“శ్రీమాత చరిత్ర అద్భుతావహం. దుష్టశిక్షణ, శిష్టరక్షణ సమయాల్లో ఆమె చూపిన మహిమలు అనంతం. అద్భుతం. శ్రీమాత అద్భుత చారిత్ర” – భారతీవ్యాఖ్య
అద్భుతం అంటే వింత; ఆశ్చర్యం. అంటే ఎప్పుడూ, ఎక్కడా, ఎవ్వరూ చేయనిది ఏ ఒక్కరో చేస్తే అది మనకు అద్భుతంగా కనిపిస్తుంది (అనిపిస్తుంది). అద్భుతం శాశ్వతంగా ఉండదు. మెరుపుమెరిసి మాయమైనట్లు, అద్భుతం కూడా క్షణికమే. ఇది జరిగిందా, లేదా ? కలా? నిజమా ? అని మనలో మనం మళ్ళీ మళ్లీ విత్కరించు కుంటూ, తన్మయావస్థనుంచి తెప్పరిల్లేలోగానే ఏమీ జరగనట్లు, అంతా మామూలుగానే ఉన్నట్లు అనిపించడం అద్భుతం లక్షణం. సాధారణంగా ఎవరి జీవితంలో నైనా అద్భుతాలు అరుదుగా జరుగుతూ ఉంటాయి. నూటికి కోటికి ఏ ఒక్కరికో అద్భుతమైన అనుభవం ద్వారా వారి జీవనయానమే మారిపోతుంది. అలాంటి అద్భుతాలను సృష్టిస్తూ, దుష్టశిక్షణ, శిష్టరక్షణలను నిర్వహించిన దేవి అద్భుతచారిత్ర. శ్రీ లలిత చరిత్రే అద్భుతం. కనుక శ్రీమాత ‘అద్భుతచారిత్ర’.
“అమ్మ” అద్భుత చారిత్ర. పుట్టుక మొదలు అవతార పరిసమాప్తి వరకు “అమ్మ” జీవిత మహోదధిలోని ప్రతితరంగం అద్భుతావహమైనదే. కొన్ని అద్భుతాలు తన బిడ్డలను రక్షించుకోవడానికి, మరికొన్ని అద్భుతాలు తన భక్తులను ఆనందసాగరంలో తేలియాడించడానికి, ఇంకొన్ని అద్భుతాలు తప్పుదారిపట్టిన తన బిడ్డలను శిక్షకాని శిక్షణతో సన్మార్గంలోకి మరల్చడానికి ప్రదర్శించి, ‘అద్భుతచారిత్ర’గా సాక్షాత్కరించింది “అమ్మ”.
“అమ్మ” జీవితమే ఒక గొప్ప అద్భుతం. సర్వశక్తి స్వరూపిణి“అమ్మ”గా అవనిలో అవతరించడమే మహాద్భుతం. అఖిలాండకోటి బ్రహ్మాండజనని “అమ్మ”గా అపార ప్రేమామృతాన్ని సమస్త ప్రాణికోటికీ పంచి, పెంచి, పోషించడానికే అర్కపురిలోని అందరింటిని అలరించింది. “అమ్మ” పుట్టినది ఆదిగా ఎన్నో దర్శనాలు “అమ్మ” అవతారతత్వాన్ని నిరూపించే నిదర్శనాలుగా నిలువుటద్దం పట్టాయి. “అమ్మ” పుట్టుకకు పూర్వమే రంగమ్మగారికి (అమ్మకు తల్లి) ఎన్నో దివ్యానుభూతులను అనుగ్రహించింది. “అమ్మ” భూమ్మీద పడగానే మంత్రసాని గొల్ల నాగమ్మకు కలిగిన అనుభవం అత్యద్భుతమైనది. ఆనాడే “అమ్మ” సర్వాలంకార శోభితయైన దేవతామూర్తివలె గొల్లనాగమ్మకు దర్శనమిచ్చి, ఆమెను