అన్నపూర్ణాలయపు గంటలో యే తల్లి నవ్వుల సవ్వడి వినిపిస్తుందో, జ్వలిస్తున్న గాడిపొయ్యి వెలుగులో యేతల్లి కళ్ళమెరుపు ఉజ్వలంగా కనిపిస్తుందో, యే తల్లి మాటలో మాధుర్యమున్నదో, యే తల్లి మనసులో మాధవత్వమున్నదో ఆ తల్లి భుక్తి మార్గాన ముక్తినిచ్చు ఏకైక మాత, ఆమె అర్కపురి పురస్త్రి అమ్మ అనసూయ.
ప్రాపంచికతలో మునిగి తేలిన ఒక సాధారణ యిల్లాలుగా పదహారణాల తెలుగింటి ఆడపడుచుగా మన మధ్య తిరిగింది. అమ్మ స్తన్యమూ అన్నప్రాశన ఎరుగని అమ్మ అన్నపూర్ణగా ప్రభవించింది. ఆమె జీవయాత్రలో ఎదురైన కష్టాలు, కడగండ్లు దుఃఖం, దారిద్ర్యం, అసూయలు అపనిందలు, అవమానాలు అన్నీ భరించింది గాని ఏనాడూ ఎవరినీ నిందించలేదు. ఆపన్నహస్తం కోసం ఆశించలేదు. అసహనాన్ని చూపలేదు. ఎవరినీ దూషించలేదు. ద్వేషించటం అసలే లేదు. ప్రతికూల పరిస్థితులకు ప్రశాంత మనస్కతతో సమాధానం చెప్పింది. బిడ్డల పాపాలు తాను స్వీకరించి పడ్డ యాతన ఇంతింత అనరానిది. అయినా నిశ్చలంగా నిర్మలంగా మనుగడ సాగించింది. “బాధ ఎవరిదైనా అనుభవం నాదే అన్న స్థితప్రజ్ఞ కర్పూర ఖండమై వెలిగింది. పరుష వాక్కెరుగని పరమ హంస, ద్వంద్వాతీతంగా ఉండుట ఎట్లో ఆచరణలో చూపే ఆధ్యాత్మ సీతగా, ఆదర్శమాతగా నిలచింది.
మహత్కార్యాల పట్ల మక్కువ చూపలేదు. పాండిత్య ప్రకర్ష లేదు. ప్రవచనాలు ప్రసంగాలు చెయ్యదు. వేదాంత సిద్ధాంత రాద్ధాంతాల శిరోభారం కలిగించదు. కాని అమ్మ వాక్కు బ్రహ్మ వాక్కు. మాతృముఖ నిర్గత పద సమూహాలు బిడ్డల జీవనార్తి తీర్చు జాహ్నవీ తరంగాలు. అమ్మ పెదవుల పంజరం దాటిన మాటలు కోకిలలై మనస్సనే మామిడి కొమ్మపై వాలి…
“నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టు “కో”
ఏ ఆలోచన వచ్చినా భగవత్స్వరూపమే అను “కో”
తెలియనిది తెలియ జేయటానికే నా యీ రాక అని తెలుసు “కో”
అని కలరవాలు చేసి, అలతి పదాలలో అనంత భావాన్ని వినిపిస్తాయి. సాధారణ భాషలో సనాతన ధర్మాన్ని వివరిస్తాయి. మనం వేసే ప్రతి అడుగులో ప్రతిధ్వనిస్తాయి.
దొంగలు, నక్సలైట్లు, తాగుబోతులు, వదరుబోతులు, సంస్కారహీనులు, మానవతా శూన్యులు అందరినీ అమ్మ సంస్కరించింది. పవిత్రులను చేసింది. మాతృవాత్సల్య రసాకృతియై మాత్సర్యాలు మటుమాయం చేసింది. అమ్మ పథంలో కరుణే గాని కక్ష లేదు. శిక్షణే గాని శిక్ష లేదు. దుష్టులను శిష్టులుగా మార్చే ప్రక్రియలో ఆమె వాడిన ఆయుధాలు – ప్రేమ, లాలన, కరుణ, క్షమ అనే దివ్య గుణాలే. రామపాదం తాకగానే రాయి అహల్యగా అయినట్లు అమ్మ దీవెన లభించగానే, జ్ఞానసూర్యుడుదయించిన రీతి మరో జన్మ లభించిన మహానుభూతి!
భౌతికంగా అమ్మ దర్శన, స్పర్శనాదులు లేకపోతే యేం? ఆ అనురాగ మూర్తి ఆత్మీయతను, ఆశీస్సులను అందుకొంటున్నవారు కోకొల్లలు. ఆత్మ తత్వానికి లేవు ఎల్లలు. అమ్మ ఆలయప్రవేశం ఒక చారిత్రక సంఘటన. అది ఫుల్స్టాప్ కాదు ఒక కామా మాత్రమే. “ఈ శరీరం లేనపుడు ఉన్నప్పటి కంటే ఇంకా ఎక్కువగా మీకు దగ్గరవుతాను, నేనెప్పుడూ మీతోనే ఉంటాను” అన్న మాటలు అక్షర సత్యాలు. అమ్మకు ముందు పుట్టినవారు, తర్వాత పుట్టిన వారూ అందరూ ఆమె బిడ్డలే. ఏడవ మైలురాయి దాటాలన్న తలపు రావటమే ఒక మహత్తరమైన మలుపు. జిల్లెళ్ళమూడి వచ్చిన వారందరికీ, ఇక పై రాబోతున్న తరానికి, రాని, రాలేని వారందరికీ అందుతాయి అమ్మ ఆశీస్సులు. అందరికీ సుగతే – కాస్త ముందూ వెనకా తేడా గాని అని అమ్మ చెప్పనే చెప్పింది. గదా.
ఈ ప్రపంచానికి, ఈ పాంచ భౌతిక లోకానికి అలౌకిక అమ్మ తత్వాన్ని అందులోని అనంతత్వాన్ని తెలియ చెప్పటానికి భువిని వెలసిన అనిర్వచనీయ దివ్య విభూతి అమ్మ! అందుకే అంటాను మాతృభావ జలధిలో మునకలెయ్యాలి. అమ్మ మాటలను చింతన చెయ్యాలి. చింతనలోంచి చైతన్యము, చేతన, చేతలు రావాలి. అవే అందరమ్మకు, విశ్వమాతకు మనమివ్వగలిగిన నీరాజనాలు.