శ్రీలలితా సహస్రనామావళిలో ‘అన్నదా’ అనే నామం ఉన్నది. అంటే ఆ పరదేవతయే మనకి అన్నం పెడుతోంది, పాలించి, పోషిస్తోంది- అని అర్థం. ‘శరీర మాద్యం ఖలు ధర్మసాధనం’ అన్నారు. శరీరం నిలబడాలంటే ‘ఆహారం కావాలి. ఆహారం అంటే శక్తి యొక్క ప్రత్యక్షరూపం.
వేదములు ‘ఆకలి’ని ‘వైశ్వానరాగ్ని’ అని ప్రబోధించాయి. అట్టి ఆకలి బాధని తీర్చటానికి అమ్మ నిరంతరం తపించింది. అందుకు కొన్ని ఉదాహరణలు.
- 15.8.1958లో అమ్మ అన్నపూర్ణాలయాన్ని స్థాపించింది. 15, ఆగష్టు దేశ స్వాతంత్ర్యదినం. కానీ, అమ్మ “నేడు ప్రపంచానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు” అని ప్రకటించింది. అంటే ప్రపంచంలో ఏ మూలనైన ఆకలితో బాధ, పస్తులు ఉండరాదని సంకల్పించి అందుకు అమ్మ నాందీ ప్రస్తావన చేసింది. తదాది అక్కడ లక్షలాది మంది అన్న ప్రసాదం స్వీకరించి తృప్తి చెందారు. అమ్మ సంకల్ప తరంగాలు తాకి ఎన్నో దేవస్థానములు, ఎన్నో ప్రజాహిత సంస్థలు ‘Right to Food’ అనే నినాదంతో ముందుకు వచ్చాయి, తమ ఆపన్న హస్తాన్ని అందించాయి.
అమ్మ 1985లో శరీరతాగ్యం చేసింది. 1958కి 1985కి ఏదో సంఖ్యా రూప సాదృశ్యమూ కనిపిస్తుంది. అదికాదు. అమ్మ ఒక ఆర్ద్రమైన కోరిక కోరింది. అదేమంటే – అన్నపూర్ణాలయంలో గుండిగెలు వార్చి ఆ అన్నం చల్లార్చేందుకు ఒక పెద్ద Stainless Steel Tray లో పోసి ఆరబెడతారు. తాను శరీరత్యాగం చేసిన తర్వాత తన దేహాన్ని బిడ్డల అంతిమ సందర్శనం నిమిత్తం ఆ steel tray లో ఉంచమన్నది అమ్మ. అమ్మ అంటే అన్నం; అన్నం పరబ్రహ్మ స్వరూపం. 2. 1973లో అమ్మకి 50 వసంతాలు నిండిన సందర్భంగా లక్షమందికి ఒక్క పంక్తిలో భోజనం పెట్టమన్నది. పాలకొల్లు ఆడిటరు శ్రీగోపిగారు, “అమ్మా! అన్నపూర్ణేశ్వరివి నువ్వు కాదా ఇంటింటా అందరికీ అన్నం పెడుతున్నది! నీకీ వింత కోరిక ఏమిటి?” అని అడిగారు. అందుకు అమ్మ, “నాన్నా! నేను పెడుతున్నానని మీరు చూడటం కోసం” అన్నది. ఆ ప్రక్రియలో ఒక రహస్యమూ, పరమార్థమూ ఉన్నాయి. అమ్మ చేతి అన్నం ముద్ద తాత్పర్యం ఏమంటే
- జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం – అన్నట్లు అది అమ్మ పెట్టే జ్ఞాన భిక్ష.
- సద్గురు శ్రీ శివానందమూర్తిగారు ప్రవచించినట్లు అమ్మ మోక్షప్రదాయినియై అన్నం పెడుతోంది. అది అన్నం కాదు; మహాప్రసాదం. ఆ ప్రసాద స్వీకరణతో కైవల్యం తథ్యం. అమ్మ స్వయంగా వేలాది మందికి ఆప్యాయంగా గోరు ముద్దలు తినిపించింది. అది అమ్మకి అత్యంత ప్రీతి పాత్రమైనది; తినటంకాదు, తినిపించటం. అది అమ్మ ఆదరణకి అనురాగానికి ప్రతీక. అంతేకాదు. అమ్మ అనిర్వచనీయ శక్తికి అనుగ్రహానికి ప్రతిరూపం; ఇహపర సౌఖ్యాల ననుగ్రహించే పవిత్ర తీర్థం – అనేది అనేకుల అనుభవం, విశ్వాసం.
