‘సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ’-అని బ్రహ్మవల్లి (తైత్తిరీయోపనిషత్) బ్రహ్మపదార్థాన్ని నిర్వచించింది. ‘ఏకం సత్ విప్రా బహుధా వదన్తి’ అన్నట్లు అనేక సత్యాన్వేషులు సద్వస్తువును విభిన్న కోణాల్లో దర్శించి అద్భుతంగా ఆవిష్కరించారు.
ఆ త్రోవలో వాగ్గేయకారుడు భాగవతావతంసుడు శ్రీ అన్నమాచార్యుల వారు ఎన్నో కీర్తనల్ని రచించారు. సత్యం-బ్రహ్మ-అమ్మ కనుక వారి అంతరంగంలో అమ్మయే కొలువై ఉంది. ఉదాహరణకి ఒక కీర్తన.
పల్లవి: ‘ధర్మాధర్మములాలా! దైవములాలా! నిర్మితము అతడే కాని నేనేమి ఎఱగను’ – అనేది.
అన్నమయ్య సంప్రదాయబద్ధమైన కర్మ సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తున్నారు. “కర్మ, కర్మఫలం, ధర్మం-అధర్మం, స్వర్గం-నరకం… అని నన్ను న్యాయస్థానంలో ముద్దాయిలా నిలబెట్టి ఎందుకు ప్రశ్నిస్తారు? నాకేమీ తెలియదు. నేను అస్వతంత్రుడను, అనేక పరిమితులకు లోబడియున్నాను. దైవం అనంతుడు, సర్వతంత్ర స్వతంత్రుడు – సృష్టి నిర్మాణ సంచాలక మహాశక్తి – శిల్పి (The Divine Architect). నేనేమీ ఎఱగను. తత్త్వతః ధర్మాధర్మములు నాకు అంటవు” అని వివరిస్తున్నారు.
అమ్మ “కర్మసిద్ధాంతాన్ని” పూర్వపక్షం చేసింది.
“మీరు కానిది నేనేదీ కాదు” అని ఒక్క మాటలో స్పష్టం చేసింది. జగజ్జనని.
1వ చరణం :
“పుట్టించేటి వాడు హరి, పుట్టెడి వాడను నేను
నెట్టన ఉన్న పనులు నేనెఱగను.
వెట్టివాడను నే నింతే – విష్ణుడు నాకు ఏలికె
చుట్టిన నడుమంత్రాల సుద్దులు ఎఱగను” ॥ధర్మాధర్మములాలా॥
“నా సంకల్పంతో మీరు జన్మ ఎత్తి నాలోనే లయమౌతారు” – అంటూ అమ్మ జనన మరణ ప్రక్రియ రహస్యాన్ని స్పష్టం చేసింది. అద్వైత తత్త్వామృత సారాన్ని వర్షించింది. “నా జన్మకి కారణం శ్రీహరి (నేను కాదు). నెట్టన అనివార్యముగ – నేను చేస్తున్న పనులు నేను ఎఱగను” అంటున్నారు. అన్నమయ్య.
“నువ్వు ఎంతగా చేస్తున్నానని అనుకున్నా, ఆ శక్తి అనుకోనిదీ, చేయించనిదీ నువ్వు అనుకోలేవు, చేయలేవు” – అనే అమ్మ వాక్యార్ధం అదే.
“వెట్టి వాడను. నేనింతే” I am a bonded labourer;
“విష్ణుడు నాకు ఏలికే” – నా యజమాని, నా కామందు విష్ణుమూర్తి. ఆయన చేయించినట్లు చేస్తాను. అంతే.
“నడుమంత్రాల సుద్దులు” అంటే జననం నుంచి మరణం వరకు చేసే క్రియా కలాపం (from womb to tomb) మాటలు – – నా కదలికలు – చర్యలు – చర్చలు నా చేతిలో లేవు – నేను ఏమీ ఎఱగను – అన్నారు.
2వ చరణం :
“లోకము దేవుని మాయకు లోనైన వాడను నేను
చేకొని కర్మములలో చేత లెరగను
సాకిరి మాత్రము నేను సర్వజ్ఞుడాతడు
దాకొని నే తలచేటి తలపు ఎఱగను ?? ॥ధర్మాధర్మము లాలా॥
“మాయ అంటే ఏమిటమ్మా?” అంటే, “నేను చేస్తున్నాననుకోవటము” అన్నది అమ్మ.
