మా తండ్రిగారు కీ.శే. రాజుపాలెపు రామచంద్రరావుగారు మాతృశ్రీ మహోదధిలో తరంగాలలో ‘అమ్మ’ భక్తులకిచ్చిన అనుభవాలు’ నాడు’గా తాము, తమ మిత్రులు పొందిన, చూచిన ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నవి ‘నేడు’గా కొన్ని సేకరించి వ్రాసి వుంచారు.. ఈ మధ్య జిల్ళేళ్ళమూడిలో జరిగిన సమావేశంలో శ్రీ ధర్మసూరిగారు మాట్లాడుతూ ఎంత చిన్న విషయమైనా అమ్మకు సంబంధించినదైతే వెలుగులోకి రావాలి అన్నమాట స్ఫూర్తిగా చీరాల డాక్టరుగారుగా ప్రసిద్ధి కెక్కిన శ్రీ పొట్లూరి సుబ్బారావుగారి గురించి వ్రాసి వుంచుకున్న విషయాలలో కొన్నిటిని (11.09.1957) ఈ వ్యాసంలో సమర్పిస్తున్నాను శేషు)
అమ్మ ఫోటోలు మొదట్లో చాలా కొద్దిగా మాత్రమే, బాపట్లలో మాత్రమే లభ్యమయ్యేవి. మొదట్లో 8 అణాలుగా, క్రమేపీ ఒకటిన్నర రూపాయాలుగా ధర పెంచారు. వాటిని తయారీకి కేవలం నాలుగు అణాలు మాత్రమే. చీరాల డాక్టరు గారికి ఫొటోగ్రఫీలో ప్రవేశము, తామే స్వయంగా కెమేరాలు నిర్మించగలిన సామర్థ్యము గూడ ఉండటం చేత తామే అమ్మ ఫోటోలు తీయాలనే సంకల్పంతో అమ్మతో ప్రస్తావించారు. అమ్మ అందుకు సమాధానంగా తన చిన్నతనంలో తిరుచానూరులో ఫైల్మాన్ ఒకరు తాము కృష్ణ భక్తులైనందున తనకు (అమ్మకు) నెమలిగించమమర్చి ఫోటో తీసికొనిరనియు తరువాత 1947లో మంతెనరాజుగారు వచ్చినప్పుడు గ్రామస్థులందరు కలిసి తీయించుకొనిన పిదప తాను, నాన్నగారు రవి, హైమ, సుబ్బారావులతో మరియొకటియు తీయించికొనినట్లును చెప్పిరి. “ఇంతకు ఎన్ని ఫోటోలు తీసినను అన్నిటిలో ఒకటిగానే యుంటే ఏమి విశేషము” అనిరి.
తర్వాత వారములో డాక్టరుగారు ఒక కెమేరా, ‘120’ రీలు ఒకటి తెచ్చి ఒక సాయంత్రము 8 (ఎనిమిది) ఫోటోలు తీసిరి. దీనిని ‘డెవలప్’ చేసి చూడగా ఎనిమిది ఫోటోలు ఎనిమిది రూపులుగా వివిధ వయోపరిమితి భేదములతో అగుపించగా ఆశ్చర్యము పొందితిమి. వలె 40 సం॥ వలె వయోభేదమగుపించిన తరి ఇట్టిది అమ్మ కొక్కరికి మాత్రమే సాధ్యమునుకొంటిమి.
మరియొకసారి అమ్మ ఫోటో నెగెటివ్ నుంచి పెద్దది చేయదలచి అప్పటికి డాక్టరుగారి వద్ద ఎన్లార్జర్ లేనందున చీరాలలో నాగేంద్ర స్టూడియోకు వెళ్ళి ఫోటో పెద్దది చేయ నుద్దేశించినప్పుడు ఫోటోగ్రఫీ సూత్రములకు విరుద్ధముగా బొమ్మకు దగ్గరగా అద్దము జరిపినపుడు ఇమేజ్ తగ్గుటయు, ఎడముగా జరిపినపుడు తగ్గుటకు బదులు పెరుగుట గమనించితిరి. ఆ ఫోటోగ్రాఫరు కూడా ఆశ్చర్యపడి అమ్మ ఫోటో తప్ప ఇతర మేదేని యుంచినప్పుడు సరిగా నడుచుచు అమ్మ ఫోటో పెట్టినప్పుడే తద్వ్యతిరిక్తముగా జరుగుట చూచి విస్తుపోయిరి. అప్పుడు మేము, “నీకిప్పుడు ఇష్టములేదు కాబోలు. అవసరమైనప్పుడే చేయించికొనుము” అనుకొని, వక్కపొడి వేసుకొని, నిద్రించి, నాలుగు గంటలైన తరువాత చూడగా యధాప్రకారము జరిగి పెద్ద ఫోటో చేయ తటస్థించెను. (నేనునుగలను) అటుపిమ్మట కూడా మేమెపుడేని ఆ స్టూడియోకి వెళ్ళిన వారు . “అమ్మ ఫోటో యేనా” అని కలవరపడెడి వారు.
