ఈనాడు విశ్వకళ్యాణార్థం వెలసిన అనసూయేశ్వరాలయాన్ని ఒకప్పుడు ‘పెద్దగుడి’ అని పిలిచేవారు. నాడు ఆ ఆలయాన్ని నిర్మించటంలో అమ్మ ఆంతర్యం ఏమిటో, ఏ మూర్తిని అందు ప్రతిష్ఠించ సంకల్పించిందో ఎవరికీ తెలియదు.
దరిమలా 1981లో నాన్నగార్ని ఆలయప్రవేశం చేయించి, 85లో తాను వారి సరసన సుప్రతిష్ఠిత అయింది. అమ్మ లేకుండా మనం ఉండాల్సిన రోజు వస్తుందని, అమ్మ మనల్ని విడిచి వెళ్ళిపోతుందనే చేదు. నిజాన్ని ఎవరూ కలలోనైనా ఊహించలేదు.
తదాది ఏటా జూన్ 12, 13, 14 తేదీలలో అమ్మ ఆరాధనోత్సవాల్ని అనంతోత్సవాల పేరిట మనం నిర్వహిస్తున్నాం. అందలి తాత్పర్యం ఏమంటే – అమ్మ తన పరిమిత రూపాన్ని విడిచి అనంతశక్తిగా మహాభినిష్క్రమణం చేసింది – అని. వాస్తవానికి అమ్మ స్థితిలో ఏనాడూ మార్పులేదు. శరీర ధారణకి ముందు ఎలా ఉన్నదో, శరీరధారణియై, శరీరత్యాగియై అలాగే ఉన్నది. ఆ మాటలన్నీ మన స్థాయిలో తలపోసేవే.
అమ్మ దయతలచి తనను గురించి తానే పలుసందర్భాలలో నిర్వచించింది. తొలి అనీ – ఆద్యంతము లేనిది అన్నిటికీ ఆధారమైనది అనీ – ఒక్క మాటలో ‘అమ్మ’ (THE ORIGIN) అని.
కాగా, అమ్మ “నేనూ మీలాంటి దాననే” అని అంటుంది. ఈ వాక్యం అద్వైత శిఖరాగ్రం పైన సుఖాసీన అయిన అమ్మ మాటగా ముమ్మాటికీ సత్యం, జీవోబ్రహ్మైవ నా పరః అనే పరమ సత్యం, తత్త్వం అది. కానీ ఆ మాట మన స్థాయిలో అన్వయించుకుంటే అసత్యం. ఈ విచిత్రమైన విశిష్ట స్థితికి ‘మానవతా మాధవత్వ మధుర సమ్మేళనం’ అన్నాడు రామకృష్ణ అన్నయ్య. అమ్మ మనలాంటిదా? కానేకాదు. కంచు కాగడా వేసి కల్పాంతం వరకు వెదికినా అమ్మకీ మనకీ మధ్య ఏ ఒక్క పోలికా లేదు. హస్తిమశకాంతర భేదమే. ఇదంతా ఎందుకు అంటే – అమ్మ అనల్పత్వం ముందు మన అల్పత్వాన్ని చాటుకోవడంలో ఒక శరణాగతి, సమర్పణ భావాలు చోటుచేసుకుంటాయి.
అమ్మ దేహం పాంచ భౌతికమైనదా? పార్ధివ శరీరమా? కాదు. అమ్మ శరీరం దివ్యమైనది.
‘జనక తనయాస్నాన పుణ్యోదకేషు’ అన్నారు. కాళిదాస మహాకవి – సీతాసాధ్వి స్నానమాచరించడం వలన ఉదములు పవిత్రీకృతములైనవి – అని;
‘నానాచ్ఛిద్ర ఘటోదరస్థిత దీప’ ప్రభ అమ్మ. కనుకనే పాదోదక వినివారిత రోగ;
అమ్మను చూడటమే అమ్మను పొందటం. క్షిప్రప్రసాదం అనేదానికి ఉదాహరణ అమ్మ ప్రత్యక్ష సాన్నిధ్యం. ఆ దర్శన ఫలం సాయుజ్య ప్రాప్తి. కనుకనే వాత్సల్యయాత్ర పేరిట కోటి మందికి దర్శ భాగ్యాన్ని ప్రసాదించింది.
