అన్నం పరబ్రహ్మ స్వరూపము. అన్నం వలననే ప్రాణము రక్షింపబడుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనెడిది ఆర్షవాక్కు ప్రాణాన్ని నిలిపే అన్నదానం వలన అన్నిదానాలు చేసినట్లే. ఈ లోకంలో మనం చేసిన దానాదులే పరలోక జీవనానికి మనుగడ అవుతుంది. చెడుపనులు చేసినా మంచి ఫలితము పొందుతున్నాము అంటే మనం చేసిన గతజన్మలో (మంచి) చేసిన మంచి ఫలితములు అనుభవించే కాలముగా గ్రహించాలి. అందుకే అమ్మ అన్నపూర్ణాలయం స్థాపించింది. ఏ సమయంలో వెళ్ళినా, సరే ముందు అన్నం తినిరండి అని పంపే నాన్నా. ఆ కారుణ్యమూర్తిని మనము దర్శించుకుని, ఆ అనుభూతిని పంచుకున్న మనం ఎంత పుణ్యాత్ములం. ఇలాంటి అనుభూతులలో కొన్ని నాకు గుర్తు ఉన్నవి. చిన్నప్పుడు 1963 నుండి నా 9వ ఏట నుండి అమ్మని దర్శించు కోవటానికి హైద్రాబాద్ నుండి మా నాన్నగారు కీ.శే. దావులూరి హనుమంతరావుగారు మమ్మల్ని ప్రతి ఎండాకాలం సెలవులకి తీసుకెళ్ళేవారు.
అప్పట్లో ఇసుక కుప్పలమీద ఒక దుప్పటి వేసుకొని పడుకునేవాళ్ళం. ఆ ఇసుక ఎంత తెల్లగా, పచ్చగా ఎంత బాగుండేదో. కొంతమంది అక్కయ్యలు గంధం అరగదీస్తూ అమ్మ కాలిపాదాలకు వ్రాస్తూ ఉండేవారు. ఇంకొక అక్కయ్య విసురుతూ ఉండేది. అప్పుడు నా మనసులో నేను కూడా ఒక్కసారి ఆ గంధం తీసుకొని అమ్మ పాదాలకి వ్రాస్తే బాగుండు అక్కయ్యని అడిగితే ఏమంటారో అని నాలో నాకు ఆలోచన, పోనీ విసిరితే ఇలా నా ఆలోచనలు, అమ్మ వంక చూస్తున్నా, నా మనసులోని కోరిక బలమో, ఆ తల్లి అనుగ్రహమో నాకు ఆపాదాలకి గంధం వ్రాసే అదృష్టము కలిగింది కాదు కల్పించింది. విసిన కర్రతో విసిరే భాగ్యం కూడా కల్పించింది. ఒకసారి అమ్మకి సహస్ర ఘటాభిషేకం చేసారు. అప్పుడు అమ్మ పై మేడ మీద ఉండేది. అందులో అన్నయ్యలు, అక్కయ్యలు అందరము పాలుపంచు కున్నాము. కొంతమంది అన్నయ్యలు వేదం చదువుతున్నారు. నేను మా నాన్నగారు, అమ్మ, మా చెల్లెలు మువ్వ శేషుమణి పాలుపంచుకున్నాము. చిత్రం ఏమిటంటే వెయ్యి బిందెలతో అభిషేకం చేసినా, అమ్మ నా శరీరం తడవలేదు నాన్నా అని అన్నది. అప్పుడే అయిపోయిందా అని చేతులు చాపుతూ పరిహసించింది. మరి మా వంతు అయిపోయింది వరుణదేవుడు వంతు వచ్చింది. నేను కూడా ఈ అదృష్టంలో పాలుపంచుకోని అన్నట్లుగా ఆకాశం మేఘావృత్తమై పెద్దవాన వచ్చింది. ఆవర్షంలో అమ్మ నిలబడినప్పుడు అమ్మ చూపుల్లో కనిపించిన ఆ సంతోషం. చిన్నపిల్లలు వానవస్తే వెళ్ళి తడవాలని ఎలా కేరింతలు కొడతారో అలా ఆ సమయంలో అమ్మ కళ్ళల్లో ఆనందము ఇప్పటికీ నేను మరువలేదు. ఎప్పటికి మరువలేని అనుభూతి. అలాంటి అనుభూతులు అమ్మతో చవిచూసిన మనందరికి మనస్సుల్లో సదా నిలిచిపోవాలని. మళ్ళీ అలాంటి అనుభూతులు ఇంకా గుర్తు చేసుకొని మనమంతా పంచు కుందాం.