- శ్రీ అనసూయయే ప్రజకు శ్రేయము గూర్చెడి కామధేనువై
ఏ అనుమాన మేర్పడక ఎంత దలంచిన నంత చేరువై
ఈ అనుయాయు లందరికి ఈప్సిత సిద్ధిని కల్గజేయుచున్
ఓ అనుచున్ నిరంతరము ఓర్పున శాంతి నొసంగు చుండెడున్.
- వినయము నేర్వగా దగిన విద్యను నేర్పుచు ప్రాచ్య భాషలం
దనయము వత్సలత్వమున అన్నము పెట్టుచు నాదరంబుతో
మనముల యందు నిత్యమును మంచితనమ్మును ప్రోది చేయుచున్
జనహిత కార్య మందుకొను చల్లని తల్లికి నా నమస్కృతుల్.
- అమ్మకు నూరు వత్సరము, లందరికి న్నది ఉత్సవం బహెూ!
సమ్మతితోడ జేయదగు సంబర మౌచును శాంతిదాయియై
అమ్మ ప్రసాదమున్ మిగుల నాదరమొప్పగ పంచిపెట్టుచున్
తమ్ములు అన్నలుం గలసి తన్మయ మందరె అమ్మ సూక్తులన్.
- పూజలు అన్న యాగములు పుష్కలమై కొనసాగుచుండగా
భూజనులందరున్ మిగుల భోగము లందుచు సంతసింపగా
ఆ జన జీవనంబు కడు ఆదర భావము నంది యుండగా
ఢీ జనులై సమత్వమును ధీరత జూపుదు రమ్మబిడ్డలై.
- తక్కిన వేల్పులందు గల తత్త్వము వేరు మహత్వ మమ్మలో
చిక్కగ నుండుటన్ మనసు చేవను పొందుచు పుల్కరించగా..
పక్కకు పోవ జాలకయె పావనమూర్తికి సేవచేయగా
చక్కని బాట నెంచుకొని చాలగ తృప్తిని పొందుటే తగున్.