1958 స్వాతంత్య్ర దినోత్సవం నాడు జిల్లెళ్ళమూడి అందరింట్లో అన్నపూర్ణాలయం ఏర్పాటైంది. అంతకు ముందు అమ్మను చూడటానికి ఎవరు వచ్చినా నాన్నగారి ఇంట్లోనే భోజనం. అమ్మ స్వయంగా వండిపెట్టేది. మొదట్లో నాన్నగారు విడిగా వంటచేయడానికి అంగీకరించలేదు. మనకున్న దాన్లో కలోగంజో మనమే పెడదామన్నారు. కాని అమ్మ “రెక్కలు వచ్చిన పక్షులు ఎగురుతుంటే మనం సాయంచేయాలి. ఎగరటానికి సామర్ధ్యమున్న పిల్లలు పెద్దవాళ్ళై బాధ్యతను తాము కూడా మోస్తామంటే ఎలాంటిదో ఇదీ అంతే”నని, నాన్నగారికి నచ్చ చెప్పి ఒప్పించింది. ఆ సుముహూర్తం నుండి అన్నపూర్ణాలయం గాడిపొయ్యి నిరంతరం జాజ్వల్యమానంగా అహర్నిశలు వెలుగుతూనే ఉన్నది. పదిపదిహేను మంది భోజనంతో మొదలైన భోజనం ఒకేపంక్తిన లక్షకు మించి భోజనం చేసిన రోజులున్నాయి. మరి అది అన్నపూర్ణేశ్వరి అయిన అమ్మ చేతులమీదుగా ప్రారంభమైంది కదా! అమ్మ అవ్యాజానురాగం అనంత వాత్సల్యం, అన్నపూర్ణాలయంలో గోచరిస్తుంటుంది.
అన్నపూర్ణాలయంలో వంట ఎవరు చేశారు, ఏ పదార్థం చేశారు, ఎవరు వడ్డించారు అన్నది విశేషం కాదు. ఎవరు వండినా ఎవరు వడ్డించినా ఆ పదార్థాలు అమ్మ అనురాగము – ఆప్యాయతలతో రంగరింపబడి పవిత్రతను సంతరించుకొని బహు రుచికరమై ఉంటాయి. మొదటి రోజులలో లక్ష్మీ నరసమ్మగారు చింతకాయ పచ్చడి, చారు వేసి పెట్టేది. ఎంత రుచిగా ఉండేవో! వాటికి ఆ రుచి ఎక్కడి నుండి వచ్చేదో మా కర్థమయ్యేది కాదు. మన ఇళ్ళలో ఎన్ని తిరుగమోతలు పెట్టిచేసినా ఆ రుచి వచ్చేదికాదు. తరువాత తరువాత ఇదంతా అదృశ్యంగా అమ్మ హస్తమే ఇందులో ఉన్నది అని అర్థం కావటానికి చాలాకాలం పట్టింది. ప్రభావతక్కయ్య, చిదానందమ్మక్కయ్య, తిరుమలమ్మగారు, అన్నపూర్ణమ్మగారు ఎందరెందరు ఆదరంగా అప్యాయంగా అన్నం పెట్టేవారో, తిననంటే అరచి, మందలించి మరీ సొంత పిల్లలకు పెట్టినట్లు పెట్టేవారు. ఆ రోజులు తలచుకుంటుంటే ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటాయ్.
అమ్మ తనను దర్శించటానికి వచ్చిన బిడ్డలను భోంచేశావా నాన్నా! అని అడుగుతుంది. పూజ చేసుకొని చేస్తానమ్మా! అంటే, ముందు భోంచేసి రండి ఆ తర్వాత పూజ అంటుంది. భోజనం చేసి వచ్చామమ్మా! అంటే ప్రసాదంగా కొంచెం తీసుకోండి నాన్నా! అంటుంది. అంటే అమ్మ అన్నపూర్ణాలయంలో భోజనానికి ఎంత ప్రాధాన్యమిచ్చిందో అర్థమౌతున్నది. అక్కడి ఆ ప్రసాదం తింటే చాలు వాళ్ళ వాళ్ళ సమస్యలు తీరిపోతున్నవి, జబ్బులు నయ మౌతున్నవి, బాధలు తీరిపోతున్నవి. అమ్మ కరుణ అవ్యాజంగా అన్నం ద్వారా ప్రసారమౌతున్నదేమో! అనిపిస్తుంది.
