1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అనర్హ్య కైవల్యపదదాయిన

అనర్హ్య కైవల్యపదదాయిన

Mallapragada Srivalli
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : November
Issue Number : 4
Year : 2010

అప్రమేయాం స్వప్రకాశాం మనోవాచామగోచరాం

 విద్యా విద్యా స్వరూపిణీం వందే అర్కపురీశ్వరీం

వేదాంత శాస్త్రం ప్రకారం ముక్తి నాలుగు విధాలు. 1. సాలోక్యం “తాను కొలిచే దేవుని లోకానికి చేరుకోవడం. 2. సామీప్యం ‘తన ఆరాధ్య దైవానికి సమీపంలో ఉండడం. 3. సారూప్యం – తాను ఆరాధించే దేవుని రూపాన్ని పొందడం. 4. సాయుజ్యం – అఖండమైన పరమాత్మతో ఐక్యం కావడం. అయితే, ఈ నాలుగూ పునరావృత్తిని కలిగించేవే. అంటే, చేసుకున్న పుణ్యం పరిసమాప్తం కాగానే మళ్ళీ జన్మని ఇచ్చేవే. కైవల్య పదం చేరినవారికి పునర్జన్మ లేదు. అలాంటి కైవల్యాన్ని ప్రసాదించి, శాశ్వతమైన మోక్షపదవిని అనుగ్రహించి, భక్తులకు ఆనందాన్ని కలిగించే శ్రీమాత కైవల్య పదదాయిని. అంటే, భక్తులలోని భక్తి స్థాయిని బట్టి, ఆయా రకాల మోక్షాలను అనుగ్రహిస్తూ, భక్తిలో పరాకాష్ఠను చేరుకున్న భక్తులకు అనర్ఘ్య (అమూల్యమైన కైవల్యపదాన్ని ప్రసాదిస్తుంది శ్రీమాత. సర్వవ్యాపకమైన ఆత్మతత్త్వాన్ని తెలుసుకోవడమే కైవల్యం. ఆ కైవల్య పదం లలితాదేవి అనుగ్రహం వల్ల సంప్రాప్తమౌతుంది. కనుక, శ్రీమాత అనర్ఘ్య కైవల్య పదదాయిని – భారతీ వ్యాఖ్య.

“శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్” అని బమ్మెర పోతనామాత్యుడు ప్రకటించాడు. మనలో ప్రతి ఒక్కరికీ ఆ కోగిక అంతో ఇంతో ఉంటూనే ఉంటుంది. అయితే, సామాన్య మానవులమైన మనకు, పైన పేర్కొన్న మోక్షాలలో ఏ ఒక్కటికూడా, వేల వేల జన్మలకు గాని సాధ్యంకాదు. ఎంతో తపస్సు, సంబుద్ధి కల ఏ కొద్దిమందికో అమ్మ దయవల్ల ఈ నాలుగు రకాల మోక్షాల్లో – వారి వారి స్థాయిని బట్టి, ఏ ఒక్కటో లభిస్తుంది. ఇక, కైవల్యపదం అందుకోవాలంటే, అది మన ఊహకు కూడా అందని విషయం. అంతటి ఉత్కృష్టమైన కైవల్య పదాన్ని లలితాదేవి అనుగ్రహ విశేషంతో చేరుకున్న ధన్యజీవులు – ఇంతటి సృష్టిలో కోటికొక్కరు ఉంటారు అనడం కూడా ఆలోచించాల్సిన విషయమే.

“అమ్మ” అనర్య కైవల్య పదదాయిని. “అమ్మ” అనుగ్రహంతో ఆ అనర్ఘ్య కైవల్య పదాన్ని చేరుకున్న హైమక్క అదృష్టం ఇంతింత అని చెప్పలేం. “అమ్మ”కు పుట్టడమే హైమ పూర్వజన్మల పుణ్య ఫలం. అంతేకాదు. ప్రేమ, దయ, శాంతం, సహనం వంటి “అమ్మ” గుణాలను పుణికిపుచ్చుకుని, కొన్ని కొన్నిసార్లయితే, “అమ్మ” కంటే ఎక్కువగా వాటికి వశమై ప్రవర్తించిన హైమక్క కైవల్య పదాన్ని పొందడానికి సంపూర్ణమైన అర్హతను సంపాదించుకుంది. హైమక్క అర్హతను గుర్తించింది కనుకనే, “అమ్మ” – మనతో తిరుగుతూ, మనలో ఒకతెగా మసలుతూ ఉన్న హైమక్కలోని అత్మతత్త్వజ్ఞానాన్ని పరిశీలించి, పరిశోధించి, పరీక్షించి, తత్ఫలితంగా ఆమెకు స్వస్వరూపాన్ని అనుగ్రహించి, మనకు ఆరాధ్యదేవతగా ఆలయంలో ప్రతిష్టించింది. అంటే, హైమక్కకు అనర్ఘ్య కైవల్య పదాన్ని ప్రసాదించింది. అలా అనర్ఘ్య కైవల్య పద దాయినిగా మనకు సాక్షాత్కరించింది “అమ్మ”.

