కాకినాడ నుండి శ్రీ బులుసు వారు నా వ్యాసంపై వ్రాసిన సమీక్ష నాకు ఆనందదాయకమైనది గాను మరియు విజ్ఞానదాయకమైనదిగా భావంచి వినయంగా స్వీకరిస్తున్నాను. వారి ద్వారా అమ్మ నాకు క్రొత్త విషయముల మీదికి దృష్టిసారింపచేసింది. అమ్మ అనుగ్రహాన్ని అర్థం చేసుకొని ఆ స్థితికి ఎదగటానికి నా వంతుకృషి ప్రారంభిస్తాను.
జిల్లెళ్ళమూడిలో జరిగిన శ్రీ కట్టమూరి వారబ్బాయి ఉపనయనానికి హాజరయ్యాను. ముందురోజు రాత్రికే అందరం జిల్లెళ్ళమూడి చేరాము. భోజనాలు పూర్తయ్యాయి. నా జీవితంలో మొదటిసారిగ అమ్మ సన్నిధిలో అమ్మ సూక్తులు నెమరువేసుకుంటు నిద్రించాను ప్రశాంతంగా నిద్రిస్తున్న నాకు అమ్మ కలలో కనిపించింది. భౌతికంగా అమ్మ రూపం నా స్మృతిపధంలో స్థిరంగా లేని నేను కలలో అమ్మతో సంభాషించాను. “అమ్మా ఇక్కడ అందరు ఆర్తిగా నీ దర్శనం కోసం అలమటిస్తుంటే భౌతికంగా వీరందరిని వదలి నీ వెందుకు, ఎలా వెళ్ళిపోయానమ్మా” అని ప్రశ్నించాను. అమ్మ నా వంక ప్రేమగా చూస్తూ ప్రశాంతంగా నవ్వింది. ఆ నవ్వులో నాకు ఎన్నో అర్థాలు గోచరించాయి. కానీ ఇది మిత్థంగ అమ్మ నాకిచ్చిన సందేశం అందుకోలేక పోయానని పించింది. ఉపనయన కార్యక్రమం అమ్మ ఆశీర్వచనంతో పూర్తయింది. ఆ రోజు సాయంత్రం అమ్మ సన్నిధిలో చిన్న సత్సంగం ఏర్పాటు చేశారు శ్రీ కట్టమూరి. అనుకోకుండ నన్ను ప్రసంగించమన్నారు. రాత్రి కలలో అమ్మనాకు ప్రసాదించిన సాన్నిధ్యం ఆనందంగా అక్కడ ఉన్న వారితో పంచుకున్నాను. అనుభవజ్ఞుడైన ఒకవక్త అమ్మ నవ్వులో అర్థాల్ని వివరించే ప్రయత్నం చేశారు. ఆ సత్సంగంలో ఉన్న నా బంధువు ఒకామె “బావగారికి అమ్మ దర్శనం ఇచ్చిందట” అని నాకు వినిపించేలా వ్యంగ్యోక్తి విసిరింది. నిజమే నాకు కలలో అమ్మ దర్శనం “నా అనుభవ పుంత” పూర్తిగా నా వ్యక్తిగతం. కానీ ఏ “ప్రామాణికత”ను చూపించి కలలో అమ్మ తన సాన్నిధ్యాన్ని ప్రసాదించిందని ఇతరులను ఎలా నమ్మించగలను” మౌనేన కలహం నాస్తి” అన్నారు కదా. నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను.
