(ఆగష్టు 15 జిల్లెళ్ళమూడి అన్నపూర్ణాలయం వార్షికోత్సవం సందర్భంగా….)
ఉచ్ఛ్వానిశ్వాసాలు మంత్రరూపంగా నడపడం ప్రాణాయామం అని చెప్పింది అమ్మ. అలాగే ఆహారంలో భక్తి కలిస్తే అది ప్రసాదమవుతుంది. జలంలో భక్తి కలిస్తే అది తీర్ధమవుతుంది. భగవన్నివేదితమైన పదార్థం దివ్యప్రసాదం అవుతుంది. నిజానికి ఆ పరమాత్ముడే అన్నము, అన్నదాత, అన్నభోక్త అవుతాడు. ఆ భగవత్ శక్తియే జఠరాగ్ని రూపంలో మనం భుజించిన ఆహారాన్ని జీర్ణం చేసి శరీరాన్ని నిలుపుతున్నాడని ఋషివాక్కు. అహం వైశ్వానరో భూత్వా పచామ్యన్నం చతుర్విధం… అని గదా గీతావాక్యం. వంట చేసేవారి మనస్సులో గల ఆత్మీయత ప్రేమ, సేవాభావం వంటి గుణాలు ఆ ఆహారం పై ప్రభావం చూపుతాయి. రుచిలో గుణంలో మార్పు తెస్తుంది. ఇంకా ముందుకెళితే ఆహారం ఎక్కడ పండుతుందో, ఎక్కడ వండబడుతుందో ఎక్కడ భుజింపబడుతుందో – ఆయా ప్రదేశా గుణదోషాల ప్రభావం దానిపై పడుతుంది. ఆ ఆహార వినియోగానికి సహకరించిన దాత ‘అర్థశౌచం’ పాటించే వాడయి ఉండాలి. ధర్మమార్గంలో సంపాదింప బడిన న్యాయార్జిత విత్తమునే దానము చేయవలెను. ధర్మార్జన తోనే దైవకైంకర్యం దైవారాధన దానధర్మాలు చెయ్యాలంటుంది ధర్మశాస్త్రం. (దోష సంక్రాంతమైన ఆహారాన్ని స్వీకరించిన వాని మనఃప్రవృత్తులు వేరుగా
ఉంటాయి.)
అన్నేశ్రితాని భూతాని అన్నం ప్రాణమితి శృతిః
తస్మాదన్నం ప్రదాతవ్యం అన్నం హి పరమం హవిః
అన్నం కేవలం ఆకలి తీర్చే సాధన మాత్రమే అనుకోరాదు. అన్నాన్ని సాక్షాత్పరబ్రహ్మ స్వరూపంగా భావించి భుజించటం ఒక ఉపాసన. భగవద్విభూతి అయిన అమ్మకు నివేదించిన ఆహారం పవిత్ర ప్రసాదమే శరీర పోషణ, రక్షణ తృప్తి, సత్వగుణాదులు కలిగిస్తుందనటంలో సందేహం లేదు. అన్నమనే హవిస్సు జిహ్వ కంఠాది ఇంద్రియముల ద్వారా లోపల ఉన్న వైవ్వానరాగ్నిలో హోమం చేయటమే ఆహార సేవనం. జఠరాగ్నిని వైశ్వానరునిగా భావన చేసి ప్రాణాహతులను హోమం చేస్తూ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః అని స్మరిస్తూ చేసిన భోజనం యజ్ఞమే అవుతుంది. ఇంతటి పవిత్ర భావనని, శాస్త్రీయ పద్ధతిని అనుసంధానించారు మన పెద్దలు.
అనుష్టాన వేదాంతానికి (applied spirituality) అద్భుతమైన ఉదాహరణ అమ్మ ప్రారంభించిన అన్నపూర్ణాలయం. అనసూయ పేరున ఒక అనిర్వచనీయ మహావిభూతి అవతరించినది. బట్టలు పెట్టి శరీరానికి ఆచ్ఛాదన కలిగిస్తుంది. మాటలు చెప్పి మనసుకున్న ఆచ్ఛాదన తొలగిస్తుంది. అన్నంపెట్టి ఆకలి తీరుస్తుంది.
వస్త్ర ముఖ్యస్త్వలంకారః ప్రియ ముఖ్యంతు భోజనమ్
గుణో ముఖ్యస్తు నారీణాం విద్యాముఖ్యస్తు పూరుషః
అలంకరణలో వస్త్రము, భోజనం పెట్టుటలో ప్రియమైన రీతి, స్త్రీలకు మంచి గుణము, పురుషులకు మంచి విద్య ముఖ్యమని పెద్దలమాట. అర్కపురిని ఈ నాలుగూ లభించే పుణ్యస్థలిగా తీర్చిదిద్దినది అమ్మ.