ఒకసారి బెండపూడి యోగానందము పుట్టపర్తి వెళ్ళి వచ్చినప్పుడు నీవద్ద కెమేరా యున్నది గదా! ఫోటోనైనా ఎందుకు తీయలేదు? అని మేమడిగినప్పుడు వారి అనుమతి లేకుండా తీయరాదుట అనిరి. అందులకు మేము ఎంతదూరము నుండియైన ఎవరికి తెలియకుండా ఎందులకు తీయలేదు. అనుకొంటిమి. ఆపైవారము మేము వెళ్ళుసరికి, ఆ సాయంత్రమే అందరిని డ్రైన్ గట్టునకు అమ్మ తీసికొనిపోయిరి. అక్కడ కొందరు యాదవులు మేకలు, గొర్రెల మందలు మేపుచుండగా అమ్మ తాను మందలోనికి వెళ్ళి, మేకపిల్లనెత్తుకొని ఒకసారి, నాన్నగారితో మరియొకసారి ఇట్లు అనేక విధములుగా పూర్తి రీలు తీయించిరి దానిని తీసుకొని పోయి డెవలప్ చేయగా సహజముగా వెలుతురు పడిన నల్లగా మారు ఫిలిమ్ నల్లబడక, రోజారంగులో నుండినది నేటికీ డాక్టరుగారి వద్ద కలదు గదా. ఒక వేళ ఫిలిమ్ బొమ్మ మీద బొమ్మ పడినదనుకొనుటకు వీలులేని లాక్సిస్టమ్ గలది ఒక వేళ ఫిలిమ్ ఊడిపోయిన దనుకొన్నను అది నల్లగా మారవలె గదా!
వీరి కుమారుడు, 8 సం॥ల వాడు, వీరు ఇంట లేనపుడు బావి వద్దకు వెళ్లి చూచుచు జారి బావిలో పడెను. ఆ బావిలోతు 2 నిలువులకు పైన (12 అడుగులకు పైన) ఉండెను. కాని, వాడు మునిగి, పైకి వచ్చి, ఏదో చెక్కపలక తన కాళ్లక్రింద ఉన్నట్లు, నడుము లోతు నీళ్లయందే నిలచి అందరికి వినపడునట్లు అరువగా అందరు చేరి వారిని పైకి తెచ్చిరి. (అనంతరము మరి
2 సం॥లకు మరియొక వ్యాధి నెపమున అతడు గతించెను) ఇట్టి పని అమ్మ వల్లగాక మరియొకరికి సాధ్యమగునా?
ఒకసారి పూరీలు చేయించదలచి వీరి ఇంట నేతి నుండి తీసి దొంతరలు పెట్టుచున్నపుడు వీరికి తెలియకనే దొంతరలలోని పూరీలు తగ్గుచుండుట గమనించి, ఇవి అమ్మయే స్వీకరించి యుందురనుకొనిరట. మరి యొకసారి పునుగులు నూనెలోనే వేయుతరి అవి అడుగునకు పోవు విధముగా పోవుచు అంతర్థానమొందెనట. అట్లు పలు పర్యాయములు జరిగిన పిదప, తమకు అవసరమయినవి లభ్యపడెనట నూనెలో వేసినవి ఎక్కువకాగిన మాడునుగాని, అదృశ్యమగుట కేమనుకొందుము?
ఒకరోజు వీరు జిల్లేళ్ళమూడిలో ఉండి నిద్రించుచుండగా, చీరాలలో తమ ఇంటికిదొంగలు వచ్చినట్లు కలగని వారిని తను తరుముచున్నట్లు, స్వప్నము గాంచిరి. వారు తిరిగి ఇంటికి చేరిన పిదప ఆనాడు నిజముగా వారి ఇంటికి దొంగలు వచ్చారని, ఎవరో తరిమినట్లు వారు పారిపోయిరనియు ఇంటిలోని వారు, ఇరుగుపొరుగులు చెప్పిరి.