- అమ్మ సంతానం మనుషులు మాత్రమే కాదు. ఆబ్రహ్మకీటజనని. బాల్యం నుండి అమ్మ పిల్లులు, కుక్కలు, పాములు, పందులు, ఎలుకలు, బాతులు, చేపలు, పక్షులు మున్నగు సకల ప్రాణికోటితో మమేకమై మసిలేది, ఆదరించేది. అమ్మ స్వర్ణోత్సవాల్లో మిగిలిన అన్న ప్రసాదాన్ని కాలువలు, చెరువులు, పొలాలు అన్ని బహిరంగ ప్రదేశాల్లో వెదజల్లమన్నది. క్రిమికీటకాలూ అమ్మ స్వర్ణోత్సవంలో పాల్గొని, అమ్మ ప్రసాదాన్ని స్వీకరించాయి. పంచభూతాలూ అమ్మ సేవలో పాల్గొని అమ్మ అనుగ్రహాన్ని పొందాయి. ఇంకా ప్రస్ఫుటమైన సందర్భం ఒకటి ఉంది. గ్రామంలోని స్త్రీల నందరినీ అందరింటి ఆడపడుచులచే ఆహ్వానించి వారందరినీ ‘సువాసినీ పూజ’ చందాన సంభావన చేసి, భోజన తాంబూలాదులతో సత్కరింప చేసింది. కాగా, విశేషమేమంటే- గ్రామంలోని పశువుల నన్నింటిని కూడా రప్పించి, వాటికి సంగం డెయిరీ నుంచి రుచికరమైన దాణా తెప్పించి విందుచేసి మహదానందాన్ని కలిగించింది; అవి తృప్తిగా ఆరగిస్తూంటే మురిసి పోయింది.
స్వీయ అనుభవం:-
ఒక ఏడాది దీపావళి పండుగ. ఆవరణంతా రంగురంగుల కాంతులతో ఆహ్లాదకరంగా ఉంది. చీరాల నుంచి కొందరు అమ్మ దర్శనార్థం వచ్చారు. అమ్మ నన్ను పిలిచి వాళ్ళని అన్నపూర్ణాలయానికి తీసికెళ్ళి అన్నం పెట్టి పంపమని చెప్పింది. వారిని సాదరంగా అన్నపూర్ణాలయానికి తీసికెళ్ళాను. అక్కడివారు వారి వారి పనుల్లో నిమగ్నులై ఉన్నారు.
“నేనే వడ్డిస్తాను కూర్చోండి” – అంటూ చాపలు పరిచాను.
“మేము చిరకాలం నుంచి వస్తున్నాము. మాకు అందరూ అన్నీ తెలుసు. మేము భోజనం చేసే వెడతాము. మీరు మీ పని చూసుకోండి” అన్నారు వారు. అప్పటికింకా అన్నపూర్ణాలయం గంట కొట్టలేదు. కనుక వారి మాటలు నమ్మి నేను సెలవు తీసుకున్నాను.
రాత్రి పూట అమ్మ మంచం ప్రక్కన చాప వేసుకుని నిద్రించటం నాకు అలవాటు. అమ్మ గురకపెట్టి గాఢనిద్రలో ఉన్నది. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో అమ్మ కలవరిస్తోంది -“వాళ్ళు అన్నం తినకుండా వెళ్ళిపోయారు, అన్నం తినకుండా వెళ్ళిపోయారు” అని. అమ్మకి నిద్ర అన్నది లేదు, నిరంతరం మెలకుతోనే ఉంటుంది – అని నాకు అనుభవమే. కనుకనే అడిగాను, ‘ఎవరమ్మా?’ అని.
“చీరాల నుంచి వచ్చారు, వాళ్ళు” అన్నది అమ్మ. వాళ్ళు అన్నం తినకుండా వెళ్ళిపోవటం అమ్మను ఎంతగా బాధించిందో ఇందు మూలంగ స్పష్టమవు తోంది.
అమ్మ అన్నం తినదు. కానీ, నిరంతరం బిడ్డల ఆకలి తీర్చటం కోసమే తపిస్తుంది. నేను ఏమి వేసినా అన్నపూర్ణాలయం గాడి పొయ్యిలోనే వేస్తాను అంటుంది. అన్నపూర్ణాలయం అమ్మ యాగశాల, ప్రేమ ప్రయోగశాల; అమ్మ దివ్య ఆశీః ప్రసార కేంద్రం – మాధ్యమం. కొందరు అమ్మ సన్నిధిలో ‘గాయత్రీ యాగం’ నిర్వహింప తలపెట్టారు. అందుకు అమ్మ, “నాన్నా! మీరు ఏదైనా చేయండి. వచ్చిన వాళ్ళకి కడుపునిండా అన్నం పెట్టండి, కట్టుకోను గుడ్డలివ్వండి’ అన్నది. తన పర్యటనలో మురికివాడలూ, ఆస్పత్రులూ, అనాథాశ్రమాలూ, కారాగారాలూ, నిరాధారులూ – నిరాశ్రయులూ అయిన అనాధలను సందర్శించి స్వయంగా ప్రసాదాన్ని అందించింది. ఆశ్చర్యం. మోడు వారిన వారి జీవనవనం నందనోద్యానవనం అయింది.
‘అన్ని బాధలకంటే ఆకలి బాధ ఎక్కువ’ అని ప్రబోధించే అమ్మ నిరతాన్న వితరణకే అత్యధిక ప్రాధాన్యత నిచ్చింది. అంతా చేస్తూ “మనం పెట్టటం కాదు, నాన్నా! ఎవరి అన్నం వారు తింటున్నారు” అంటుంది. అంతకంటే కర్తృత్వ రాహిత్యం, కర్మ ఫల పరిత్యాగానికి ఇంతకు మించి గొప్ప ఉదాహరణ ఏది? “మీకు పెట్టడం మీచేత పెట్టించడం కోసమే” అనే అమ్మ వాక్యంలో మన కర్తవ్యము, ఒక పరమార్థము ఉన్నాయి. త్యాగమే అమృతత్వ ప్రాప్తికి దగ్గర దారి, రాచబాట.
‘అన్న’ అయిన అమ్మ శ్రీచరణాలకు శతాధిక వందనములు.