అన్నపూర్ణాలయ ఆవిర్భావం :
చిన్నతనంలో బాపట్ల రైల్వేస్టేషన్ దగ్గర ఉన్న బ్రహ్మాండం వారి సత్రంలో బిచ్చగాళ్ళందరూ తమ జోలెలో తెచ్చుకున్న పదార్థాలను కలిపి అందరూ పంచుకుని తింటుంటే చూసిన అమ్మ – ఇలా అందరికీ స్వతంత్రమైన సత్రం, ఆలయం లేని ఊళ్ళో దేవాలయం కట్టించాలి అని అనుకొన్నది. తరువాత వివాహం అవటం జిల్లెళ్ళమూడి రావటం జరిగింది. చిన్నప్పటి భావనకు నాంది పలికినట్లు పిడికెడు బియ్యం పథకం ప్రారంభించింది. కాలక్రమాన అతిథి అభ్యాగతుల సంఖ్య పెరగటం, అమ్మ స్వయంగ చేసిపెట్టే పరిస్థితి మారటంతో నాన్నగారికి అమ్మకు భారం కాకుండా అన్నపానాలకు వేరే ఏర్పాటు చేసుకోవాలని సోదరీసోదరులు అనుకున్నారు. ఆ దంపతుల అనుమతితో 1958 ఆగష్టు 15న అన్నపూర్ణాలయానికి అంకురార్పణ జరిగింది. గాడి పొయ్యిలో నిప్పు వెలిగిస్తూ – ఇది అఖండ యజ్ఞం, మాతృ యజ్ఞం, జగన్నాథరథం కదిలింది. ఇక ఆగదు అన్నది అమ్మ. అన్నట్లుగానే 50 యేళ్ళ పైబడి నిర్విఘ్నంగా నిరతాన్నదానం జరుగుతోంది. ఒక మహా విభూతి సంకల్పించి సాకారం చేసిన చారిత్రిక సన్నివేశం.
ఇక్కడ డ్రస్సు ఎడ్రస్సు చూడకుండా పేద ధనిక భేదం లేకుండా ఆకలే అర్హతగా ఆప్యాయతతో అన్నం పెట్టాలని అమ్మ ఆశయం. అమ్మకు అన్నపూర్ణకు భేదం లేదు. అన్నపూర్ణాలయం అమ్మ గుండె లయ ! అన్నపూర్ణాలయంలో ఆగని అగ్నిహోత్రం అమ్మ ఆదేశించిన భవ్యసూత్రం. ఎవరో అమ్మా ! తిరుపతిలో యజ్ఞకుండాలతో యజ్ఞం చేస్తున్నారట చూసి వస్తాను అంటే అంతదాకా వెళ్ళవలసిన పనిలేదు, మన అన్నపూర్ణా లయంలో గాడిపొయ్యి అంతకన్నా ఎక్కువే, యిదీ యజ్ఞమే అని చెప్పింది. ఆకలితో రావచ్చు గాని ఆకలితో వెళ్ళకూడదని అమ్మ సిద్ధాంతం. “నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో. అంతా ‘వాడే’ చేయిస్తున్నాడనుకో” – ఇదీ అమ్మ పలుమార్లు చెప్పిన పరమసందేశం.
ఇది 1973 నాటి మాట. ఏప్రియల్ 12న అమ్మ 50 వ జన్మదినం. ఆ స్వర్ణోత్సవాన్ని ఎలా చేద్దామని అమ్మనే అడిగారు. “మీరందరూ ఒక లక్షమంది కూర్చుని సహభోజనం చేస్తుంటే చూడాలని ఉంది నాన్నా” అదీ అందరికీ ఆశ్చర్యం కలిగించిన అమ్మ కోరిన అసామాన్యమైన కోరిక !