అమ్మ మనలాంటిదేనా? ఒక విచికిత్స:
అమ్మ జిల్లెళ్ళమూడిలోనే ఉంటుందా? అవును కాగా సర్వత్రా ఉంటుంది.
అమ్మ తన నేత్రాలతోనే చూస్తుందా? అవును – కాగా అమ్మ విశాలాక్షి, యావజ్జగతిని క్రీగంట వీక్షిస్తుంది, శాసిస్తుంది.
అమ్మ తన కర్ణములతోనే వింటుందా? అవును – కాగా బాధాపరితప్త గాధలను, వేదనలను దగ్గర దూరముతో నిమిత్తంగా లేకుండా ఆలకిస్తుంది, ఆదుకుంటుంది..
అమ్మ తన పాదయుగళంతోనే సంచరిస్తుందా? అవును – కాగా ఏకకాలంలో ఏ రూపాన్నైనా ధరిస్తుంది, ఎన్ని ప్రాంతాల్లోనైనా సంచరిస్తుంది.
అమ్మ ముగ్గురు బిడ్డల తల్లియా? సామాన్య గృహిణియా? అవును అనిపిస్తుంది. కాగా అమ్మ విశ్వకుటుంబిని, విశ్వజనని.
అమ్మ సంకల్పాలు మన సంకల్ప వికల్పాల వంటివా? కానేకాదు. మానవ సంకల్పాలు, రాగ బంధురాలు, స్వార్థపూరితాలు, దుఃఖహేతువులు. మానవులకి స్వార్థమే పరమార్ధం. అమ్మకి పరమార్ధమే స్వార్థం.
విశ్వకళ్యాణం కోసం కన్నబిడ్డనే కర్పూరహారతి పట్టింది, తన మంగళసూత్రాలనే జగత్కళ్యాణ సూత్రాలుగా ఆవిష్కరించింది.
అమ్మ కన్నుల్లో కదలికల్లో కారుణ్యం, త్యాగం వెల్లువిరుస్తాయి.
అమ్మ తత్వం – అమృతత్త్వం.
అమ్మ మనలా తింటుందా? నిద్రిస్తుందా! లేదు. అమ్మ నిరాహార.
అమ్మ నిద్రలోనూ మెలకువతోనే ఉంటుంది. అది నిద్రకాదు; సహజసమాధి.
అమ్మ మనవలెనే సంభాషిస్తుందా? కాదు – ఒక సమాధానాన్ని అపేక్షించి అమ్మ ఎవరినీ ప్రశ్నించదు. కాగా వ్యక్తినిగాక వాని అంతరాత్మతో సంభాషిస్తుంది, ప్రశ్నిస్తుంది, విచికిత్సను రేపుతుంది, సత్యావిష్కరణ చేస్తుంది, సంస్కరిస్తుంది, ఉద్దరిస్తుంది.
“ఒకసారి అమ్మ తెనాలిలో ఒక ఎద్దుని నిమురుతూ “ఇంకా ఉన్నావురా నీవు! అన్నది” – అని వివరించిన సద్గురు శ్రీశివానన్దమూర్తిగారి ప్రబోధంలో ఈ తాత్పర్యం ధ్వనిస్తుంది.
అంతేకాదు. సాధారణంగా అమ్మ పలుకులు సార్వత్రికములు, సార్వకాలికములు. ఒక ఉదాహరణ: సోదరి మన్నవ సుబ్బలక్ష్మి తొలిసారి జిల్లెళ్ళమూడి వచ్చినపుడు అమ్మ ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని “నువ్వు ఇక్కడ ఉండిపో” అన్నది. అందుకు ఆమె “అమ్మో! మా అమ్మ దిగులుపడుతుంది” అన్నది. తక్షణం ఆమెను అమ్మ “నేను నీ అమ్మను కానా?” అని అడిగింది. అందరికీ అమ్మయే అసలైన అమ్మ. ఇక్కడ మరొక పరమార్ధం దాగి ఉన్నది. “నువ్వు ఇక్కడ ఉంటే మీ అమ్మ దిగులుపడుతుంది. నేనూ అమ్మనే; నన్ను నువ్వు వదలి వెళ్ళిపోతే నీ కోసం దిగులు పడనా?” – అని.
