1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అన్నపూర్ణాలయ వార్షికోత్సవం

అన్నపూర్ణాలయ వార్షికోత్సవం

Editorial Board - Viswajanani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : September
Issue Number : 2
Year : 2010

ఆగష్టు 15వ తేదీ ఆదివారం నాడు జిల్లెళ్ళమూడిలో అన్నపూర్ణాలయ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. సుప్రభాత గీతాలతో ప్రారంభమై, హైమాలయ, అనసూయేశ్వరాల యాలలో అభిషేకాలు, విశేష అర్చనలు వేదోక్తంగా జరిగాయి.

ఉదయం 8 గంటలకు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, సంస్కృత పాఠశాలల ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం ప్రణాళికాబద్ధంగా జరిగింది. శ్రీ విశ్వజననీపరిషత్ పక్షాన శ్రీ ఎం.దినకర్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, విద్యార్థులకు సందేశం ఇచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కె.ప్రేమకుమార్గారు ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉదయం 9 గంటలకు అందరింటి ఆవరణలో ‘అమ్మ’ పతాకావిష్కరణ వైభవంగా జరిగింది. శ్రీవిశ్వజననీపరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ కె.బి.జి. కృష్ణమూర్తిగారు పతాకాన్ని ఆవిష్కరించారు. కళాశాల సంస్కృతం రీడర్ డాక్టర్ పి.ఝాన్సీలక్ష్మీబాయిగారు పతాకగీతాలాపన చేయగా, శ్రీ విశ్వజననీ పరిషత్ తరఫున శ్రీ చక్కా శ్రీమన్నారాయణగారు ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, ‘విశ్వజనని’ సంపాదకులు శ్రీ వి.యన్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారు “అమ్మ ప్రబోధించే విశ్వమానవతా దృక్పథాన్ని వివరిస్తూ, జాతీయ సమైక్య భావంతో మనం పురోగమించాల”ని ఉత్తేజకరమైన సందేశాన్ని అందించారు.

ఉదయం 10 గంటలకు అన్నపూర్ణాలయం సిబ్బంది అమ్మకు ప్రత్యేక పూజ నిర్వహించగా, శ్రీ విశ్వజననీపరిషత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ నాదెండ్ల లక్ష్మణరావుగారు పరిషత్ పక్షాన అందరికీ నూతనవస్త్రాలు బహుకరించారు.

ఉదయం 11 గంటలకు ‘అందరింటి’లోని అమ్మ పూజా వేదిక వద్ద అన్నపూర్ణాలయ వార్షికోత్సవ సదస్సు ప్రశాంత సుందరంగా జరిగింది. సభాధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు “అమ్మప్రేమకు ప్రతిరూపమే అన్నపూర్ణాలయమని” వివరించారు. అమ్మ సన్నిధిలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల అభివృద్ధి కోసం మాతృశ్రీ విద్యాపరిషత్ నిర్వహిస్తున్న ప్రణాళికలను సమీక్షించారు. కళాశాల విద్యార్థులను ప్రోత్సహిస్తూ, సహకరిస్తున్న దాతలకు, ఒడిదుడుకులకు ఓర్చి, సంస్థను నడిపిస్తున్న పెద్దలకు కృతజ్ఞతలు అందిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. సుబ్రహ్మణ్యేశ్వర శాస్త్రి గారు ప్రసంగించారు. సభాప్రారంభకులుగా విచ్చేసిన డాక్టర్ శాస్త్రిగారు – అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని, విద్యార్థులు ప్రగతి సాధించాలని సందేశం ఇచ్చారు. శ్రీ చక్కా శ్రీమన్నారాయణ గారు ఉత్తమ విద్యార్థులకు నూతన వస్త్రాలు బహుకరించగా, శ్రీ ఎన్. చిరంజీవిగారు చేతి గడియారాలను కానుకగా ఇచ్చారు. 