“చేతలు చేతుల్లో లేవు” అనీ ప్రబోధించింది. కాగా నేను, నాది, నా స్వయంకృతాపరాధం, నా కర్మ – అంటూ వాపోతాం.
-(చేత+కొని=చేకొని) నేను చేసే కర్మలలో చేతలు (చేయించే వాడిని) ఎఱగను. సాకిరి=సాక్షి. నేను చేసే పనులకు నిమిత్తమాత్రుడను మాత్రమే. భగవంతుడు సర్వజ్ఞుడు.
(దాగు+కొని = దాకొని) నా బుద్ధికి తోచే సంకల్పాలు, వచ్చే ఆలోచనలు నేటి తలపు నేను ఎఱగను. అవినావి కావు ” అంటారు – అన్నమయ్య.
“Thought వచ్చింది అంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది?” అని ప్రశ్నిస్తుంది అమ్మ. ఆలోచనకి కర్తలు మనం కాదు. ఆలోచన వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. ఈ వాస్తవం అవగతమైతే సంశయాలు ఉండవు.
3వ చరణం:
అంతరాత్మ అతడు అతని బంట జీవుడను
పంతాన నా లోపలి భావ మెరగను
యింతయు శ్రీ వేంకటేశుడు – యిటువంటి వాడను నేను
చెంతల ఆనందమిది చెప్పనేమి ఎఱగను ॥ధర్మాధర్మములాలా॥
“సర్వాంతర్యామి, సర్వాంతరాత్మ భగవంతుడు. నేను అతని బంటును. “పంతాన” – నిష్ఠతో జప, తప, హెూమ, ఆరాధన, అనుష్ఠానము వలన “నాలోపలి భావము” నా నిజతత్త్వాన్ని ఎరగను. ఆత్మావలోకనం అసాధ్యం, అలభ్యం” అంటారు అన్నమయ్య.
ఒకనాడు అమ్మ రాజుబావగారిని అద్భుత విచికిత్సను రేపే ప్రశ్న వేసింది. “రూపాయ నాణానికి మనం ఒక వైపు బొమ్మని చూస్తాం. అంటే రెండవ వైపు బొరుసు ఉన్నదా? ఆ రెండవ వైపు ఎవరన్నా చూశారా? (అది) కనపడు తుందా? కనపడదా? దృశ్యమాన ప్రపంచంలో, ఈ సృష్టిలో ఈ కన్నులకి కనిపించే ప్రతి వస్తువుకి రెండవ వైపు ఏమిటి?” – అని. “తెలియదమ్మా” – అన్నారు రాజు బావ.
అందుకు అమ్మ “రెండవ వైపు ఏమిటో తెలుసా? “తనే”. ఇంతటినీ చూచేవాడు తనని తాను చూసుకోలేడు. ఇంత చూసే కన్నులు రెండవ వైపు తనని చూసుకోలేవు. రెండవ వైపు తనే. తనను తాను తెలుసుకున్నవాడు సర్వాన్నీ తెలుసుకున్నవాడు అవుతాడు” – అని ఆత్మసాక్షాత్కారం, స్వస్వరూప సందర్శనం అంటే ఏమిటో స్పష్టం చేసింది.
“ఏం చేస్తే బ్రహ్మత్వ సిద్ధి కలుగుతుంది?” అని అడిగితే, అమ్మ “ఏం చేసినా కలగదు. వాడు (ఆ శక్తి) ఇస్తే వస్తుంది” అన్నది. “సాహిత్యంతో రాహిత్యం కాదు” అని మరొక విశేషాంశాన్ని వెలికి దీసింది.
“యింతయు శ్రీ వేంకటేశుడు”. అంటే చలపతి ఇంత గొప్పవాడు – యజమాని, విధాత, సర్వజ్ఞుడు, సర్వాంతరాత్ముడు – అని. “యిటువంటి వాడను నేను” – అంటే, నేను అల్పుడను, అస్వతంత్రుడను, ఒక ఆట బొమ్మను, తోలుబొమ్మను – అని.
