- మొదటి కుసుమం:
శ్రీమాత బిల్డింగు కట్టేటప్పుడు నేనే దగ్గరుండి స్లాబు వేయించాను. పని జరుగుతున్నప్పుడు రాత్రిపూట అరటిపళ్ళ గెలలు, మజ్జిగ మొదలగు వాటిని అమ్మ పనివాళ్ల కోసం పంపుతుండేది. ఒకనాడు తెల్లవారుఝామున 4 గంటలైంది పనిపూర్తయ్యేసరికి. నేను మామూలుగా అందరిల్లు డాబా ‘మీద దుప్పటి పర్చుకుని పడుకో బోతుండగా, సుప్రభాతానికని జేగంట కొట్టారు. అప్పుడు నేను, అమ్మ డాబా మీద సాధారణంగా సాయంకాలం మంచమీద పడుకునే వైపు వెళ్ళి పడుకున్నాను. అప్పట్లో, యిప్పుడున్న ధ్యానమందిరం లేదు. మర్నాడు దర్శనానికి వెళ్లినపుడు అమ్మ అన్నది కదా – “నాన్నా! నిన్నరాత్రి లేటుగా నువ్వు వచ్చి, దుప్పటి పరుస్తుంటే జేగంట కొట్టారు కదూ ? అప్పుడు నువ్వు వెనుక వైపు వచ్చి పడుకున్నట్టుంది అవునా?” అని అన్నది. నాకాశ్చర్యం, ఆనందంరెండూ కలిగాయి. ఇవన్నీ అమ్మ కెలా తెలిసాయా అని అప్పట్లో అన్పించింది.
- రెండవ కుసుమం:
ఓసారి అమ్మ పాదాలకు పూజ చేసుకుంటూ, అంబాష్టకం చదువుకుంటున్నాను. ఆ అష్టకంలోని 7వ శ్లోకం “అంబాశాశ్వత ఆగమాదివినుతా ఆర్యామహాదేవతా, యాబ్రహ్మాది పిపీలికాంతజననీ యావై జగన్మోహినీ” అని చదువుకుంటుండగా, అమ్మ అన్నది కదా! “నాన్నా! యాబ్రహ్మాది పిపీలకాంతజననీ కాదు నాన్నా! యా బ్రహ్మాది పిపీలకాది జననీ అని వుండాలి” అని. అంటే మనం చదువుతున్నదంతా తనేనని, మనకు తెలియజేసిన తల్లికి శతసహస్రకోటి వందనాలు. మన ఆలోచనలు మనవికావని, మన ఆలోచనలే అమ్మని మరోసారి స్థిరపరచుకున్నాను.
- మూడవ కుసుమం:
ఓ రోజు ఉదయం అమ్మ సమక్షంలో కొంతమందిమి కూర్చున్నాం. అంతలో వంటగది నించి రామకృష్ణ అన్న వంటాయన వచ్చారు. అమ్మ అతనితో ఫలహారం తెమ్మని చెప్పింది. ఆయన వెళ్ళి ఒక చిన్న స్టీలు బౌలులో 8 వరకు ఇడ్లీలు, ఇంకో గిన్నెలో చట్నీ తెచ్చారు. అమ్మ ఇడ్లీలను ముక్కలుగా చేసి, పక్కనున్న చట్నీలో ముంచి ఒక్కొక్కరి నోళ్ళలో పెరుతోంది. నా నోట్లో పెరుతూ నావైపు చూసి, “పచ్చట్లో ఉప్పు ఎక్కువైంది కదు నాన్నా!” అంది. “నువ్వు తినలేదు కదా! నీకెలా తెలిసిందమ్మా” అన్నాను. దానికి అమ్మ నవ్వుతూ “నా చేతిక్కూడా నాలికుంది నాన్నా!” అని చిన్నగా నవ్వింది. అంతేకాదు, మేం అక్కడుండగానే ఇంకో అరడజను మంది భక్తులొచ్చారు. వాళ్లకీ అందులోంచే ఫలహారాన్ని పెట్టింది. నా కాశ్చర్యం వేసింది. ఇంతమందికి ఆ కాస్త ఇడ్లీలు ఎలా సరిపోయాయా అని!
- నాల్గవ కుసుమం:
1983లో అమ్మకు ఆరోగ్యం ఏమీ బాగులేనప్పుడు ట్రీట్మెంట్ కోసం హైదరాబాదు తీసికొని వెళ్ళారు. అప్పుడు మా వైజాగు నించి కేశవశర్మ, చక్రవర్తి, ఎ.వి. నరసింహా రావుగారు, నేను కలిసి వెళ్లాము. అమ్మ అంగీవేసుకుని నీరసంగా కూర్చుని వుంది. అమ్మ ఎదురుగా అందరం కూర్చున్నాం. ఏమీ మాటల్లేవు. ఇంతలో అమ్మ “స్వభావమధుర” అన్నది. చక్కని నామం నాన్నా! అని అంది. అమ్మ అలా ఎందుకందో నా కర్థం కాలేదు ఇంతలో కేశవశర్మగారన్నారు. “అవునమ్మా! సరిగ్గా నేను “స్వస్థా స్వభావమధురా అన్న నామం దగ్గరే వున్నావని అన్నారు. అందుకు అమ్మ “నాకు తెలుసునాన్నా! అందుకే అన్నా” నంది. అప్పుడనిపించింది. మనం చేసే స్తోత్రమూ, చేసినపూజా, పలికేమాటా, చేసేపనీ అన్నీ అమ్మకు తెలుసునని. అందుకే అమ్మ అంది. “ఎవరేమనుకున్నా, ఏం మాట్లాడినా, ఏం చేసినా, నేననుకుంటేనే – మీరంతా నేనే – మీదంతా నేనే – ఇదంతా నేనేనని! “నన్ను చూడటమే పుణ్యం” అని అమ్మ అన్నమాటలు అక్షరసత్యాలు. మన పూర్వజన్మ సుకృతాలు !