విశ్వజనని, జిల్లెళ్ళమూడి అమ్మ. 30-10-1968 న జరిగిన ఒక సంభాషణలో కర్మబంధాలు తెంచడానికి సమర్థవంతమైన ఒక మంత్రాన్ని పేర్కొన్నారు. దాన్ని చతురాక్షరమంత్రము అన్నారు. అదేమిటి అని అడిగిన రామకృష్ణ శర్మ గారికి ‘అనసూయ’ అని చెప్పారు. ఏమిటి ఈ అనసూయ అనేది తెలియడం వల్ల అమ్మతత్త్వములో కొన్ని అంశాలను తెలియగలము అనే ఉద్దేశ్యంతో ఈ వివరాలు పొందుపరుస్తున్నాను.
‘అ’ అనేది అనసూయ మంత్రంలోని తొలి అక్షరం. అ అనేది వర్ణమాలలో మొదటిది. అఇఉణ ఋలుక్ అనే
అనే పాణినిమహేశ్వర సూత్రాలలో అ మొదటిది. భగవద్గీత పదవ అధ్యాయం ప్రకారం వర్ణములలో అ అనేది పరమాత్మ.. స్వరూపసూచకము. అ అనేది అకార, ఉకార, మకారాదులతో కూడుకున్న ప్రణవము లేదా బ్రహ్మబీజమైన ఓంకారము లోని మొదటిస్థితి. అదే మాండూక్యోపనిషత్తు ప్రకారము వివిక్తభుక్ అయిన వైశ్వానరతత్త్వం. అహం వైశ్వానరో పచామ్యన్నం చతుర్విధం.. అని భూత్వా పచామ్యన్నం పురుషోత్తమప్రాప్తియోగంలో భగవానుడు చెప్తాడు. పురుషోత్తమప్రాప్తికి తొలిస్థాయి ‘అ’ అనగా అమ్మ ప్రకారము అడ్డులేనిది. అది ఒక అప్రతిహతమైనస్థితి. అ అనేది అనంతమునకు అంతము లేనిదానికి ప్రతీక. అంతములేనిదానికి అదికూడా ఉండదు. అందువల్ల అ అనేది అద్యంతరహితమైనస్థితిని లక్ష్యంగా ప్రతిపాదిస్తున్నది. అ అనగా అఖండము. అదే అద్వైతము, ఆనందము. తాను ఒక్కటే ఒక్కటిగా ఉంటూ, తానే అనేకమైన, ఆనందస్వరూపమై, అద్వైతానుభవ రూపమై, అద్వితీయమైన సత్యమై ఏకమై ఉండునది. ఈ రకంగా అ అనే అక్షరము లక్ష్యాన్ని ప్రతిపాదిస్తున్నది. ఆ లక్ష్యము అఖండాద్వైతానందానుభవము. ఇదే అభయము, అజరము, అమర్త్యపదము అని న్యాయదర్శనములో చెప్పబడింది.
చతురాక్షరమంత్రములో రెండవ అక్షరము ‘న’ అనగా నశించునది. ‘అ’ అనేది అవినాశతత్త్వమును సూచిస్తే న అనేది నశించేతత్త్వాన్ని సూచిస్తుంది. అనగా నశించేతత్త్వమునుండి అవినాశతత్త్వమును చేరాలి. నశించు అంటే పూర్తిగా లేకపోవడం. కాదు. నశించడము వ్యక్తస్థితినుండి. అవ్యక్తస్థితిలోకి పరిణమించడం. పాలు పాలుగా, మీగడగా, పెరుగుగా, వెన్నగా, నెయ్యిగా ఎలా ఉన్నాయో, అహంకారం ఆకాశముగా, వాయువుగా, అగ్నిగా, జలముగా, భూమిగా ఉంటుంది. ఇవన్నీ మధనంవల్ల వేరయినవే. ఇవన్నీ రూపనామసహితమైన వికారాలే. ఇవన్నీ మనస్సు, కాలము, అనే రెండింటికి లొంగి పరిణమించేవే. ఇవి రూపంగా కనపడుతూ, శక్తిని కలిగి, వినియోగము ద్వారా సమర్థవంతమౌతాయి. అందువల్లనే రూపము, శక్తి, వినియోగము అవసరమైన త్రిపుటి అని అమ్మ పేర్కొంటారు. ఈ ‘న’ అనేది పరిణామాన్ని, ప్రమాదాన్ని, ప్రమోదాన్ని ప్రమాణాన్ని సూచిస్తుంది. పరిణామము అనడంలో జననమరణాలు పరిణామమే అని చెప్పడం జరిగింది. ప్రమాదము అనగా మనసంకల్పముతో సంబంధంలేకుండా జరిగేది. ప్రమోదము అనగా ఇంద్రియములతో సంబంధంలేని సంతోషం. ప్రమాణము అనగా ఈ కనిపించే, వినిపించే, భ్రమణశీలమైన, పరిణామసహితమైన, భ్రాంతితోకూడిన స్థితిలో జ్ఞానమును ప్రతిపాదించేది. ఏది వికల్పమును తొలగిస్తుందో, ఏది సంకల్పంతో సంబంధంలేదో అదే జ్ఞానము. నశించే శరీరంతోనే నశించని జ్ఞానాన్ని తెలుసుకోవాలి… అని చెప్పేదే ‘న’ అనే అక్షరము.
అనసూయ అనే చతురాక్షరమంత్రము మూడవది ‘సూ’. సూ అనేది సూచించే సూత్రము. ఇది సుగతిని సూచించే సూత్రము. నశించేతత్త్వాన్ని గల ఈశరీరంతో అఖండాద్వైతానందానుభవంవైపు మరలడమే సుగతి అని సూచిస్తున్నది. ఇది బోధకాదు. సూచన మాత్రమే. యుక్తితో ఆ సూచనను గ్రహించ గలగాలి.
‘య’ అనేది సుగతిమార్గాన్ని చెప్పేది. ‘య’ అంటే యమము. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మ చర్యము, అపరిగ్రాహ్యములను యమము లు అంటారు. వైరమును త్యజించడం అహింస. ప్రకృతిగొప్పదనాన్ని గుర్తించడం సత్యము. ఇంకొకరిదాన్ని పొందాలను కోకపోవడం అస్తేయము. రూపము, లింగము, స్పర్శ అనే భేదము లేకపోవడం బ్రహ్మచర్యము. ఇంకొకరినుండి ఏదీ పొందకపోవడం అపరిగ్రాహ్యం.
యమములను అనుసరిస్తూ, ధ్యాసతో జీవిస్తే సుగతి లభిస్తుంది అని చెప్పడమే అనసూయ మంత్రతాత్పర్యము…..