మనందరికోసం దిగులుపడే భగవంతుడు అమ్మ.
ఇక మరొక కోణంలో వీక్షిద్దాం:
‘అమ్మ అవతరించింది, దివినుండి భువికి దిగివచ్చింది’ అని సంభావన చేస్తాం. అవతరణం అంటే పైనుండి క్రిందికి దిగటం. ఒక సందర్భంలో ఒక సోదరునితో అమ్మ ఒక సవాలు (challenge) ని విసిరింది – “నాన్నా! ఈ సృష్టిలో నేను కానిది, నాది కానిది ఎక్కడైనా ఉంటే చూపించు”- అని. మన గృహంలో హాలులోంచి వరండాలోకి వస్తే మరెక్కడికో పోయినట్లు కాదుకదా! దివినుండి భువికి అంటే మానవ దృష్టిలో అదివేరు; అమ్మ దృష్టిలో కానేకాదు. ఈ పరమార్థాన్ని ఆవిష్కరిస్తూ అన్నమయ్య ఒక కీర్తనలో ప్రశ్నల వర్షం కురిపించారు.
‘విశ్వప్రకాశునకు వెలి ఏడ? లో నేడ?
శాశ్వతునకూహింప జన్మమిక నేడ?
సర్వపరిపూర్ణునకు సంచారమిక నేడ?
ఆనన సహస్రునకు అవ్వలిన లేడ?’ అంటూ
అన్తర్బహిశ్చ తత్సర్వం వ్యాపించి ఉన్న జగజ్యోతి. అమ్మ ఎక్కడినుంచి ఇక్కడికి వచ్చింది? ఎక్కడికి వెళ్ళింది? అనే ప్రశ్నలకి సద్గురు శ్రీ శివానన్దమూర్తి గారు సూటిగా సుందరంగా సమాధానాలనిచ్చారు –
“అమ్మ తాను కాలస్వరూపిణి (కాళి)యై తాను ప్రత్యక్షంగా వచ్చి, అసహాయ స్థితిలో ఉన్న జీవులను, ఎటువంటి సాధనా చేయలేని జీవులను, ముక్తిని అనేక జన్మలనుండి కోరుకుంటున్న వారిని తాను తీసుకెళ్ళడానికి వచ్చినది.
‘కశ్యపః పశ్యకో భవతి’ అన్నట్లు ఎవరి దర్శనం వారిది.
‘అమ్మ మరలా వస్తుందా? ఎందుకు వస్తుంది? ఎప్పుడు వస్తుంది?’ అంటే – అసలు వెళితే కదా మళ్ళీరావడానికి. అందుకని ఉన్నది ఇక్కడ” – అని.
అమ్మ మనుజదేహమ్ము లోని ఓ మహితశక్తి, స్వయంగా ఆవిర్భవించింది, ప్రకటితమైంది’ – అన్నారు.
శ్రీ భాస్కరరావు అన్నయ్య.
అమ్మ మనకి ఒక భరోసాకూడా ఇచ్చింది, “మీతోపాటే నేను, నాతోపాటే మీరు అంతే” – అని. మనం ఉన్నంతకాలం అమ్మ ఉంటుంది. అంతేకాదు. మనం ఎవ్వరం లేనప్పుడు కూడా అమ్మ ఉంటుంది. సృష్టిస్థితిలయ తిరోధాన అనుగ్రహాలనెడి అమ్మ పంచకృత్యాలను దర్శించటం ఏరికి సాధ్యం?
‘ఎవరు రమణ మహర్షిని ఎరుగగలరొ
ఎవరు శ్రీ రామకృష్ణు గ్రహింపగలరొ
ఎవరు మానవ దైవత్వమెంచగలరొ
దేవి! వారలె నిన్ను గుర్తింప గలరు’ – అన్నారు.
డా॥ ప్రసాదరాయ కులపతి.
అనంతమైన అమ్మ అనంతమ్మ.
అనంతోత్సవాల సందర్భంగా అమ్మ అనంత కళ్యాణగుణ సంపదని, దివ్యలీలల్ని, వైభవాన్ని, అనుగ్రహాన్ని కీర్తిద్దాం, ధ్యానిద్దాం, తరిద్దాం.