ఒక విలక్షణ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దు కుంటున్న క్షేత్రం బాపట్ల సమీపంలోని జిల్లెళ్ళమూడి. ఆ క్షేత్రాధి దేవత ‘జిల్లెళ్ళమూడి అమ్మ’గా ఆబాలగోపాల విదిత అయిన అనసూయాదేవి. అనసూయానాథులు శ్రీబ్రహ్మాండం నాగేశ్వరరావు మహోదయులు. అందరూ అప్యాయంగా పిలుచుకునేది నాన్నగారనే. వారి జన్మ తిథి ప్రమాది ఆశ్వయుజ. బ. సప్తమి (21-10-2013) అంటే 2013 వారి శతజయంతి సంవత్సరం.
అక్టోబర్ 22 నుంచి నాన్నగారి శతజయంతి ఉత్సవాలు మొదలయ్యాయి. ఎందరో కవులు, పండితులు, విద్యావేత్తలు, నాన్నగారికిష్టమైన ఆటలలో, నాటకాలలో పాల్గొనే కళాకారులు అతిథులుగా వచ్చారు. మొదటి రెండు రోజులు బాగానే గడిచాయి. మూడవ నాటినుంచి మబ్బులు ఒళ్ళు మరచి విజృంభించాయి. కుండపోతగా వర్షాలు కురిశాయి. వడివడిగా వరదొచ్చింది. అర్కపురి అదిరిపడ్డది. ఒక్కసారి తిరిగి చూసుకుంటే చుట్టూ పొలాల్లేవు. పచ్చని తివాసి పరుచుకున్న ప్రకృతిలేదు. కనుచూపు మేర జలరాశి తప్ప మరొకటికానరాదు. ఎడతెరపి లేని వర్షాలకు నల్లమడ వాగుకి గండ్లుపడి జలదిగ్బంధంలో చిక్కుకున్నది జిల్లెళ్లమూడి. బాపట్ల, పెదనందిపాడు రహదారిలో 7వ మైలురాయి వంతెన వద్ద వరద ఉద్ధృతి భయంకరంగా ఉన్నది. ప్రకృతి తిరగబడింది. కాల్వలు నదులు బరి తెగించాయి. ఓంకార నదికి అమ్మ పాదాభిషేకం చెయ్యాలన్న తలపు కలిగిందో ఏమో వరదనీరు ముందుగా వసుంధరక్కయ్య రవీంద్రరావన్నయ్య ఇంటికి వచ్చి ముందుకు సాగుతున్నా అన్నట్లు చూసి, నూతనంగా రూపుదిద్దు కుంటున్న అన్నపూర్ణాలయంలోకి చేరిపోయింది. అనేకం దాచుకునే భూదేవి నాలుగు చినుకులు పడితే దాచుకోలేదు కదా. సృష్టికి ముందున్న నిరాకార స్వరూపం జలమే. జలతత్త్వం ద్రవస్థితిలోనిది. ‘రస’ తత్త్వం వల్ల పుట్టినది. రసతత్త్వం రసనేంద్రియబోధగలది. ఈ జ్ఞానేంద్రియ పరిధిలో రుచి తెలుస్తుంది. అమ్మకు, అన్నానికి ఉన్న అద్వైత స్థితి ఆకలిగొన్నవాడే ఆ రుచి తెలియగలడు.
అయినా ఏ కార్యక్రమమూ ఆగిపోలేదు. ఏ వక్త గొంతుకా మూగబోలేదు. కాలనీలు మునిగిపోయాయని బెంగపడలేదు. భూమి అంతా మూడు వంతులు జలం. మన శరీరంలోను మూడువంతుల ద్రవం. సహజ ప్రక్రియనే ఈ ఉపద్రవం అనుకున్నారు. నిదానంగా, నిశ్చలంగా కాగల కార్యానికి నడుం కట్టేరు.
