వేదిక కావడం ఆనందంగా ఉన్నదని వివరిస్తూ, రచయిత్రిని, ఆవిష్కర్తను అభినందించి సత్కరించారు. 

 డాక్టరు పి. ఝాన్సీలక్ష్మీబాయి ‘అమ్మ’ను పరిచయం చేసే గీతాన్ని ఆలపించారు.

శ్రీ మల్లాప్రగడ గోపాలకృష్ణ ప్రసాద్ గారు ‘అమ్మ’ను గూర్చి స్వయంగా రచించి, స్వరపరిచిన చక్కని గీతాన్ని ఆర్దంగా గానం చేశారు.

శ్రీమతి డాక్టర్ నాగరాజ్యలక్ష్మిగారు, శ్రీమతి డాక్టర్ కె.కనకమహాలక్ష్మిగారు రచయిత్రిని అభినందిస్తూ  ప్రసంగించారు.

కార్యక్రమ నిర్వహణకు సోదరులు శ్రీ కట్టమూరి వెంకటేశ్వరరావుగారు, శ్రీ కె. సత్యప్రసాద్ గారు, శ్రీ బి. రామచంద్రగారు ఆత్మీయంగా సహకరించారు.

శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారి ఆధ్వర్యంలో అతిథులకు నూతన వస్త్రాలతో ఘనంగా సత్కారం జరిగింది.

రచయిత్రి శ్రీమతి శ్రీవల్లిగారు తమ హృదయస్పందనను అందించారు. తాను కలం మాత్రమే నని, అమ్మే ఈ గ్రంధానికి నిజమైన రచయిత్రి అని వివరించారు. గ్రంథ రచనలో, ముద్రణలో సహకరించిన పెద్దలకు, ఆత్మీయులకు పేరు పేరునా ధన్యవాదాల చెప్పారు.

ఈ గ్రంథాన్ని ‘అమ్మ’కే అంకితం చేశానని, తమ సొంతఖర్చులతో ముద్రించినా, గ్రంథం అమ్మకంపై వచ్చే ఆదాయమంతా జిల్లెళ్ళమూడిలోని అన్నపూర్ణాలయ నిర్వహణకు నిరతాన్నదాన మహాయజ్ఞానికే సమర్పిస్తున్నాని రచయిత్రి ప్రకటించారు. ఆవిష్కరణ సభ జరుగుతూ ఉండగానే సుమారు 150 పుస్తకాల వరకు అమ్మకం జరగడం, ఇద్దరు దాతలు అన్నదానం నిమిత్తం 500/-లు చొప్పున విరాళం అందించడం విశేషం.

శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారు సమయోచిత వ్యాఖ్యలతో ఆద్యంతమూ సభను రసవత్తరంగా నిర్వహించారు.

ఎందరో సాహితీవేత్తలు, ప్రముఖులు, భక్తులు శ్రీ విశ్వజననీపరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ కె.బి.జి. కృష్ణమూర్తి గారు, స్థానిక కార్యదర్శి శ్రీ ఎన్. లక్ష్మణరావుగారు, మాతృశ్రీ విద్యాపరిషత్ కరస్పాండెంట్ శ్రీ వి.యస్.ఆర్.ప్రసాదరావు గారు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పాఠశాలల అధ్యాపకులు, పూర్వవిద్యార్థులు సభలో పాల్గొని రచయిత్రిని అభినందించారు.

శ్రీ విశ్వజననీపరిషత్వారు, బంధుమిత్రులు, ఆత్మీయులు, అభిమానులు ఎందరో రచయిత్రిని ఘనంగా సత్కరించారు.

శ్రీ మల్లాప్రగడ నందకిశోర్ గారు వందన సమర్పణ చేశారు. అతిథులకు, ఆత్మీయులకు మల్లాప్రగడ దంపతులు విందుభోజనం అమ్మ ప్రసాదంగా అందించారు. 

ఈ సభ అందరికీ ఆనందాన్ని పంచిపెట్టింది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!