ఈ ఉత్సవంలో భాగంగా శ్రీమతి ఎల్.విజయశ్రీ గారు ఆలపించిన భక్తిగీతాల సి.డి.ని సంగీత దర్శకులు శ్రీ మైలవరపు పూర్ణచంద్రరావుగారు ఆవిష్కరించారు. ఈ సి.డికి. ప్రేరకులు శ్రీ ఎం.ఎన్.ఆర్.ఆంజనేయులుగారు సి.డి. రూపకల్పనలో తమ ఆంతర్యాన్ని వివరించారు. గాయని శ్రీమతి ఎల్. విజయశ్రీ తమ అనుభూతిని పేర్కొన్నారు. అమ్మకు కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల ఆంధ్రశాఖాధ్యక్షులు డాక్టర్ బి.ఎల్.సుగుణగారు అమ్మ సాహిత్యాన్ని సమీక్షిస్తూ, శ్రీమతి ఎల్. విజయశ్రీగారిని అభినందించారు. 

శ్రీ గొట్టిపాటివారు, శ్రీ అధరాపురపు వారల పేరిట వారి వారసులు విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల పాఠశాలలో జరిగిన దేశభక్తి గీతాలపోటీలలో బహుమతులు గెలుచుకున్న విద్యార్థులను, అన్నపూర్ణాలయ వార్షికోత్సవ సందర్భంగా జరిగిన “అమ్మ – ప్రేమతత్త్వం” వక్తృత్వం, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను పెద్దలందరూ అభినందించారు. బహుమతి ప్రదానం జరిగింది.

జిల్లెళ్ళమూడిలో కళ్యాణం

22.8.2010న అమ్మ సన్నిధిలో కంకిపాడు. వాస్తవ్యులు శ్రీ గ్రంధి శేషారావు గారి తృతీయ కుమారుడు చిరంజీవి శేఖరుకు (చక్కా శ్రీమన్నారాయణ గారి మేనల్లుడు), పెదప్రోలు వాస్తవ్యులు శ్రీ కూరపాటి మనోహరగుప్తాగారి పుత్రిక చి.ల.సౌ. కిరణ్మయికి, అతి వైభవంగా వివాహం జరిగింది. ఈ సందర్భంగా మన కాలేజి విద్యార్థినులు షుమారుగా 50 మంది, దీక్షా వస్త్రములు ధరించి, హనుమబాబుగారి ఆధ్వర్యంలో వివాహ వేదిక మీద, అనేకమంది బంధుమిత్రుల సమక్షంలో “లలితాపారాయణం” చేయటం చక్కటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. ఆశ్రమము యొక్క విశేషాలు, అమ్మ యొక్క తత్వాన్ని గురించి శ్రీ చక్కా శ్రీమన్నారాయణగారు, శ్రీ హనుమబాబుగారు వివరించటం జరిగినది.

మస్కట్ వాస్తవ్యులు శ్రీ చక్కా సత్యనారాయణగారు (పెండ్లికుమారుడి బావగారు) సంస్థతోను, అమ్మతోను వారికి కలిగినటువంటి అనుభవాలు వివరించటం జరిగినది..మన అన్నపూర్ణాలయానికి (ధాన్యాభిషేకం) ప్రతి సంవత్సరం కూడా 100 బస్తాలు ధాన్యం డొనేషన్ చేయటం గురించి చెప్పినపుడు అందరు ఎంతో సంతోషంగా హర్షద్వానాలు చేసినారు. 

ఈ సందర్భంలోనే టి.టి.డి. దేవస్థానం పాలకవర్గ సభ్యుడు శ్రీ సత్యనారాయణశర్మగారు వివాహానికి విచ్చేయటం, యిక్కడ జరిగే అన్నవితరణ కార్యక్రమానికి, స్పందించి షుమారుగా 25 బస్తాలు బియ్యం (ఒక నెలకు సరిపడ) వారి వ్యక్తిగత సమర్పణగా ప్రకటించడం, అంతేగాకుండా అవకాశాన్ని బట్టి మన సంస్థవారు ఖాళీ స్థలం యివ్వగలిగితే, ఒక Dormatry Hall కట్టిస్తామని వాగ్దానం చేయటం, ఎంతో ఆనందాన్ని కల్గించినది. స్వామివారి ప్రసాదంగా, నూతన దంపతులకు పట్టు వస్త్రములు యివ్వటం జరిగినది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!