అన్నం పరబ్రహ్మ స్వరూపమంటారు. ఆకలి గొన్నవానికి అన్నం కంటే పరబ్రహ్మం మరొకటి కన్పించదు. ఆకలి ఒక విచిత్రమైన జబ్బు. ప్రతిరోజూ ఆకలి వేస్తుంది. ప్రతిరోజూ అన్నం తింటాం. ఆకలి అనేది సృష్టిలో ప్రతి ప్రాణినీ జీవితాంతం వెన్నాడే బాధ. బ్రతికి ఉన్నంత కాలం తినాల్సిందే. తిన్నంత కాలమే జీవించటం సాధ్యం. భగవంతుని సృష్టిలో జీవులన్నీ ఆకారంలో పెద్దవైనా, చిన్నవైనా ఆకలి బాధమాత్రం అన్నింటికి సమానమే. ప్రాణమున్నంత కాలం తినాలి. ఏదో ఒక ఆహారం తినటంవల్లనే జీవులన్నీ జీవించి ఉంటున్నాయి.
ఈ పరమరహస్యాన్ని అర్థం చేసుకొనే అమ్మ, అన్నాన్ని తన ప్రధాన ఆయుధంగా మలచుకొన్నది. ఆర్తులందరికి, ఈ అన్నం ద్వారానే అమ్మ తన ఆశీస్సులనూ, ఆశయాలను పంచుతున్నదా అనిపిస్తుంది.
ఎవరు వచ్చి తన బాధలు విన్నవించుకున్నా, ఎంత దూరం నుండి తనను వెతుక్కుంటు వచ్చినా, అమ్మ వారిని ప్రధమంగా వేసే ప్రశ్న “అన్నం తిన్నావా, నాయనా” అని. వారు “లేదమ్మా” అంటే “అయితే వెళ్లి భోంచేసిరా, నాయనా” అంటుంది. “భోంచేసివచ్చా” మంటే అయితే, కొంచెమైనా ప్రసాదంగా తిని” రమ్మంటుంది.
అమ్మ ఆదరణ, వాక్యాలు, అనురాగ ప్రదర్శన మనకు వెంటనే అర్థంకాకపోయినా, కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆదరణ, ఆప్యాయత, అనురాగాల వెనుక, మనబాధలకు నివారణ, మన వ్యాధికి ఔషధం, మన సమస్యలకు పరిష్కారం మన ప్రశ్నలకు సమాధానం, మన ప్రార్థనలకు ఫలితం, మన అభీష్టానికి సిద్ధి, ఇవన్నీ బహుగోప్యంగా, మర్మయుక్తంగా, అమ్మ సూచించిన అన్నపు ముద్దలో నిక్షిప్తమై ఉన్నట్లుగా మనకు అవగతమవుతుంది. లేకపోతే మనం ఎన్ని బాధలతో వచ్చినా, ఎన్ని కష్టాలతో ఆమె గడపత్రొక్కినా, ముందుగా, అమ్మ అన్నపూర్ణాలయంవైపు దోవ చూపించదు.
అమ్మ తన తాత్త్విక ప్రబోధాన్ని, సిద్ధాంత ప్రసారాన్ని సాగించటానికి, అన్నాన్ని ఆయుధంగాను అన్నపూర్ణా లయాన్ని రంగస్థలంగాను ఎన్నుకోవటం, ఒక మర్మసత్యం. ఒక తాంత్రిక రహస్యం.
“ఇన్నాళ్లుగా, ఎన్నో ఏండ్లుగా ఇంత అన్నదానం ఎలా చేయగలుగుతున్నావమ్మా” అని ప్రశ్నిస్తే అమ్మ “ఇందులో నాదేముంది. ఎవరి అన్నం వారు తింటున్నారు. ఇందులో ఒకరికి మరొకరు పెట్టటం ఏమున్నది ? వాడి అన్నం ఇక్కడ ఉన్నది. ఈ రోజు ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ తింటున్నాడు అంతే. లేకపోతే వాడు ఇక్కడే ఉన్నా తినలేడు” అని సమాధానం చెప్పి మన నోరు మూయించి నిమిషంలో మాయ కప్పేస్తోంది.