హైమక్కతో నాకు పరిచయం కొంచెమే. అయితే, కొద్ది కాలంలోనే ఆమెలో గల ఆత్మ తత్త్వజ్ఞానాన్ని తెలుసుకోగల అదృష్టం నన్ను వరించింది. “అమ్మ” హైమక్కను వైద్యం కోసం చీరాల్లో మా నాన్నగారి వద్ద కొంతకాలం ఉంచింది. అది పైకి కనిపించే కారణం. అయితే, హైమక్కను అలా మా ఇంట్లో ఉంచి, ఆమెతో సాన్నిహిత్యం మాకు కలిగించడం – మేం చేసుకున్న పుణ్యం. ఎందుకిలా అంటున్నానంటే మా నాన్నగారు చేసిన – వైద్య చికిత్సలు నిజంగా ఫలించి ఉంటే, హైమక్క అంత తొందరగా మనకు దూరమయ్యేది కాదు కదా! “అమ్మ” సంకల్పం వేరు. అందుకే ఈ వైద్య పరీక్షలు, చికిత్సలు హైమక్క ప్రాణం నిలపడానికి ఏం పనిచేయలేకపోయాయి. అంతటా “తానే” నిండి ఉన్నాననే జ్ఞానాన్ని, పరిపక్వ స్థితిని హైమక్కకు కలిగించడానికి, ఆమె ద్వారా సర్వవ్యాపకమైన ఆత్మతత్త్వాన్ని గుర్తించమని మనకు తెలియజేయడానికి, “అమ్మ” ఆడించిన నాటకంలోని భాగాలే ఈ సంఘటనలన్నీ. కాబట్టే, ఎందరో వైద్యులు ఎన్నో రకాలుగా ప్రయత్నించినా హైమక్కకు గల వ్యాధిని ఏమాత్రమూ తగ్గించలేక పోయారు. “అమ్మ” నిర్ణయమే అమలు జరిగింది.

“చీమలో దోమలో కాదు. చీమగా దోమగా ఉన్నది నేనే” – అని “అమ్మ” చెప్పిన మాటను మనమందరం విన్నాం. కానీ దాన్ని ఆచరణాత్మకంగా అనుభవంలోకి తెచ్చుకున్న మహామనీషి హైమక్క. ఆమెలోని ఆత్మతత్త్వజ్ఞానం ఎన్నో సందర్భాల్లో, ఎన్నో రకాలుగా వ్యక్తమయింది. పంచదారలోని తీపికి ఆశపడిన చీమ, అందులో ఉండి, దాన్ని కాఫీలో వేయగానే, ఆ వేడికి చచ్చిపోతే, దాని చావుకు బాధపడుతూ, కాఫీని తాగలేకపోయిన హైమక్క ఆ చిన్న చీమలోని ఆత్మ తత్త్వాన్ని . “అమ్మ” తత్త్వంతో గ్రహించింది. దొంగతనాలు, దోపిడీలు చేసినవారు పొరబాటువల్లనో, గ్రహపాటు వల్లనో పోలీసులకు చిక్కి, పోలీసు స్టేషనులో లాఠీ దెబ్బలు తింటూ, బాధతో అరుస్తుంటే, ఆ అరుపులకు వ్యధ చెందిన హైమక్కలోని అవ్యాజకరుణ ఆమెలోని ఆత్మ తత్త్వ జ్ఞానానికి ప్రత్యక్ష నిదర్శనం. తాను చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సమయంలో, మా నాన్నగారితో బాటు నేనూ హైమక్కను చూడాలనే కోరికతో జిల్లెళ్ళమూడికి వెళ్ళాను. నన్ను చూస్తూనే, తనకున్న కొద్దిపాటి జీవశక్తిని కూడదీసుకుని, అప్పటి నా పబ్లిక్ పరీక్షను గురించి – “పరీక్షకు వెళుతున్నావా ? బాగా చదివావా ?” అని అడుగుతుంటే, బాధపడుతున్న హైమక్కను చూడలేక, కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరుగుతుంటే, నోటమాట రాక, మౌనంగా తల ఊపడం నా వంతయింది (నా ‘వంత’ అయింది) అంత బాధలోనూ, నా  పరీక్షను గుర్తుపెట్టుకుని ప్రశ్నించిన హైమక్క – సహనానికి మరో పేరా ? అనిపించింది.

చావు బతుకుల మధ్య పోరాటం తనది. గెలుపు ఎటో ? ఎవరికీ అర్థం కాని అయోమయ పరిస్థితి. “అమ్మ”కు మాత్రమే తెలిసిన హైమక్క నిజస్థితి. ఆ సమయంలో హైమక్క ప్రదర్శించిన సంయమనం యోగి పుంగవులకు, జ్ఞానులకు మాత్రమే సాధ్యం తప్ప, మామూలు మానవులకు అసాధ్యం. అది “అమ్మ” ఆమెకు పెట్టిన ఆఖరి పరీక్ష. అంతకుముందు “అమ్మ” పెట్టిన అన్ని పరీక్షల్లోనూ ప్రప్రథమ స్థానాన్ని సంపాదించుకున్న హైమక్క. ఈ ఫైనల్ ఎగ్జామ్ లో కూడా తన స్థాయిని ఏమాత్రం తగ్గించుకోలేదు. అత్యున్నత స్థానంలో నిలచి, జగమంతా “అమ్మ”మయంగా, అంతటా “అమ్మ”నే దర్శిస్తూ, “వస్తున్నానమ్మా” అంటూ “అమ్మ”లో ఐక్యమయింది. “అమ్మ” అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది, అసాధ్యమైన అనర్ఘ్య కైవల్య పదాన్ని కరతలామలకం చేసుకున్న భాగ్యశాలిని హైమక్క ఆమెకు అనర్ఘ్య కైవల్య పదాన్ని అనుగ్రహించిన “అమ్మ” అనర్ఘ్య కైవల్య పదదాయిని. 

హైమమ్మ సన్నిధి అదే మనకు పెన్నిధి 

కనిపించని దైవమే కనిపించెను హైమలో.

జ్ఞానమే భగవంతుడు. సర్వాన్నీ తెలుసుకొన్నదే జ్ఞానం.

నేనెవరు ? అన్న ప్రశ్నకు సమాధానం దండలోని దారమే. పూసలు ప్రక్కకు లాగినపుడు నేననే దారం కనిపిస్తుంది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!