అన్నపూర్ణాలయం ప్రారంభించేటప్పుడు దాని నిర్వహణ బాధ్యత ఎలా? అని ఆలోచిస్తున్న సోదరులకు అమ్మ, “ఇది జగన్నాథ రధం. ప్రారంభమైతే ఆగేది లేదు,” అన్నది. అవును అమ్మే జగత్తు – జగత్తుకు నాథుడు గనుక ఆ అన్నపూర్ణాలయ రథచక్రాలు ఎందుకు ఆగుతవి? అమ్మ యొక్క అనంత శక్తి సామర్ధ్యాలు అన్నపూర్ణాలయ నిర్వహణలో ప్రస్ఫుటమౌతుంటాయి. వంద మందికి కూడా సరిపోదేమో అనుకున్న ఆహారాన్ని వేలమంది తిన్న సందర్భాలున్నాయి. అన్నపూర్ణాలయం అక్షయపాత్ర. అమ్మ దివ్యశక్తి, అద్భుత మహిమ అక్కడి వారికి నిరంతరం ప్రత్యక్షమౌతూనే ఉంటాయి.
‘అమ్మా! ఈ అన్నదానం ఎంతో మహత్తరమైనది’ అని ఎవరన్నా అంటే, తల్లి బిడ్డలకు పెట్టుకోవటం దానమెట్లా అవుతుంది? అయినా ఇక్కడ నేను పెట్టానని అనుకుంటుంటే గదా! ఎవరి అన్నం వారు తింటున్నారు. ఇందులో ఒకరు ఇంకొకరికి పెట్టటమనే ప్రశ్నలేదు. ఇక్కడ ఇట్లా జరుగుతున్నదంటే ఈ విధంగా అందరిళ్ళలో జరగాలనే అని అమ్మ చెప్పేది. ఏ సందేశాలు ఏ ఉపన్యాసాలు ఎప్పుడూ ఇవ్వని అమ్మ “నీకున్నది తృప్తిగా తిని నలుగురికి ఆదరంగా పెట్టుకో, అంతా వాడే చేయిస్తున్నాడనుకో”, అన్న మాటలలో సందేశము – ఆదేశము కనుపిస్తాయి. ఏ కర్తృత్వమూ లేదు అంటూనే ఆధ్యాత్మిక తత్వము మనకు బోధించింది. కుల, మత, వర్గ, వర్ణ విచక్షణ లేకుండా డ్రస్సు, అడ్రసును బట్టికాక ఆకలే అర్హతగా అన్నపూర్ణాలయంలో భోజనం పెట్టబడుతుంది. ఆకలికి పేద, ధనిక భేదాలు లేవు అన్నది. “ఇంకా బిడ్డలను కనాలనే ఆశ – ఇంకా బాగా బిడ్డలకు పెట్టుకోలేక పోయాననే అసంతృప్తి” తన కున్నయ్యని చెప్పింది అమ్మ.
అమ్మ అంటే “అంతులేనిది అడ్డులేనిది అంతటికీ ఆధారమైనది” అని అమ్మ చెప్పింది. అమ్మంటే బిడ్డలకు తృప్తిని ఆనందాన్ని ఇచ్చేది. బిడ్డలకోసం తను కరిగిపోయేది తరిగి పోయేది. తన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలకోసం ప్రాణాన్నివ్వటానికి సైతం లెక్క చేయని మాతృత్వ మమకారం అమెది. అసలు రూపం లేని భగవంతుడు రూపం దాల్చి వస్తే ఆ రూపానికి “అమ్మ” అనే పేరే సరియైనది. మిగతా అవతారాలన్నీ అమ్మ నుండి వచ్చినవారే. తల్లిదండ్రీ లేకుండా ఉద్భవించాడు అన్న శివుడు కూడా ఆ శక్తి అండ లేకుండా కాలు కూడా కదల్పలేడట.
“అమ్మ”, “అన్నపూర్ణ” అనేవి ఒకే పదానికి మారు పేర్లు. ఒక నాణానికి రెండు ప్రక్కలు – అన్నపూర్ణ, అమ్మ. అమ్మ పాదాల బొటన వ్రేళ్ళపై అన్నపూర్ణాదేవి రూపం గల సువర్ణ అంగుళీయకాలున్నాయి. మొదట్లో జిల్లెళ్ళమూడికి ఎవరు వచ్చినా అమ్మే వండి బిడ్డలకు అన్నం పెట్టుకొనేది. బిడ్డలంటే అమ్మ దృష్టిలో మానవులేకాదు. పశువులు, శిశువులు, ముసలులు, సన్యాసులు, దేవతలు, దేవుళ్ళు, రాళ్ళు, రప్పలు, గడ్డలు, సర్వసృష్టీ తన సంతానమే. అసలు తానే సృష్టిగా మారింది. అందుకే అమ్మ “అధికానిది ఏదీ కనిపించటం లేదు” అంతా అదే అంటుంది. తాను భౌతికంగా రూపం దాల్చి వచ్చింది కనుక తన ఇంటిని అన్నపూర్ణాలయం చేసింది. తన ఇంటిని అందరిల్లు చేసింది. తానే అందరమ్మ కనుక.