మరియొకసారి వీరు జిల్లేళ్ళమూడిలో నుండగా, నిజముగనే చోరులు వచ్చి, బండితో సహా వచ్చి, వీరి ఇంటి ముందు గల పాతర తీసి బస్తాలకెత్తుకొని బండి మీద తోలుకొని పోయిరి. ఈ సంగతి మరునాటి ఉదయము మువ్వల సత్యం సోదరుడు వెంకటసుబ్బారావు స్వయముగా వచ్చి చెప్పినప్పుడు అమ్మ సుబ్బారావుగారికి పోలీసు రిపోర్టిమ్మని సలహానిచ్చిరి. కానీ డాక్టరుగారు వూరకుండి జరగ వలసినది జరిగినది. గింజల నెత్తుకపోయిరి. నేనిపుడు వెళ్ళి చేయునదేమి అని స్వస్థత చెందియుండిరి. నాన్నగారు గూడ రిపోర్టునిమ్మనిరి. కాదనలేక వెళ్ళి స్టేషనులో విచారణ అంతయు ఒక గంటలో తేలవలెను నాకితరమైన అర్జంటు పనులున్నవని చెప్పిరి. ఇది అంతయు రిపోర్టు ఇచ్చుటకిష్టము లేక చేసినది. |అమ్మా! పోగొట్టుకొనిన వాడు తన బిడ్డడైన, ఎత్తుకపోయినవారు సైతము తన బిడ్డలు గారా! అనిరి. తరువాత వీరు తన షాపులో నుండగా కారంచేడు కాపురస్థులొకరు వచ్చి తాను ధాన్యమమ్మదలచితిననియు అప్పటి ధరల కంటే తక్కువకే ఇచ్చెదననియు చెప్పిరట. అందులకాయన తన వద్ద అంతడబ్బు లేదనిరి. వారు ఫర్వాలేదు మీకు వచ్చినపుడే ఇత్తురుగాని ధాన్యము తోలుదుమనిరి. వీరు వద్దనిరి. మువ్వల సుబ్బారావుగారు తీసుకొండి, డబ్బు మేము సర్దుబాటు చేయుదుము. వెంటనే ఎక్కువధర కమ్ముకొనవచ్చునని సలహా నిచ్చిరి. ఈ వ్యాపారము మనకెందుకని ఇష్టపడకుండిరి. ఇంతలో రెండు పక్షవాతపు కేసులు వెంట, వెంటనే వచ్చి చెరి రూ.300 ఇచ్చి వెళ్ళిరి. ఒక రూ.300తోనే తాను పోగొట్టుకొనిన ధాన్యమునకు ఇబ్బడిగా (రెండు రెట్లుగా) కొని ఇంటి ముందు పాతర పోయించుకొనిరి.
ఒకనాడు ‘కలలో జరుగునవన్నియు ఇలలో జరుగునా అను ప్రశ్న వచ్చినది. తరువాత రోజు రాత్రి తాను లారీలో అమ్మ దగ్గరకు వెళ్ళుచున్నట్లు, లారీ బోల్తా పడినట్లు తనకు ఒక పార్శ్వమంతయు బాగా దెబ్బతగిలినట్లు కలగనిరట. మరుదినము లేచి తన కొట్టు వద్దకు వచ్చినపుడు ఒక ప్రక్క అంతయు వాచి ఒక కన్నుగూడ పూడుకొని యుండుట మేమున్నూ చూచితిమి.
మరియొకసారి ‘ప్రారబ్ధ స్వీకారము చేయ వీలగునా?’ అను చర్చ వచ్చినపుడు ఎచట నుండియో అక్కడ (జిల్లేళ్లమూడిలో) ఉండు పెద్ద నల్లకుక్క వచ్చి అందరితో సమముగా జలుబుచేతనేమో దగ్గుచు, ముక్కు వెంట నీరు కారుచు కూరుచుండెను. కొద్దిసేపటిలో అది స్వస్థత చెంది ఈ సుబ్బారావుగారికి ఎక్కడలేని జలుబు చేసి దగ్గు చుండిరి. మరల అదే విధముగా కుక్కకు జలుబు చేయుట, వీరు స్వస్థులగుట Practical జరిగినది. ఇంకొకసారి తాను ఆరోగ్యముగా ఉంటిననియు, తనకు సహజముగా జ్వరము రాదు అనిరి. అట్లనిన అరగంటలో అమ్మ “జ్వరము వస్తుందేమో నాన్నా, చాప పరచుకొని పడుకో’ అనగా వారట్లే చేయుట, వెంటనే విపరీతముగా జ్వరము వచ్చుట జరిగెను.
మరియొకసారి ఎవరినో, ముఖమున కణితెలు కల వానిని చూచి నవ్వగా, వెంటనే వీరికినీ ముఖమంతయు swellings ప్రారంభమై వికృతముగా మారుట, కొంత సేపయిన తరువాత యధాస్థితి పొందుట తటస్థించినది.
డాక్టరుగారు, మేము చీరాలలో ఉండి మాట్లాడుకొనినవి మేమచటకి వెళ్ళినపుడు అమ్మ యథాతథముగా చెప్పుట ఇంతకు ముందు చెప్పబడినది.
(ఈ అనుభవాలు కేవలం మహిమా ప్రదర్శనలు కావు. వీటికి గల ప్రయోజనం సువ్యక్తం. అమ్మ భౌతిక సూత్రాలకు అతీతం అని కొన్ని, భూతభవిష్యత్ వర్తమానాలు ఆమెకు కరతలామలకం అని కొన్ని, ప్రారబ్ధం ఇచ్చేదీ – తీసివేసేదీ అమ్మేనని కొన్ని, మనిషిలో మంచి మార్పు – శిక్షణ – రక్షణ రెంటికీ కర్త అమ్మ అనీ సుదృఢమైన విశ్వాసం మనలో పాదుకొల్పడానికే ఈ లీలలనీ ‘అనుభవసారం’ – శేషు)