ఒక్క ప్రాణీ భీతిల్లలేదు. గ్లోబల్ విలేజ్ అలవాట్లకి దూరం ఈ గ్రామం. ఎవరో వస్తారని, ఏదోచేస్తారని ఎదురు చూడలేదెవరూ. వానకు తడిశారు. వరదకు తలవంచారు. జల అలజడిలో సాటివారు, తన తోటివారు వరద బాధితు లందరూ సహకుటుంబీకులైనారు. అనంత దయాంబురాశి, అమ్మ మాకు అండగా నిలిస్తే అంబురాశి ప్రతాపం ఏపాటిది అనుకున్నారు. ప్రకృతిలో పరమేశ్వరుని దర్శించినట్లు, తపనే తపస్సయినట్లు, మానవసేవే మాధవసేవ అన్న మాటల్లో పరమార్థం ప్రత్యక్షంగా గోచరించింది. అమ్మ అడుగుజాడలు కనిపించాయి. నాకిష్టం. ఒకరి కొకరు సహాయ పడడం కలిసి పని చేసుకోవటం ఎంత బావుంటుంది? అనేది అమ్మ. ఆడవాళ్ళెవరూ కూచోలేదు. మగవాళ్ళు పనిచెయ్యటం మానలేదు. ఎంత బావుంటుందో ప్రత్యక్షంగా చూసి అనుభవించాం. అక్కడివారు, సభలకొచ్చిన అతిథులు, ఊరివారు, అందరూ సేవకు అంకితమైపోయారు. కమిటీల ప్రసక్తి లేనేలేదు. అన్నం పెట్టడమే అంగన్యాసం, కడుపునింపడమే కరన్యాసం, మమత పంచడమే మహన్యాసం అని భావించే బిడ్డలు నడుం కడితే ఆదిశక్తి, అన్నపూర్ణ అడుగడుగనా తిరుగుతుంటే ఆకలిగొన్న వ్యాసులు అర్కపురిని కానరారు. జలబంధితులైన గ్రామస్థులను, మూగజీవాలను సురక్షిత స్థలాలకు చేర్చారు. అమ్మ సేవాసమితి బహుళ అంతస్థుల భవనాల పంచన చోటిచ్చి అన్నపానాలకు లోటు లేకుండా ఆదుకున్నారు. వీళ్ళకే కాదు మంగళగిరి నుంచి వచ్చిన కేంద్ర ప్రభుత్వ విపన్నివారణ బృందానికి జిల్లా కలెక్టర్ వారి సిబ్బందికి ఆశ్రయము, అన్నపానాలు అందజేశారు. తిరిగి వెళ్ళవలసిన అతిథులను, పెద్దలను,గ్రామస్థులు కళాశాల విద్యార్థులు మోకాలు లోతు నీళ్ళలో ప్రయాణానికి సాయపడి, సాగనంపి అతిథి దేవోభవ అనుకున్నారు.
ఈ సేవ చేసిన వారందరూ స్త్రీ పురుష భేదం లేకుండా అమ్మకు ప్రతిరూపంగా కనిపించారు. మాతృవాణికి ప్రతిధ్వనులై వినిపించారు. ఇంతాచేసి మానవప్రయత్నమంటూ లేదు. ప్రయత్నం వెనుకు ప్రేరణ ఉన్నది. ‘ఆ ప్రేరణ ‘నేనే’ అని చెప్పిన అమ్మ అదృశ్య రూపాన దర్శనమిచ్చినట్లయింది.
అమ్మ పంచిన ప్రేమ, పెంచిన మానవత, సవరించిన మానవ ప్రవర్తన, వివరించిన జీవన విలువలు మబ్బులు చీల్చుకుని మణిదీపాలై ప్రకాశించాయి. అనుకోని అతిథి అమ్మ దర్శనానుభూతితో సంతృప్తిపడిందో, బిడ్డల సేవానిరతికి నిశాళులిచ్చిందో వచ్చిన దారినే వెనుదిరిగింది.