అమ్మలోని సహజసహనం ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఒక సందర్భంలో నాగులచవితికి అనుకుంటాను- అందరూ అమ్మకి పాలుపోస్తున్నారు. ఒక భక్తురాలు తొందరలో మరిగే పాలు తీసుకొచ్చి అమ్మకు పోసింది. అమ్మ ఆ భక్తురాలి భక్తినే చూసింది గాని వేడిపాలు పోసిందేనన్న స్పృహే లేదు. అమ్మని సేవించేటానికి అప్పట్లో చాలా మంది మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు వచ్చేవాళ్ళు. ధనవంతులూ వచ్చారు. కానీ అతి కొద్దిమంది. అప్పుడు అమ్మను సేవించిన పేదవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారంటే అతిశయోక్తి కాదు. అమ్మ వాళ్ళకు తదనంతర కాలంలో ఐశ్వర్యాన్నిచ్చింది, ఆరోగ్యానిచ్చింది, వాళ్ళ బిడ్డలనందరినీ అభివృద్ధి చేసింది. ఆ నాటి సోదరీ సోదరు లందరూ నేలమీద పడుకున్నారు, కాలువలో స్నానం చేశారు. చింతకాయ పచ్చడి, గుమ్మడికాయ పులుసుతో అన్నపూర్ణాలయంలో భోజనం చేసి మహదానంద పడ్డారు. ఆరోజులు వేరు, ఆ మనుషులు వేరు, వారి ఆలోచన వేరు. వారి ధ్యాస అంతా అమ్మ మీదే. అమ్మ కరుణాకటాక్ష వీక్షణాలను ఆస్వాదిస్తూ ఎంత పని అయినా చేసేవారు. ఆంజనేయునికి రాముడు ఇచ్చిన శక్తి లాగా అమ్మ ఇచ్చిన శక్తితో, అమ్మపై భక్తితో అన్ని పనులు జరిగేవి. అక్కడక్కడ భావ వైరుధ్యాలు ఉన్నా, పూలలో దారంలా అమ్మ కరుణ ప్రవహించింది. అమ్మ ఆలయప్రవేశం తర్వాత అమ్మ అనంతశక్తి పాతతరాన్నే కాకుండా కొత్త వాళ్ళని, సరికొత్త వాళ్ళని, అమ్మని ఎప్పడూ చూడనివాళ్ళని అమ్మ తన దివ్యశక్తితో అనుగ్రహిస్తోంది, జిల్లెళ్ళమూడి సందర్శింపజేస్తోంది. వాళ్ళ అనుభవాలు, వాళ్ళకు అమ్మ ఇచ్చిన దర్శనాలు వింటే అద్భుతం అనిపిస్తుంది. అమ్మ ప్రేమ అనంతమై, అవ్యాజమై, అప్రతిహతమై అందర్నీ సమ్మోహన పరుస్తోంది. అమ్మను చూచి భక్తిపారవశ్యం పొంది అమ్మని విశ్వసిస్తున్నారు.
ఎక్కడో తమిళనాడులో ఉన్న ఒకరాజకీయనాయకురాలి బంధువులకు అమ్మ దర్శనం ఇచ్చి రప్పించింది. అమ్మని చూడని ఒక సైంటిస్ట్కి దర్శనం ఇచ్చి రప్పించి దిశానిర్దేశం చేసింది. అన్నపూర్ణాలయంలో ఎప్పుడో అమ్మ ప్రసాదం తిన్నవాళ్ళు కొన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ వచ్చి అమ్మ కరుణని గుర్తు చేసుకొని అమ్మని సేవిస్తున్నారు. అమ్మని పరాశక్తిగా యోగులు, విద్యావంతులు, సామాన్యులు, అసామాన్యులు, రాజకీయ దురంధరులు అందరూ అమ్మే ఆదిపరాశక్తి, చేరుకోవలసిన లక్ష్యం అని తలచి జిల్లెళ్ళమూడి సందర్శిస్తున్నారు. కాలానుగుణంగా మనుషుల్లో వచ్చిన మార్పులు, వారి అవసరాలు, భక్తులకు కావాల్సిన వసతులు పెరగాల్సిన అవసరం ఎక్కువైంది. మిగిలిన ఆధ్యాత్మిక సంస్థలలో కాలానుగుణంగా అనేక మార్పులు, వసతులు ఏర్పాటు చేసి భక్తుల అవసరాలను తీరుస్తున్నారు.
