మాతృశ్రీ జిల్లెళ్ళమూడి అమ్మ ఆరు దశాబ్దాల క్రితం ప్రారంభించిన అన్నపూర్ణాలయం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ ఎనిమిది వందల మందికి అన్న వితరణ జరుగుతోంది. ప్రత్యేక సందర్భాల్లో. వేలాదిమంది అన్నాన్ని ప్రసాదంగా భావించి స్వీకరిస్తూ ఉంటారు. ఈ పవిత్ర కార్యక్రమం అమ్మ సంకల్పించిన మాతృయాగం.
కర్షకులు పండించుకున్న తమ వరి పంటలో – తమ తమ వంతుగా కొత్త వరిధాన్యంతో అమ్మ చిత్ర పటాన్ని అభిషేకిస్తారు. ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి, అన్నాభిషేకం చేసి, సంవత్సర కాలమంతా అన్న వితరణ చేస్తారు. గుంటూరు జిల్లాలోని జిల్లెళ్ళమూడిలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 17న జరిగే ఈ కార్యక్రమం వంటిది మరెక్కడా లేదు.
అమ్మ చేసిన ఈ సంకల్పం వెనుక మహా ఔదార్యత, సహజ వాత్సల్యం కలబోసుకున్న అమ్మతత్వం ఉన్నాయి. వీటి మూలాలన్నీ సనాతన ధర్మంలోనే ఇమిడి ఉన్నాయి. జాతి, మత, వర్గ, వర్ణాలను సమన్వయం చేసి సమాజాన్ని సమతావాద స్వరూపంగా భావించమంటున్న అమ్మ బోధ పవిత్ర ఆచరణగా మారి కొనసాగుతూనే ఉంది.
“అమ్మా ! నీ యాభయ్యవ పుట్టినరోజు! ఏం చెయ్యమంటావ్?” అని అడిగినప్పుడు, “చేయటానికేముంటుంది? ఒక లక్షమంది కలిసి భోజనం చేయడం చూడాలని ఉంది!” అన్నది. పట్టుమని పదిళ్ళు లేని జిల్లెళ్ళమూడిలో, పందిళ్ళలో ఒక లక్షా అరవైవేల మంది భోజనం చేయడం మహిమా? అనుగ్రహమా? అమ్మ ప్రేమా?
యుగాలు – లక్షణాలు
కృత యుగం అస్థిగతం, త్రేతా యుగం మాంసగతం, ద్వాపర యుగం రక్తగతం, కలియుగం అన్నగతం. ఇదంతా యుగ లక్షణం. పరిణామ క్రమాన్ని గమనించినప్పుడు, కలియుగమే పుణ్యకాలంగా కనిపిస్తుంది.
ఉన్నదంతా పరమాత్మేనన్న భావంతో కృతయుగ మానవుడు, తాను ఉన్నంత కాలం తన మూలంతో తనను తాను అనుసంధానం చేసుకొని తపస్సు, ధ్యానం, యోగం వంటి స్వీయ సాధనా బలిమితో పూర్ణాయుర్దాయంతో జీవించాడు. త్రేతాయుగంలో సాధకుడు యజ్ఞ యాగాదుల ద్వారా పరమాత్మను చేరుకోగల సాధనా మార్గాన్ని ఆశ్రయించాడు. మాంసగతమైన ఆహారాన్ని ఆలంబన చేసుకున్నాడు ద్వాపరలో భీమ ప్రతిజ్ఞ వంటి సందర్భాలు రక్తగత విషయాన్ని స్పష్టం చేస్తుంటాయి.
కలియుగంలోనూ పై విధానాలున్నా, నాగరికతా అన్నగతుడయ్యాడు. ఈ నేపథ్యంలో అమ్మ నోటి నుండి వెలువడే మొదటి మాట ‘భోజనం చేసి రా!’ డొక్క నిండనివాడు వేదాంతం వినడు. నైతిక సిద్ధాంతాలు వాడికి అవసరం లేదు. ఆకలి తీర్చుకోవడం. ప్రాణం నిలబెట్టుకోవడం ప్రధానం. ఆ పైనే మిగిలినవన్నీ !
దైహిక, ప్రాణ శక్తుల సమన్వయం !
మానవుడికి ఉన్నవి పంచకోశాలు. అవి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు దేహం నిలబడాలంటే అన్నం కావాలి. ఆ మెతుకులు దయతో, ప్రేమతో, కరుణతో, అన్నిటికీ మించి వాత్సల్యంతో దొరికితే పదార్థ శుద్ధి కలిగి, పరమార్థ చింతన వైపు నడిపిస్తాయి. ఏ భావంతో అన్నం తయారైతే ఆ భావమే ఊపిరి పోసుకుంటుంది. దైహిక, ప్రాణ శక్తులు సమన్వయంగా ఏర్పడేవే అన్నమయ, ప్రాణమయ కోశాలు.