అప్రతిభురాలిని చేసింది. చిన్నికృష్ణుణ్ణి బంధించడానికి యశోదమ్మకు ఎంతపొడవు తాడూ సరిపోలేదని మనం వింటూ ఉంటాం. “అమ్మ” బొడ్డుకోసి దారం చుట్టాలని, చాకు, దారం తీసుకుని బొడ్డుచుట్టూ ఎన్ని చుట్లు చుట్టినా దారం ఇంకా మిగిలిపోతూ, గొల్లనాగమ్మకు విసుగును, ఆశ్చర్యాన్ని కలిగించింది. దారం కోసేద్దామని చాకును వాడబోతే, అది త్రిశూలంగా మారి, చేతికి అమరకపోవడం వింతలో వింత. అంతలోనే అంతా మామూలుగా అయిపోయి, జరగవలసిన కార్యక్రమం యథావిధిగా జరిగిపోయింది. పుట్టీపుట్టగానే అద్భుతాన్ని గొల్లనాగమ్మకు అనుగ్రహించిన “అమ్మ” అద్భుతచారిత్ర. పుట్టినప్పటినుంచి ఇంటిలోని వారికి, ఇంటికి వచ్చినవారికి ఎన్నెన్నో అద్భుతాలను ప్రదర్శించి, వారిని ఆశ్చర్యచకితులను చేసిన “అమ్మ” అద్భుతచారిత్ర. అంతలోనే మామూలు చిట్టితల్లిగా అయిపోయి, వారికి తమ అనుభవం కలా, నిజమా? అనే భ్రాంతిని కలిగించి, మాయ కప్పేసిన అమాయకపు బాలిక అద్భుతచారిత్ర. పందొమ్మిది నెలలప్రాయంలోనే శాంభవీ ముద్రలో ఉండటమేగాక, అదేమిటి? అలా కూర్చున్నావు – అంటే, అది ‘శాంభవీ ముద్ర’ అని వివరించడం అనూహ్యమూ, అతిమానుషమూ, అత్యద్భుతమూ.
మన్నవలోని రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో మౌనస్వామి వేసిన యంత్రం ‘రాజ్యలక్ష్మి యంత్రం’ అన్న మరిడమ్మ తాతమ్మగారితో, జ్వరంతో బాధపడుతూ అమ్మమ్మపక్కలో పడుకుని ఉన్న “అమ్మ” – “అది రాజ్యలక్ష్మీ యంత్రం కాదు. రాజరాజేశ్వరీ యంత్రం” అని నిర్ద్వంద్వంగా, నిశ్చయంగా చెప్పింది. అది విని, అమ్మమ్మ (రంగమ్మగారు) “సరేలే అన్నీ నీకే” అంటే, వెంటనే “అమ్మ”, “ఔను, అన్నీ నావే కనుక” అని నిర్ధారణగా చెప్పింది. సరిగ్గా మాటలు పలకడం కూడా రాని మూడు సంవత్సరాల పసిప్రాయంలోనే తాను ఏమిటో ? స్పష్టంగా చెప్పిన “అమ్మ” అద్భుత చారిత్ర. తరువాత కొంతకాలానికి “అమ్మ” మౌనస్వామివారి దర్శనానికి వెళ్ళింది. మౌనస్వామి వారిని ఆంతరంగికంగా కలుసుకుని, ఆయన మౌనాన్ని భంగపరుస్తూ ఆయనచేతనే – ఆయన ప్రతిష్ఠించినది రాజరాజేశ్వరీ యంత్రమే అని చెప్పించింది. మౌనస్వామి మౌనాన్ని భంగం చేయటమే కాక, మౌనంలోని పరమార్థాన్ని వారికి ప్రబోధించిన “అమ్మ”అద్భుత చారిత్ర.
