శ్రీరాధామధువాక్సుధారసరుచిం జిత్తంబు రంజల్ల, బృం
దా రణ్యంబున, వేణునాదరమణీయంబైన గీతారతిన్
స్మేరానందము లుల్లసిల్లఁ గరవంశీగానరూపాత్మకుం
డా రాజీవ దళాక్షు దర్శనము సేయంగోరి తిన్నాదిన్.
పేరాసనరిఁగాంచు గాంక్ష మన మువ్విళ్ళూరగా వేచి, బృం
దారణ్యాశకునేగి, యవ్వనము నత్యానందభావంబులే
పారం జొచ్చి, ముకుందు నందు వెదుకన్ ప్రారంభముంజేసి వే
సారుల్ ద్రిమ్మరితి స్వనాంతమున నుత్సాహంబు దీపింపగన్.
చిందులు ద్రొక్కుచు చెలరేగి పరువుతో
సుళ్లు గట్టెడు సెలయేళ్లఁ గంటి
సెలయేళ్ల పరిసరంబులఁజాలదట్టమై
యెదిగిన వృక్షసంపదలఁగంటి
నుదయించు సూర్యున కెదురుగాఁగనువిచ్చి
పకపకలాడు పుష్పములఁగంటి
శ్రుతినించి మతిఁగొంచు సొంపుఁబెంపును గూర్చి
కలకలఁగూయు కోయిలలఁగంటి
మందమందగతింబోవు మలయపవను
నందపుటొయారపు న్నడలందుఁగంటే
నందునందున గోవుల మందఁగంటే
తొందరగనే ముకుందుఁ గందు ననుకొంటే
తరువులమీద నూగుచు, లతాతతి, తోరణామాలికాగతిన్
సురుచిరపుష్పగుచ్ఛములఁజూపుచు స్వాగత మిచ్చురీతి సం
భరితవినోదముల్సలుపుభంగిని దోచినఁజూచి, దాన, సం
బరపడి, యుత్సహించితి, సెబాసనుచు స్థలయూచి మెచ్చితిన్.
చిమ్మచీకటి గమ్ము కొమ్మలనీడల
గొంతకాలంబు విశ్రాంతి నంది
చిరు తరంగంబుల దరితటంబులఁ గొట్టు
కొలకుల పజ్జల నిలిచినిలిచి
ముదరబండిన ఫలంబుల జారు రసమాన
బడువారు ఖగముల నరసి యరసి
అచ్చటచ్చట లేత పచ్చికమేయగా
వచ్చు లేగలఁజూడఁజొజ్చి జొచ్చి
ప్రకృతిఁదోచెడు రామణీయకము చేత
జేతముప్పొంగఁ గోర్కె లుఱూతలూగ
నా పరాత్పరుఁ గనుగాన నాపలేని
యాతురత నొంది కదలుచు నరిగి యరిగి.
నందనందనుం గను విందుగా గనుంగొను,
త్సాహంబుతో నిట్లు మనంబునం దలపోయజొచ్చితి –
పలుకుల కందరాక మునిభావన ధావనఁజెందరాక ని
శ్చలనిగమాంత సత్యమని సన్నుతి నందెడు, తత్త్వ మాత్మ భ
క్తులఁ గరుణింప నిచ్చగొని, గోపకిశోరపదంబు దాల్చు నా
యలఘు మహాత్ముఁజూడవలదా, కనుపండువుగాగ నియ్యెడన్.
కాళీయఫణముల కాళ్ళగజ్జలు మ్రోయ
నాట్యంబు సల్పెడు నటకు గందు
మురళి మోవిం జేర్చి ముద్దుపాటల లోక
మలరించు విశ్వమోహనుని గందు
కోమల తనులీల గోపికా చయముల
వలపించు గోపాల బాలు గందు
చలిది చిక్కము లూని చెలికాండ్రతో నాల
మందల గాచు గోవిందుగందు
రథము ద్రోలెడు పార్ధసారధిని గందు
నలిగి లంఘించు శ్రీచక్రహస్తు గందు
విజయు బోధింపగల వేదవేద్యు గందు
విమల పరమాత్ము హరి రమాధవుని గందు
కనుపండువుగ నీను గనుగొని యెదురేగి
వలగొని ముమ్మారు వందనంబు
సలిపి యాతని పాదజలజాతముల జారు
మకరంద రసమాని మత్త చిత్త
మున మైమరచి విశ్వమును విస్మరించుచు
మురళీధరుని విశ్వమోహనంపు
రూపంబులోపలఁ జూపు టెందము నిల్పి
ధ్యానికే శీల తత్పరనంది
జన్మసాఫల్యమంద మోక్షమును గందు
ముద్దుగోపాలు నిర్మిలి ముద్దు గొందు
వేణుగోపాలు మురళితో వియ్యమంది.
పాటఁ బాడుచుఁ దలయూచు పదవిఁగందు.