నేను 1975లో జిల్లెళ్ళమూడికి వచ్చిన తొలిరోజులు. అమ్మ దర్శనం, అమ్మ అపారమైన ప్రేమ గురించి వేరే చెప్పవలసిన అవసరం లేదు కదా! నా కష్టం అంతా అన్నపూర్ణాలయం దగ్గరే. ఆ రోజులలో చింతకాయ పచ్చడి (కారం తినే అలవాటు లేదు), పలచటి సాంబారు, నీళ్ళలాంటి మజ్జిగ ఉండేవి. ఇంట్లో రకరకాల రుచులు మరిగిన నేను ఇవి తినలేకపోయే వాడిని. అకులో ఉన్నవి అన్నీ అటూ ఇటూ కెలికేసి చివరకు చుట్టకట్టి అవతల పారవేసేవాడిని.
ఒకరోజు ఇదే కార్యక్రమం నిర్విఘ్నంగా చేసి, చేతులు కడుగుకొని బుద్ధిమంతుడిలా అమ్మ గదికి వెళ్ళాను. సాధారణంగా నేను అమ్మ గది గుమ్మం దగ్గరకు రాగానే అమ్మ నావేపు చూసి లోపలికి రమ్మనట్టుగా తల పంకించేది.
ఈ సారి అలా జరగలేదు. లోపలికి వచ్చి అమ్మకు ఎదురుగా గోడకు ఆనుకుని కూర్చున్నాను.
అమ్మ నా వేపు చూడనైనా చూడలేదు. కొంచెం నిరాశ కలిగింది. అమ్మ కొంతమందితో మాట్లాడుతూ ఉంది. కొన్ని క్షణాలు ఆగి వాళ్ళతో “అన్నపూర్ణా లయంలో భోజనం రుచిగా ఉండదు నాన్నా, కానీ ఆకలి తీరుస్తుంది, ఆరోగ్యానికి మంచిది” అని చెప్పింది. నాకిది చెంప ఛెళ్ళుమనిపించి బుద్ధి చెప్పి నట్లయింది.
ఆ రోజునుంచి అన్నపూర్ణాలయంలో భోజనంలో రుచులు ఎంచక, పైనుంచి అమ్మ గమనిస్తున్నది అన్న స్ఫురణతో, ప్రసాదం అన్న భావనతో తినడం మొదలుపెట్టాను.
ఈ రోజు అన్నపూర్ణాలయం వార్షికోత్సవం సందర్భంగా నా ఈ అనుభవం గుర్తుకొచ్చింది.
జయహో మాతా.