1958 వ సంవత్సరంలో అవతారమూర్తి, అమ్మ అన్న పూర్ణాలయానికి ఆకృతి కల్పించింది. ఆనాటి నుండి ఈనాటి వరకూ, అశేష భక్తజనవాహినులకు, అన్నార్తులైన జనులకు, అతిధులకు, అభ్యాగతులకు, వారు వీరననేల, వచ్చిన వారందరికీ ఈ అన్నారాధన, అవిచ్ఛిన్నంగా జరిగిపోతూనే ఉంది. ఇది ఒక మహాయజ్ఞం. ఎక్కడా కనీవినీ ఎరుగని అన్న యజ్ఞం. వర్షం వచ్చినా, వరదలు పొంగినా, అర్థరాత్రి అయినా, అపరాత్రి అయినా, కష్టకాలం వచ్చినా కరువులు కమ్ముకున్నా, గాడిపొయ్యి ఆరింది లేదు. అన్న సంతర్పణ ఆగింది లేదు.
ఇక్కడ ఎవరు వండారనేది ప్రశ్నగాదు. వడ్డించేది ఎవరనేది సమస్య కాదు. పదార్థమేదనేది పరమార్థమే కాదు. వంటకాలు ఏవనేది విషయమే కాదు. అన్నపూర్ణలయంలో ఎవరు వడ్డించినా, ఏమి వడ్డించినా, ఆ భోజనం రుచేవేరు. అక్కడి అన్నపు ముద్ద కున్న శక్తే వేరు. ఒక్క చింతకాయపచ్చడి వేసి పెట్టినా, కేవలం చింతపండు చారు మాత్రమే పోసినా, అక్కడి అన్నపు ముద్ద, అమృతంతో సమానమే. దీనికి ముఖ్య కారణాలు అమ్మ అదృశ్య హస్తం అక్కడ పనిచేస్తూ ఉండటమే. అక్కడి పదార్థాలేవైనా, వంటకాలేవైనా, వాటన్నింటిలో రంగరించి పెట్టింది అమ్మ అనురాగమే కదా! మ్రింగే ప్రతి అన్నపుముద్దా ఆమె పవిత్ర ప్రసాదమే! అక్కడ వడ్డించేది కూడా అదృశ్యంగా పనిచేసే ఆమె సహస్ర బాహువులే! అందుకే ఆ ప్రసాదానికి అంత శక్తి. భోక్తలందరికీ అంతభక్తి.
అమ్మ తన అపారమైన మహిమలను గూడా అన్నపూర్ణాలయం ద్వారా అభివ్యక్తం చేస్తున్నట్లు మనకు తోస్తున్నది. ఆ విషయం మనకు చాలా మంది గ్రహించకపోవచ్చు. ఏ సమయంలో వచ్చినా భోజనం రెడీ ? ఎంత మంది వచ్చినా, పదార్థాలు నిండుకోవటం ఎరగం. ప్రతిరోజూ భోజనాలవేళ నిత్యకల్యాణం పచ్చతోరణమే ! గాడిపొయ్యి సర్వకాల సర్వావస్థల యందూ మండుతూనే ఉంటుంది. వేలకొద్ది టన్నుల కట్టెలు కాలుతూనే ఉంటాయి. (ఇప్పుడైతే గ్యాసు వచ్చింది). బస్తాల కొద్దీ బియ్యం ఎసట్లోకి ఎక్కుతూనే ఉంటుంది. పుట్లకు పుట్లుగా ధాన్యం లారీలమీద, బండ్లమీద ఇక్కడకు చేరుతూనే ఉంటుంది. ధాన్యాభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ఇక కూరగాయలు, నూనెలు, పప్పులు, ఉప్పు, పాల సంగతి చెప్పనక్కరలేదు. ఎవరు పంపించారో, ఎంత పంపించారో ఎందుకు పంపించారో ఆమెకు తెలియాలి ! దేని కోసం ఇక్కడ అడిగేవారులేరు. ఏది గూడా అడిగించుకొని గాని పంపేవారుగూడా లేరు. ఒక్కరోజున నలుగురు పై మనుషులు మన యింటికి వస్తే మనం. అనేకం వెతుక్కుంటామే కంగారుగా ? ఇక అన్ని పదార్థాలు ఇంత మందికి ఇన్నిరోజులు ఎలా వస్తాయి అని ఆలోచిస్తే అందులో అదృశ్యహస్తం, అద్భుతశక్తులు మనకు లీలామాత్రంగా నైనా గోచరిస్తాయి. అమ్మ తనకు తానుగా ప్రత్యక్షంగా ఏమీ చేయదు. అంతా పరోక్షంగానే జరిగిపోతుంది. ఆమె బోధలలోను మర్మమే. ఆమె చర్యలలో గూడా మర్మమే !