అమ్మ దర్శనం కోసం ఒకసారి జిల్లెళ్ళమూడి వెళ్ళాను. ఫలహారాలు పూర్తి చేసుకొని అనసూయేశ్వరాలయానికి బయలుదేరాము. దోవలో శ్రీ కట్టమూరి, లెక్చరర్ ఝాన్సీగారింటికి తీసుకొని వెళ్ళి వారిని పరిచయం చేసాడు. అమ్మ విషయాలు, అమ్మ ప్రేమానురాగాలు శ్రీ ఝాన్సీగారు చాలా చెప్పారు. మధ్యలోనూ సంభాషణ యోగ మెడిటేషన్ల మీదకి మళ్ళింది. మెడిటేషన్లో మనస్సుని ఏకాగ్రత వైపు మళ్ళించినట్లయితే మనస్సు అంతర్ముఖం కాగానే మనకి క్రొత్త వెలుగు దర్శనం ఇస్తుంది. దాని నుండి మనం మానసిక ప్రశాంతతని సాధించవచ్చని చెప్పి, నన్ను, శ్రీ కట్టమూరిని, ఇంకొక వ్యక్తిని స్థిరమైన సుఖాసనంలో కూర్చుండబెట్టి, యోగసాధన చేయించారు. ఆవిడ చెప్పిన విషయాలన్నీ శ్రద్ధగా విని క్రొత్త విషయాలపై జిజ్ఞాస ఉన్న నేను వారు చెప్పినట్లు చేస్తు TRANS లోకి వెళ్ళిపోయాను. ఆ స్థితిలో ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు. ఆ స్థితిలో నాకు కన్పించిన దృశ్యం ఇప్పటికీ నా మనస్సులో స్థిరనివాసం చేసుకున్నది. కొంతమంది మహర్షులు రెండు వరుసలుగా కూర్చుని యున్నారు. అమ్మ వారందరికి ఏదో తెల్లని పొంగలి లాంటి పదార్థాన్ని ఒక పెద్ద పళ్ళెం చేత్తో పట్టుకొని వడ్డిస్తున్నది. అమ్మ చాలా లావుగా, అందంగా ఉన్నది. ముక్కుకి బులాకి ఉన్నది. మంచి పట్టుచీర కట్టుకొన్నది. ఆ దర్శనం నా మనస్సుకి ఎంతో ఆనందాన్ని పంచింది. ఇంతలో శర్మగారూ అంటు నన్ను పిలుస్తున్న మాటలు వినబడ్డాయి. కానీ ఆ TRANS నుండి నేను బయటకు రాలేకపోతున్నాను. గట్టిగా ప్రయత్నం చేస్తున్నాను. నా వల్ల కావటం లేదు. అకస్మాత్తుగా ఆ ట్రాన్సు నుండి బయటకు వచ్చాను. శ్రీ ఝాన్సీగారు ఏవో మంత్రాలు ఉచ్చరిస్తూ నా ముఖం మీద నీళ్ళు చల్లారుట. నేను బాహ్య ప్రపంచంలోకి వచ్చాను. అప్పట్లో శ్రీ కట్టమూరి నా స్థితిని ఏదో గొప్పతనంగా పొగిడారు. సత్వ తమో గుణాలు ప్రభావం (Impact) మనిషి సహజ గుణముల యందు జరిగే మార్పులని భావించి అప్పటికి రజోగుణ ప్రభావమని తలచి మనస్సుని అదుపులో ఉంచుకున్నాను. కానీ మనస్సు కోతి గదా ! అనుభవాల్ని, అమ్మ దర్శనాలని మరొకరితో పంచుకోవాలని మనస్సు ఆరాటపడింది. ఝాన్సీగారి ద్వారా నాకు ప్రసాదించబడ్డ “అమ్మ సాన్నిధ్యం” తిరిగి ‘ప్రమాణికత అనే విషయంపై చర్చించబడుతుందని భయపడి ‘నా అనుభవాలు పుంతని” గుడ్డ కట్టి దాచాను.
నేను ప్రాతఃస్మరణీయుడిగా భావించి గౌరవించే వ్యక్తి శ్రీ ఓగిరాల రామచంద్రరావుగారు వారి కుమారుడు కారు ప్రమాదంలో మరణించారు. సుఖానికి పొంగిపోకుండా దుఃఖానికి క్రుంగిపోకుండా సమత్వం ప్రదర్శించగల వానిని కొద్ది కాలం తర్వాత కలిశాను. పరమాత్మ అర్థాంతరంగా మనం ప్రేమిస్తున్న వారిని ఒక మాయగా మననుండి దూరంగా ఎందుకు తీసుకెళ్తాడని వారి నడిగాను. దానికి వారు భూలోకంలో పరమాత్మ కార్యక్రమాలన్ని సక్రమంగా నిర్వర్తించబడాలంటే “HIGHER – PLANES”లో కొంతమంది వ్యక్తులు అనగా ఆధ్యాత్మికంగా బలం కలిగిన వారు వారికి సహకరించే సత్సంగం అవసరమవుతుంది. అంతకన్నా “HIGHER – PLANES” వున్నవారు అక్కడి నుండి “SHIFT” అయితే ఆ వెలితిని పూరించటానికి భూలోకం నుండి ఆధ్యాత్మిక పరంగా నిష్ణాతులై దైవత్వం కలిగి ఉన్నవారిని ఎంపిక చేసి పరమాత్మ Higher – Plane కి తరలిస్తాడు అలా వెళ్ళిన వారే ముమ్మడివరం బాలయోగి.
అటువంటి మహనీయులకి సహకరించటానికే నా కుమారుని పరమాత్మ భూలోకం నుండి తరలించాడని నా నమ్మకం” అన్నారు. వారు చెప్పిన సమాధానంలో నాలోని ఎన్నో ప్రశ్నలకి జవాబు దొరికినట్లయింది. ఇటువంటి అనుభవాల పుంతకి ‘ప్రామాణికత’ అనే ప్రశ్న అమ్మ దర్శనాలని ప్రభావితం చేయజాలదనే నమ్మిక నాకు కలిగింది. అమ్మని అంతర్ముఖంగా చూడగలగటం నా అదృష్టం. అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ కదా ! అమ్మ దర్శనం అమితానందం.
తప్పులు, అప్పులు అందరికీ ఉంటాయి.