జిల్లెళ్ళమూడిలో చాలా ఆలయాలు వస్తున్నాయి. మూలమైనది మొదటిది అన్నపూర్ణాలయం. అన్నపూర్ణాలయం తన గుండెకాయ అన్నది అమ్మ. ఆ గుండె కొట్టుకున్నంత కాలం మిగతా అవయవాలు, ఆలయాలు సజీవంగా ఉంటాయి. డాక్టర్ ఇనజకుమారి ఒకసారి అమ్మకు సెలైన్ ఎక్కిస్తుంటే అమ్మ ‘అన్నపూర్ణాలయానికి సెలైన్ ఎక్కిస్తున్నావా?’ అన్నది. అంటే అమ్మ, అన్నపూర్ణాలయం అభేద్యమని అమ్మ అంగీకరించటమే”. “అన్నం పరబ్రహ్మ స్వరూపమని, పూర్ణమంటే “పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే” అనీ, ఆలయం అంటే మనసు లయమయ్యే చోటనీ పెద్దలు చెపుతారు. అన్నపూర్ణాలయంలోని ఏ పదం తీసుకున్నా భగవంతుని స్వరూపమనే అర్థం వస్తున్నది.
అన్నపూర్ణాలయంలో ఆదరణగా ఆప్యాయంగా పెట్టేవాళ్ళు కావాలి నాన్నా! అనేది అమ్మ. ‘లోకంలో బలహీనులు, దరిద్రులు, అభాగ్యులు, అవిటివారు, అంధులు, దీర్ఘవ్యాధిగ్రస్తులు ఎందరో ఉన్నారు. వారిని దగ్గరకు తీసుకొని ఆదరణతో, ప్రేమతో పోషించడం ద్వారా వారిలోని అభద్రతా భావాన్ని పోగొట్టండి. వారిసేవ భగవత్సేవగా చేయండి. ఒకరి కష్టాల్లో ఒకరు సాయపడి కుటుంబంగా మసలుకోండి అని అమ్మ లోకంలోని సేవాసంస్థల వాళ్ళు అడిగితే సందేశం ఇచ్చింది. జిల్లెళ్ళమూడిలో ఆవరణలో ఉన్నవారు మాకు సాధన ఏమిటమ్మా? అంటే “అలసి సొలసి వచ్చిన సోదరీ సోదరుల పాదాలు కడిగి వారికి మంచినీరిచ్చి, అన్నంపెట్టించటం కంటే సాధన ఏమున్నది నాన్నా ?” అన్నది. తాను అలా చేసి చూపించింది. అమ్మ దగ్గరకు చేరిన వారికి అలసట తెలియదు, సమయం తెలియదు. మనుషులకే కాదు, కాకులకూ గారెలు వండించిపెట్టింది. ఊళ్ళో ఉన్న మనుషులకే కాక పశువులకు దాణా పెట్టించింది. స్త్రీలకు, పురుషులకు ఆవరణలోని వారిచే పాదాలు కడిగించి గుడ్డలు పెట్టించి, అన్నంపెట్టించి, ఆదరించి చూపించింది. అదీ అమ్మంటే ఏదైనా తన అనుభవంలో నుండే చెప్తుంది.
సామ్యవాద సిద్ధాంతానికి కృషి చేస్తున్నాం, పోరాడుతున్నాం అనే వారు కూడా అమ్మలాగా ఆచరణలో చేసి చూపించిన వారు లేరేమో! వర్ణ వర్గ పేద ధనిక విచక్షణ లేకుండా ఆకలే అర్హతగా ఎవరు ఎక్కడ పెట్టారు? ఒక్క జిల్లెళ్ళమూడిలో తప్ప. ఇంతమందికి ఇలా ఆప్యాయంగా పెట్టిన అమ్మ ఈ కలలో నా కాకలి లేదని తన కడుపు మాడ్చుకొని మన కడుపులు నింపింది. మనం తింటే తాను తృప్తిగా త్రేన్చేది.
ఎందరో ఎన్నో యాగాలు, యజ్ఞాలు, హెూమాలు చేస్తున్నారు. అమ్మది మాత్రం “మాతృయాగం”. పూర్ణాహుతిలో అమ్మను పాల్గొనమంటే, నేనేది వేసినా అన్నపూర్ణాలయం గాడిపోయిలోనే వేస్తానన్నది. అన్నపూర్ణాలయం గాడిపోయిలోని ఆ అగ్ని చిదగ్ని. ఆ చిదగ్ని సంభూతయే “అమ్మ”. నా రాశి బియ్యపురాశి అన్న అమ్మది అన్నావతారమే.
—
ది.14.7.2023 శుక్రవారం సాయంత్రం నోయిడా నుండి ఉత్తరభారత చిన్మయ మిషన్ యువకేంద్ర సంచాలకులు శ్రీశ్రీశ్రీ స్వామి చిద్రుపానంద కళాశాలకు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. జీవన లక్ష్యాలను గురించి ప్రసంగించారు.