జిల్లెళ్ళమూడి సంస్థకు స్థిరాస్థులు లేనే లేవు. శాశ్వతనిధులు లేవు. కట్టెలు లేకుండా గాడిపొయ్యి రాజుకోదు. ఎవరో ఒకరు బియ్యం పోయకుండా అన్నం ఉడకదు. పదార్థాలు కూడా ఎవరూ పంపకుండా రావు. ఆ పంపటానికి వారి మనస్సులలో ఏదో రూపంలో ఒక ప్రేరణ కలుగవలసిందే. వారి మనస్సులలో ఒక సంకల్పం మెదలవలసిందే. అయితే ఇంతమంది ఇన్ని రకాల ప్రేరణలు ఎక్కడ నుండి వస్తున్నాయి ? ఎవరీ ప్రేరణలు కల్పిస్తున్నారు? వందలాది, వేలాదిగా వచ్చే ఈ ప్రేరణలకు ప్రసారకేంద్రం ఎక్కడ ఉన్నది ? ఇదంతా ఎవరి సంకల్పబలం? ఈ మహత్తరమైన, అద్భుతమైన, అనితరసాధ్యమైన అన్నసంతర్పణ, ఈ మహాయజ్ఞం, ఇంత దీర్ఘకాలం ఎవరి సంకల్పబలం వలన నిర్విఘ్నంగా నిర్వహింపబడుతున్నది?
ఇదంతా ఒక నిగూఢ రహస్యం, పరులెవ్వరికీ అర్థం కాని పద్మవ్యూహం. అమ్మ భౌతికశరీరంతో అక్కడ లేకపోయినా, ఈనాటికీ ఆమె అదృశ్యనిర్వహణ క్రింద జరుగుతున్నట్లే అన్ని కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. ఇక్కడ ఏ పనికీ ప్రత్యేక నిర్వాహకులంటూ ఎవరూ లేరు. అంతా ఆమె ఇచ్చే అదృశ్య సంకేతాలతో, ప్రేమ పూర్వక ప్రేరణలతో పనిచేసే శ్రామికులే. అమ్మ ప్రభుత్వంలో ఆర్డర్లు ఇవ్వడం, ఆర్డర్లు తీసుకోవడం అంతా అదృశ్యంగానే జరిగిపోతూ ఉంటుంది.
అమ్మ అన్న ప్రసాద వితరణలో మరో కోణం గూడా వుంది. అక్కడ మనం తిన్న ముద్దలో అమ్మ తత్త్వం, అమ్మ ఆశయాలు, అమ్మ ఆదర్శాలు, అమ్మ సంకల్పాలు సూక్ష్మమైన భావాణువుల రూపంలో ప్రతి అన్నం ముద్దలో రంగరించి ఉంటాయి. అవన్నీ మన కడుపులో జీర్ణించుకొని పోయి మనకు తెలియకుండా మన జీవన దృక్పథాన్ని మన నిత్య జీవన గమనాన్ని పూర్తిగా మార్చి వేసే శక్తి అమ్మ ప్రసాదానికి ఉంది. కేవలం ఆకలి తీర్చటమేగాదు అన్నం ముద్దల పరమావధి అనుకొని మార్పులు మన మనస్సులలో వస్తాయి. మనందరిలో నిద్రపోతున్న మానవత్వం మేల్కొంటుంది. అమ్మ ఆశయం గూడాఅదే !