మన్నవలోని పున్నయ్యగారి తోటలో చింతచెట్టు మీద కూర్చుని ఉన్న “అమ్మ” చింత చిగురుకోసం వచ్చిన తురుమెళ్ళ వెంకటప్పయ్యగారికి తమ ఇష్టదైవమైన సత్యనారాయణస్వామిగా దర్శనమిచ్చింది. ఆయన “అనసూయ మామూలు పిల్లకాదు. నా ఇష్టదైవమైన సత్యనారాయణస్వామియే ఈ అనసూయ” అని స్పష్టంగా చెప్పారు. “తల్లిలేని పిల్ల” అని జాలిపడిన బ్రహ్మాండం సుబ్బారావుగారితో (అమ్మ మామగారు) చిదంబరరావుగారు “ఈ తల్లి ఎందరి తల్లులకో తల్లి. ఇంకా ఈమెకు తల్లి ఎందుకు?” అని ఆనాడే ప్రకటించారు. చిన్నపాపగా ఉన్న “అమ్మ” ఆనాడే ఎందరికో ఎన్నో దర్శనాలు అనుగ్రహించింది. కొందరికి బాలా త్రిపురసుందరిలా, కొందరికి కనకదుర్గలా, కొందరికి సీతమ్మవారిలా, కొందరికి బాలకృష్ణుడిగా, కొందరికి నాగేంద్రునిలా, కొందరికి రఘురామునిలా, కొందరికి కాశీ అన్నపూర్ణలా, కొందరికి రాజరాజేశ్వరిగా – ఇలా ఎన్నోరూపాలతో, ఎవరి ఇష్టదైవం రూపంలో వారికి దర్శనం ఇచ్చి వారికి అంతులేని ఆనందాన్ని, మధురాతి మధురమయిన అనుభవాన్ని అనుగ్రహించింది. అందుకే అద్భుత చారిత్ర అయిన “అమ్మ” భగవంతుణ్ణి గురించీ – “అన్నిరూపాలూ ఆయనవే కనుక రూపరహితుడు; అన్ని గుణాలూ ఆయనవే కనుక గుణరహితుడు. అన్ని నామాలూ ఆయనవే కనుక నామరహితుడు; అన్ని సంకల్పాలూ ఆయనవే కనుక సంకల్ప రహితుడు” అని విశదీకరించింది.
తన అత్యద్భుత దర్శనాలతో దుర్మార్గపు ఆలోచనలు గల ఎందరిలోనో మార్పుతెచ్చిన మహిమాన్విత అయిన “అమ్మ” అద్భుత చారిత్ర.
“అమ్మ” మామగారు బ్రహ్మండసుబ్బారావుగారు చనిపోయేనాటికి “అమ్మ”కు తొమ్మిది సంవత్సరాలు. “అమ్మ” ఆ సందర్భంలో వారింటికి వెళ్ళింది. మేడపైన పడుకున్న “అమ్మ” దగ్గరకు పెమ్మరాజు సత్యనారాయణమూర్తిగారు వచ్చి, “అమ్మ” పక్కలో కూర్చున్నారు. చిదంబరరావుగారు లేచి “అమ్మాయి దగ్గర ఎందుకు కూర్చున్నారని” అడిగితే, “అమ్మాయి కాళ్ళతీపులతో బాధపడ్తుంటే మెస్మరిజం చేద్దామని” అని సమాధానం చెప్పారు. వీరి సంభాషణ వింటూ పడుకుంది “అమ్మ”. మూర్తిగారు కాళ్ళు రాయడం మొదలు పెట్టగానే “అమ్మ” చివాలున లేచి, “మీరు పెద్దవారు నా కాళ్ళు పట్టుకుంటారేమిటి?” అని చురుగ్గా ప్రశ్నించింది. అంతేకాదు. ‘ఆయన పట్టుకుంటేనే బాధలు తీరిపోయే టట్లయితే తన మామగారు బ్రహ్మాండం సుబ్బారావుగారికి ఎందుకు తగ్గించలేద’ని నిలదీసింది. “ఏమిటి గొడవ ?” అని అడిగిన చిదంబరరావుగారితో “ఈయన అడక్కుండానే అందరి బాధలూ అర్థంచేసుకుంటారట. ఈ ఇంటిలో ఎవరెవరు ఏఏ బాధలతో ఉన్నారో చెప్పమనండి కనీసం, నివారణ ఎలా ఉన్నప్పటికీ?” అని చాలా కటువుగా మాట్లాడింది. ‘పెద్దవారితో ఎందుకు?’ అన్న చిదంబరరావు గారితో “పెద్దవారు పెద్దవారుగా ప్రవర్తించకపోవటంతో వస్తుంది గొడవ. వీరు ఉపాసకులు” అని వ్యంగ్యం గొంతులో ధ్వనింపజేసింది. మూర్తిగారితో మాత్రం కరుకుగా “ఉపాసన ఇదేనా? పలుకరేమి ? అందరికీ మీరు చేసే మెస్మరిజం ఇలాగే ఉంటుందా ? మీరిక ఈ ఉపాసన మానుకున్నా సరే, లేదా ఈ విషయం వివరించి చెప్పినా సరే!” అని నిలదీసింది. అంతేకాదు, వెంటనే ఆయన్ని మేడ నుండి దించేయమని చిదంబరరావుగారితో చెప్పింది. మూర్తిగారిని అప్పుడే బాగుచేయాలనుకుందేమో మరి. అయితే, ఆయన్ని మాటలతో బాగుచేయడం కష్టమని అనుకుంది కాబోలు. అనుభవాన్ని అనుగ్రహించి సంస్కరించాలనుకుంది “అమ్మ”. “ఉపాసన అంటే ఏమిటి?” అని ప్రశ్నించింది. ఆ ప్రశ్న ఆయన అంతరంగాన్ని మధించివేసింది. ఉపాసన పేరుతో తాను చేసిన చెడ్డపనులన్నీ ఒక్కొక్కటే ఆయన కళ్ళముందు కదలాడసాగాయి. ఒక్కొక్క దృశ్యానికి ఆయన వణికిపోయారు. ఒక్కసారిగా చిన్నపిల్లవాడిలా వెక్కి వెక్కి ఏడుస్తూ, “అమ్మ” పాదాలు పట్టుకున్నారు. ఆయనకు బాలాత్రిపురసుందరిగా సాక్షాత్కరించింది “అమ్మ”. “బాల్య యౌవన కౌమారస్థితులు కలది, సృష్టిస్థితిలయకారిణి, భూతభవిషద్వర్తమానాలు ఆమె రూపం అంటే ప్రతిదానిలో గర్భితమైన శక్తియే బాలాత్రిపురసుందరి” అని “అమ్మ” బాలాత్రిపురసుందరీ తత్త్వాన్ని వివరించింది. “అమ్మ” పాదాల నుండి లేచిన మూర్తిగారికి క్రొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లు, పునర్జన్మ ఎత్తినట్లు అన్పించింది. “నమస్తే మాతా” అని “అమ్మ”కు నమస్కరించారు. “శిక్ష అంటే క్రమశిక్షణలో పెట్టటమేనా?” అని అడిగిన అమ్మతో చిదంబరరావుగారు “నీకు తోచిన దానికి తిరుగేముంటుందమ్మా ! అదే అందరికీ రక్ష” అని చెప్పి, ఆనాడే మనకందరికీ “అమ్మే” రక్ష అని ప్రకటించారు.
సత్యనారాయణమూర్తిగారితో “మీ తప్పును మీకు తెలియపరిచాను. మీరు శిక్ష అనుకోవద్దు. శిక్షణ ఇచ్చి మీ పేరు సార్థకం చేద్దామని” చెప్పి వారికి “అమ్మ” బోధచేసింది. ఊరికి బయలుదేరిన ఆయనతో పాటు స్టేషను దాకా వెళ్లి రైలుకూడా ఎక్కించింది. మూర్తిగారు రైలు వాకిట్లో నిలబడి రుద్దకంఠంతో నీళ్ళు నిండిన కళ్ళతో, చేతులు జోడించి “అమ్మా! దయానిధీ ! వెళ్ళి వస్తానమ్మా!” అని సెలవు తీసుకున్నారు. తన అద్భుత దర్శనం ద్వారా సత్యనారాయణ మూర్తిగారికి పశ్చాత్తాపం కలిగించి, వారు సన్మార్గవర్తనులు కావడానికి మార్గదర్శకత్వం వహించింది అద్భుత చారిత్ర అయిన అనసూయమ్మ.
“అమ్మ” తన బాల్యం నుంచి ఈనాటివరకూ ప్రదర్శిస్తున్న అద్భుత దర్శనాలు “అమ్మ”ను అద్భుత చారిత్రగా మనకు సాక్షాత్కరింపజేస్తున్నాయి. అయితే, “అమ్మ” మాత్రం “నేను ‘అమ్మ’ను, మీరు బిడ్డలు,” “మీరు కానిది నేనేదీ కాదు” అంటూ ఎప్పటికప్పుడు మనల్ని మాయలో పడవేస్తూ, మానవిగా మనందరి మధ్య నడయాడిన బంగారుతల్లి. “అమ్మ” జీవితకాలంలో జన్మించి, “అమ్మ”ను దర్శించి, భజించి, సేవించి, తరించిన ధన్యజీవులం మనం. తన అద్భుతచరిత్రను మనకు అందించి, అద్భుత దర్శనాలను అనుగ్రహించిన అమ్మ ‘అద్భుత చారిత్ర’. అర్కపురీశ్వరి అయిన అనసూయామాతకు అంజలి ఘటిస్తూ……
(‘శ్రీమతి కుసుమాచక్రవర్తిగారికి కృతజ్ఞతలతో)