` 70 ఎకరాల స్థలంలో 50 పందిళ్ళు వరసగా వేశారు. 7వ మైలురాయి దగ్గర అలంకరణ చేశారు. రంగు రంగుల విద్యుద్దీపాలు, ఉచిత వైద్యశిబిరాలు, కార్యకర్తల హడావిడితో ఉత్సవ వాతావరణం నెలకొంది. కనువిందుగా 12వ తేదీ ఉదయం 10 గంటల ప్రాంతం, జనం చూస్తే అట్టేమంది లేరు. 20 వేలమంది వరకు ఉండవచ్చు. ఎంతమందికి వంటచెయ్యాలి అని అడిగితే లక్షమందికి అని అమ్మ జవాబు. అంతమంది లేరు కదా అన్న అనుమానానికి జవాబు అన్నట్లు – ప్రాప్తమున్న వారందరూ వస్తారు. లక్షమంది మనుషులే ఉండాలనేముంది. మిగిలితే పశు పక్ష్యాదులకు పెట్టండి అన్నది. 11 గంటల నుంచి జనసందోహం రావటం ప్రారంభమయ్యింది. బస్సులు, కార్లు, ట్రాక్టర్లు, ఎద్దుబళ్ళూ, సైకిళ్ళు, స్కూటర్లు – ఇలా ఏది దొరికితే దానిలో వచ్చేవాళ్ళు, కాలి నడకన వచ్చేవాళ్లు మొత్తం లక్షకి పైగా వచ్చారు. భక్తితో, ప్రేమతో, ఆకలితో, ఎలా జరుగుతుందో చూద్దామన్న కుతూహలంతో- కులమత భేదాలు మరచి ఎందరో ఎందరో వచ్చారు. జనాన్ని చూసిన కార్యకర్తలు ఇంకో లారీడు బియ్యం తెప్పించాలని అమ్మతో చెప్పారు. అవసరం లేదు, మీ పనిలో మీరుండండి, నేను స్నానం చేసి వస్తాను అని చెప్పింది. 13 వంటశాలలు యేర్పాటయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే 13 వంటశాలలో వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వంటవారు చేసిన పదార్థాలన్నీ ఒకేరుచితో ఉన్నాయి. అమ్మ హస్త స్పర్శతో అక్షయంగా మారిన అన్నపురాసితో లక్షమందికి పైగానే భోజనం చేశారు. మిగిలినది పొలాల్లో వేసి, నదిలో కలిపి, పశుపశ్యాదులకు, జలచరాలకూ సమస్త జీవులకూ అన్నప్రసాదం అందజేశారు. జీపులో ఎక్కి బారులు తీరిన భోజన పంక్తులను తిలకించి పులకించింది అమ్మ. ఏ పాత్ర దొరికితే ఆ పాత్రతో తెచ్చారు 10 వేల లీటర్ల పాలు. ఏప్రిల్ నెల ఎండలు మండుతున్న వాతావరణం. ఈ పరిస్థితుల్లో మామూలుగా అయితే పాలు విరిగిపోవటమో, పులిసిపోయి పాడవటమో జరుగుతుంది. కాని ఆనాడు ఆ పాలతో తయారయిన ‘గడ్డ’ పెరుగు అత్యంత రుచికరంగా ఉంది. ఏ తర్కానికి, సైన్స్కీ, భౌతిక సూత్రాలకు అందని ఇట్టి సంఘటనలెన్నో జరిగాయి అమ్మ జీవితంలో.
అసలు జనాభా వెయ్యి మంది కూడా లేని జిల్లెళ్ళమూడి కుగ్రామంలో అన్నపూర్ణాలయం అనే వ్యవస్థ నెలకొనడం ఒక వింత. 50 యేళ్ళకి పైగా అవిచ్ఛిన్నంగా లక్షలాది మందికి అన్నప్రసాదవితరణ జరుగుతూ ఉండటం ఇంకా వింత. (1958 – 2009 మధ్యకాలంలో 1 కోటి 20 లక్షల మందికి అన్నవితరణ జరిగిందని ఒక అంచనా).
ఇంతా చేసి అమ్మ అన్నం తినదు. అడిగితే నేను ఆహారం వదలలేదు, కాని ఆహారమే నన్ను వదిలింది అంటుంది. చిన్నతనంలోనే ఈ కలిలో నాకాకలి లేదు అని చెప్పింది అమ్మ. మీరు తినకపోతే చిక్కిపోతారు. మీకు పెట్టుకోకపతే నేను చిక్కిపోతాను అంటుంది అమ్మ. అన్న ‘దానం’ అనే మాట అమ్మకు అంగీకారం కాదు. నా పిల్లలకు అన్నం పెట్టుకుంటే అది దానం ఎలా అవుతుంది అన్నది అమ్మ ప్రశ్న. వాళ్ళ అన్నం ఇక్కడ ఉంది. వాళ్ళ అన్నం వాళ్ళు తినే వెళుతున్నారు అని చెప్పేది. అమ్మ తన అనురాగాన్ని ఆశీస్సులను (ఆహార) పదార్థ మాధ్యమం ద్వారా అందిస్తుంది. భౌతికమైన క్షుద్బాధా నివారణ మాత్రమే కాదు దీని పరమావధి. ఇది ఒక అనిర్వచనీయ శక్తి ప్రసారానికి అమ్మ ఎంచుకున్న మాధ్యమం. అమ్మ చేతి ముద్ద అపురూప ఔషధం. ఈ భుక్తి ముక్తి ప్రదమే. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ ఆకలిబాధ లేకుండా కడుపునిండా అన్నం తినేరోజు రావాలి అన్నది అమ్మ కల. అన్నపూర్ణాలయంలో అన్నం అందించటం ఒక యాగం. ఆకలిగొన్న బిడ్డలు అక్కడ అన్నం తినటం ఒక యోగం. అదృశ్యరూపంలో అమ్మ నడిపిస్తున్న ఈ యాగశాల ఒక ఐహిక అముష్మిక ప్రయోగశాల. ఈ మహాయజ్ఞం వెనుక అమ్మ అమృత సంకల్పం అనే అక్షయపాత్ర ఉంది నేటికీ, ఉంటుంది ఏనాటికీ.
ఈ అన్నపూర్ణలయపు 55వ వార్షికోత్సవ శుభ సమయాన అమ్మకు మనమియ్యదగు నివాళి ‘అన్ని యిళ్ళు’ “అందరిల్లు” కావటానికి కృషి చేయటమే!