జిల్లెళ్ళమూడిలో కూడా అలాంటి వాతావరణం వస్తున్నది. మనకి కావలసిన మానవ వనరులు ఇంకా అభివృద్ధి చేసుకోవలసి ఉంది. దీనికి అనుగుణంగా శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్, టెంపుల్స్ ట్రస్ట్ వారు గ్రామస్థాయిలో, పట్టణ స్థాయిలో, నగర స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పూజా కార్యక్రమాలు, అమ్మ సందేశ సభలు జరిపి ఎక్కువ మంది జిల్లెళ్ళమూడి వచ్చేవిధంగా, సేవ చేసుకునే విధంగా చేద్దామనుకోవడం బహుధా ప్రశంసనీయం. అమ్మతో సమకాలీనంగా ఉన్న భక్తులలో అమ్మ ఒడిచేరినవారు కాక, మిగిలిన వారి సమన్వయంతో కొత్తతరంవారు కృషి చేస్తున్నారు. అమ్మ వైభవాన్ని, ప్రాభవాన్ని, దైవత్వాన్ని పలుచోట్ల, పలువిధాలుగా ప్రచారం చేయాల్సిన గురుతర బాధ్యత మనపై ఉంది.
అమ్మ దివ్యశక్తితో తన పని చేస్తోంది. మనందరం తనకు అవయవాలని అమ్మే చెప్పింది కాబట్టి అమ్మ అయితే ఇది ఎలా చేస్తుంది అనే భావనతో ముందుకు వెళదాం.
ఐకమత్యంగా ఒకేమాటగా, అమ్మ మాటగా కార్యక్రమాలు చేస్తే అమ్మ ముందుండి నడిపిస్తుందని అందరికీ అనుభవమే. జయహెూమాతా.
—
స్పందన
1) శత జయంతి ఉత్సవాలలో ఎన్నో అద్భుతమైన అమ్మఫోటోలు బ్యాక్ గ్రౌండ్లో చూపించారు. మాలాంటి కొత్తవారికి వాటి నేపథ్యం తెలియదు. ఒక ఫోటో ఎన్నుకుని తెలిసిన వారితో “చిత్రం చెప్పే కథ” అనే శీర్షికలో వివరిస్తే మాలాంటి కొత్త తరానికి ఆసక్తి కరంగా ఉంటుంది మహోదయ
2) విశ్వజననీ పత్రికను మీ బంధు మిత్రులకు బహుమతిగా subscription కట్టండి అని ప్రకటన ఇస్తే బాగుంటుంది. శ్రీ పీఠం వారు ఇస్తూ ఉంటారు అలా.
3) This day that age అనే ఒక కాలమ్ Hindu paper వాళ్ళు నడుపుతారు. 50 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి అందులో ఉంటుంది. “నాడు-నేడు” అనే పేరుతో ఆ శీర్షికను – మనమూ నిర్వహించవచ్చు.
- గుడివాక శ్రీనివాస్, కొవ్వూరు.
—
DONATIONS MADE TO SVJP TRUST, JILLELLAMUDI
Sri B. Krishna Mohan – Rs.50,000
Sri V. Sarada – Rs.25,000
Smt. V. Phaneendra – Rs.1,00,000
Sri B. Satya Prasad – Rs.25,000
Smt. D. Jyothi Mytili – Rs.1,00,000
Sri T.Seshaiah – Rs.30,000
Sri K. Chandra Mouli (Nitya Annaprasada Vitarana) – Rs.60,000
Sri B. Ravi Kiran – Rs.1,40,000