నడిచే దేహం, అది నడవడానికి కావలసిన శక్తి కూడినపుడు, అంటే యుక్తాహారం, యుక్త విహారం జమిలి అయినపుడు మరొక ప్రశాంత, పరితృప్త, ప్రసన్న కోశం ఏర్పడుతుంది. అదే మనోమయ లోకం. అనేక ఆలోచనల సమాహారమే మనసు దానికి రూపం లేదు.
కానీ అతి శక్తిమంతమైన భావనాభూమిక అది. దాని పునాది, మూలం అన్నమయ కోశంలోనే ఉంది. మమతా ప్రసాదంగా లభించిన అన్నం నుండి మమతే మనసుగా రూపుదాల్చి, మనోహర పరిమళాన్ని ఆలదుకొని మనసు దయాపూరిత మవుతుంది. అది తీర్చుకొనే ఆలోచనలన్నీ సంస్కార శోభితంగా, ప్రేమమయంగా ఉంటాయి. బలమైన మనసు నుండి, కరుణాకరమైన మనసు నుండి అటువంటి ఆలోచనలే కలిగి, సాధకుణ్ణి సాధువును చేస్తాయి. సమాజంలో సహజీవనం, మానవీయమైన తలపులు, సహనం, శాంతి, నిబ్బరం సాధించుకున్న మనసే బద్ధత్వం నుండి బుద్ధత్వం వైపు నడిపిస్తుంది. బంధనకూ, మోక్షానికీ మనసే కారణం.
దాన్ని అర్థం చేసుకోవాలి !
కనుక మోక్షగామియైన సాధకుడు ముందుగా అన్నమయ కోశాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందువల్లనే అమ్మ ముందుగా అన్నం పెట్టి, ప్రాణం నిలబెట్టి, మనసును అరికట్టే ప్రయత్నం చేసింది. పైకి ఎంతో తేలికగా కనిపిస్తున్నా, ఆ వాత్సల్యం వెనుక ఒక గంభీరమైన అధ్యాత్మ బోధ ఉంది. కలిగిన వారంతా నలిగిన వారిని ఆదుకోవాలి. ఆకలిగొన్న మానవుడూ, అన్నం దొరకక మరణించే జీవులూ ఉంటే, అది నాగరిక సమాజం కాదు. సంస్కారానికి నోచుకోని జాతి ఎక్కువ కాలం మనలేదు.
ఎట్టి మెతుకో అట్టి భావం, ఎట్టి భావమో అట్టి భాష, ఎట్టి భాషో, అట్టి జాతి! దేహం, ప్రాణం, మనసు ఒక అద్భుతమైన త్రిపుటి. మాధవ సమానుడైన మానవుడు నిరంతరమూ అప్రమత్తుడై ఉండవలసిన స్థితులు. ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తులకూ మూలం ఇవే, సర్వజన శ్రేయస్సు శుభేచ్ఛగా, సమాజహితమైన నిష్కామ కర్మలన్నీ క్రియాశక్తిగా, వివేకము – విచక్షణ జ్ఞాన శక్తిగా అనుభవంలోకి రావాలంటే ‘అన్నం’ మూలం. దేహమున్న, ప్రాణమున్న ప్రతి జీవీ అన్నగతమే. అందుకే అమ్మ మాట్లాడినా, సూచించినా ముందు అన్నం తినమనే!
‘అందరిల్లు’ అందరికీ సహపంక్తిని సిద్ధం చేసింది. ఆకలికి కులం, మతం, భేదం లేవు. అరమరికలు, బంధనలు, వివక్ష లేని వాత్సల్యాలయం ఒక అపురూప విజ్ఞానమయ కోశంగా మారడం వెనుక కారణం ఇదే.
శాస్త్రాల మీద అధికారం, విషయాలమీద పట్టు విశ్లేషణల మీద పూర్ణావగాహన, అనుష్టాన వేదాంతం విజ్ఞానమయ కోశంలో ఇమిడిన బలాలు, ఆ కారణంగానే విజ్ఞానవేత్తలు, మహాకవులు, పండితులు, పావన ముక్తజీవులు, వేదాంత, తత్వబోధకుడు, సంకీర్తనాచార్యులు.. ఒకరేమిటి, పాశ్చాత్యులతో సహా జిల్లెళ్ళమూడికి ఆనాడే చేరడం. విజ్ఞానమయ భూమికగా మారడం! ఇన్ని కలిగిన తరువాత ఉన్నదంతా ఆనందమయమే. పంచకోశ స్థితులను ఉపనిషత్తులు వీక్షిస్తే, వర్ణ, వర్గ భేదం లేకుండా అమ్మ వాటిని అతి సులువుగా ఆవిష్కరించింది.
“నేను పెట్టేదేముంది? ఎవరన్నం వాళ్ళు తింటున్నారు!’ అన్న అమ్మది అకర్తృత్వ స్థితి.
బువ్వ పెట్టిన అవ్వలందరూ అమ్మలు కాదు.
ఆ పెట్టడం ఒక సహజ మాతృ లక్షణం కావాలి.
అది నేర్పడమే మాతృబోధ !
అందువల్లనే ఆమె మాతృశ్రీ !!
(ఆంధ్రజ్యోతి దినపత్రిక సౌజన్యంతో)