కాగా ఆ జగన్నాథుడు, ఆది మధ్యాంత రహితుడు, స్రష్ఠ, ఒక నిరంకుశుడు, నియంత కాదు. భవబంధ విమోచకుడు, అఖండానంద సంధాయకుడు – అంటున్నారు.
కనుకనే “చెంతల ఆనందమిది చెప్ప నేమి ఎరగను” అన్నారు. భగవదనురక్తి, భగవచ్చింతన, భగవత్సేవ, భగవత్సాన్నిధ్యములో మనం పొందే ఆనందం ఎంత అని అడిగితే ఇంత అని చెప్పలేము – అంటున్నారు.
వాత్సల్యామృత వర్షిణి అమ్మ సన్నిధిలో ఏ వ్యక్తి అయినా తను పొందిన లబ్ధిని, విభూతిని, సంపదని, శక్తిని, ఆనందాన్ని వివరించగలడా? లేదు. అది అనుభవైకవేద్యం మాత్రమే.
కనుకనే అమ్మ కృపను దివ్యాశీస్సులను నిరంతరం స్మరించుకోవాలి. ఆ మహత్వాన్ని అనుక్షణం మననం చేసుకోవాలి. ఎలా?
సోదాహరణంగా వివరిస్తా –
1) శ్రీ రాజుపాలెపు రామచంద్రరావు గారు అమ్మ ఎడల అకుంఠిత భక్తి విశ్వాసాలు కలవారు. ఒకనాడు వారి కాలిలో జపాన్ తుమ్మ ముల్లు గుచ్చుకుని septic అయింది. మరొక అమ్మ బిడ్డ డా. నారపరాజు శ్రీధరరావు గారి దగ్గరకు వెళ్ళారు. ఆయన మత్తు మందు ఇవ్వకుండానే ఆ భాగాన్ని కత్తిరించి, కత్తితో ఆ భాగాన్ని శుభ్రం చేస్తున్నారు. వారు ఆ బాధకు తట్టుకోలేక “అయ్యా! అబ్బా! అంటున్నారు. డాక్టర్ గారు “ఒక్కసారి కూడా ‘అమ్మా!’ అనరేమిటి?” – అని ప్రశ్నించారు.
రామచంద్రరావు గారి సమాధానం “అమ్మా! అని పిలిచేది ఇందుకోసం కాదు” – అని, అమ్మను కోరవలసింది వేరే ఉంది. అది అమ్మే ప్రసాదిస్తుంది. అని వారి ప్రగాఢ విశ్వాసం.
2) ఒకసారి బెంగళూరులో శ్రీ అంగర సూర్యనారాయణ గారింట్లో ‘అనసూయా వ్రతం’ చేయిస్తున్నాను. అందు భాగంగా అమ్మ పంచలోహ విగ్రహానికి పంచామృతాలతో శ్రీ సూక్త పఠన పూర్వకంగా అభిషేకం చేశారు. శుద్ధోదక స్నానం అనగానే – వేడి నీళ్ళు తెప్పించి వాటితో అభిషేకం చేశారు. “ఇదేమిటి?” అన్నాను. “మనం వేడి నీళ్ళు పోసుకుని, అమ్మకి చన్నీళ్ళు పోస్తామా?” అని తిరిగి ప్రశ్నించారు. అది ప్రేమ, భక్తి, అనురక్తి, సేవాభావం,
తర్వాత కొన్నాళ్ళకి తెలిసింది చతుష్షష్టి (64) ఉపచారములలో మనకి తెలిసినవి షోడశ (16) మాత్రమే. అందు “అభ్యంగ పీఠోపవేశనము, తైలాభ్యం జనము, ఉష్ణోదక స్నానము….” మున్నగునవి ఉన్నాయి.
“భక్తిః కిం న కరోతి?” అని ప్రశ్నిస్తారు:
“మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తి రేవ గరీయసీ” అని ఉద్బోధిస్తారు. శ్రీ శంకర భగవత్పాదులు.
అన్నమయ్య అంతరంగంలో దీపించే అమ్మ తత్వాన్ని స్మరిస్తూ అమ్మ శ్రీ చరణాలకు శత సహస్రాధిక వందనములనర్పిస్తున్నాను.