సమాజంలో ఆశించే సమత్వాన్ని, సమన్వయాన్ని నిర్వచించటానికి, అన్నపూర్ణాలయాన్ని, అన్న సంతర్పణను, అమ్మ సాధనంగా చేసుకున్నదా అనిపిస్తుంది. ఇక్కడ ప్రధానసూత్రంగా కులవివక్ష లేదు. మత వివక్ష లేదు. వర్గ ప్రాంత, భాషా వివక్షలులేవు. అందరూ ఒకే పంక్తిలో, ఒకే విధంగా కూర్చొని భోంచేస్తారు. ఇక్కడ ఆకలి ఒక్కటే అర్హత. అందరూ అమ్మ బిడ్డలే. ఆమెకు అందరూ కావాల్సిన వాళ్లే. ఆమె అందరికీ అమ్మ. ఒక లక్షమందికి ఒకే పంక్తిలో తన సహస్రబాహువులతో వడ్డించి, తన పిల్లలంతా అలా కూర్చొని భోంచేస్తే, అమ్మ ఎంత ఆనందించేదో ? ఇక్కడ అమ్మ ప్రతిరోజూ తన బిడ్డలకు పంచేది వండివార్చిన అన్నపు ముద్దలు కాదు. తన మాతృహృదయ మనే క్షీరసాగరాన్ని మధించి మనందరికీ పంచిన అమృతగుళికలు.
మరో విచిత్రమేమంటే ఇంతమంది తన సంతానానికి ప్రతిరోజూ ఎంతో ఆప్యాయంగా అన్న సంతర్పణ చేసే అమ్మ తాను మాత్రం అన్నం తినదు. పైగా “మీరంతా తింటే నేను తిన్నట్లే” అంటుంది. మనందరమూ అన్నం తింటాము. ఆమె మాత్రం ఖాళీ కడుపును ఆనందంతో నింపి తృప్తిగా త్రేనుస్తూ ఉంటుంది. తన వద్దకు వచ్చినవాళ్ళందరినీ అన్నపూర్ణాలయం వైపు మళ్లించటమే అమ్మ వంతు. ఆ తరువాత అక్కడ మనం తినే అన్నం ముద్ద మన గర్భంలో చేరి, తన పనిని తాను చేసుకుపోతుంది.
మనం తినే ఆహారాన్ని బట్టి, అన్నాన్ని బట్టి, తిన్నప్పుడు మనకున్న మనోభావాలను బట్టి, తిన్న స్థానాని కుండే పవిత్రతను బట్టి మన మనోభావాలు రూపు దిద్దుకుంటాయని శాస్త్రం చెపుతోంది. ఇంకా చెప్పాలంటే, మనం తినే అన్నపు రసమే, అన్నపు సారమే మన మనః ప్రవృత్తిని, మన సంకల్ప స్వభావాలను నిర్ణయిస్తుంది.
ప్రతిరోజూ దర్శనార్థం వచ్చే అశేషభక్తజనాలలో ఎవరైనా ఒకరు “ఇప్పుడే భోంచేసి వచ్చా”మన్నా సరే వాళ్ళను మ “కొంచెం అయినా భోజనం చేయ”మనటం ఆమె అలవాటు. భోజన విషయంలో ఒకరిని ఆజ్ఞాపించవచ్చు. మరొకరిని బ్రతిమలాడి భోజనం చేయించవచ్చు. ఎలాగైనా సరే అందరిచేత ప్రసాదం తినిపించవలసిందే. ఔను, మరి అమ్మప్రసాదమే ! మరి జీవులకు అన్నమే కదా ఆకలి తీర్చేది. ఆ ఆకలి భౌతికమైన ఆకలి కావచ్చు ఆధ్యాత్మికమైన ఆకలికావచ్చు. ఆస్థానంలో భోజనం చేసిన వారికి భౌతికమైన తృప్తి, మానసికమైన సంతృప్తి కలపటమే కాదు. అనేకమైన క్లిష్ట సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మనలో అంతర్గతంగా అనుకొని మార్పులకు నాంది పలుకుతుంది. ఇంతవరకు మనలో నిద్రపోతున్న మానవత్వానికి మేలుకొలుపు పాడుతుంది. అనుకోకుండా ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది. ఈనాటికీ అదే అనేకుల స్వానుభవము. ఇది జిల్లెళ్ళమూడిలో అమ్మ సన్నిధిలో మాత్రమే లభించే అనుభవ వేదాంతసారము. ఆధ్యాత్మిక భావజాలకాసారము స్వస్తి.