1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అన్వేషణమ్

అన్వేషణమ్

Chandra Mouli Chidambara Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : September
Issue Number : 2
Year : 2011

స్వప్నములగాంచి హర్షించి, వనజహితుడు

 తూర్పుదెసఁ దోచుటకు మున్నె తొట్రుపాటు

 గదురఁ గరణీయముల దీర్చి కాన దిక్కు 

బట్టి వని జొచ్చి నడచుచు వచ్చుచుండ.

 

తమముంబోవక నిల్చియుండగనే బృందావనాంతః ప్రవే

 శమునీకెట్లు ? తమోపహుండనగు నస్మత్కాంతి సాయంబు నొం

 దమి యజ్ఞానము గాదె యాగుమని క్రోధ స్ఫూర్తి జూపించు చం

 దమునన్ ప్రాగ్గిరి ధామరాగరుచి మార్తాడుండు దోతెంచినన్.

 

యమునాతీరము ప్రక్కగా నడచుచో నాల్మంద లయ్యేటి నీ 

రములన్ బింంబితమై కనంబడిన విభ్రాంతిం గనుంగొంచు, కొం

 చెము రెప్పార్పక, తేరిపారగని యా చిత్రంబున న్మించు మో

 దమున న్గోపక బాలకు లనిరి కాంతారమ్మునం దాలతోన్.

 

వనరుహ నేత్రుడచ్చటికి వచ్చెనొ వచ్చునొ యంచు నెంచుచున్

 మనమునఁ గొంత కొంత యనుమానము దోపగ నాసదీర కా

 వనమున నందునిందు జని వల్లవవల్లభు నుల్లమందు నే 

నునిచి, తదీయ దర్శనము నొందగ తొందరపాటు జెందుచున్.

 

తిరిగితి, మేను డస్సె నతిదీనతనొందితిగాని, కానలో 

నెఱుగగరాని యప్పరము నీశ్వరు మాధవు, రాధికా మనో

 హరు హరి, నందనందను మహామహిము న్దనజాలనైతి, వే 

సరితి నిరాశనంది మనసా వెతజెందితి జాలినొందితిన్.

 

భక్తిమై తనుగన గోరి పరితపించు 

భక్తునకు నాకు కన్నుల పండువుగను

 దర్శనమొసంగ కింత సంతాప మొసగు

 వాని నెట్లందునే భగవానుడనుచు.

 

అని చింతించి మరల నిట్లనుకొంటిని.

 

హరిగన గోర్కె లెల్లఁ బరిహారమగు స్సకలార్థ సిద్ధులం

 దొరకొనగల్గు నాత్మ పరితోషము నందు నటించు వానికై

 తిరిగిన వేడినన్ వెతలు దీరకపోయెను నాకు గోప సుం

 కరు నదనారవిందము, గనందగు భాగ్యము లేదొ దైవమా!

 

సుందరమందహాసరుచి శోభిల జల్లని చూపుతోడ నా

డెందము నందు బ్రాభవము ఠీవియు నుల్లసిలంగ నిల్చి యా 

నందము నిత్యబోధము ననంతవిలాసము సంఘటింపు మ 

స్పంద రసస్వరూప, పరిపాలిత గోపకలాపమాధవా!

 

అనుచు నాసీదీరక

కనుగొన నింకనాసగొని కాననమందు జరింపుచుండగా

 వెనుకొని “పాంథ” ఎచ్చటికి వెళ్ళెదవో యని గాలి ప్రశ్నజే ?

 సినవిని కొంత దవ్వరుగ జెన్నగు నవ్వన వృక్షజాలముల్

 ఘనసవనాను కంపన వికస్వర సుస్వర నిస్వనంబునన్

 

అలసిన మేనుతో నరుగునట్టి ననుం బలుకాడి, కొమ్మల 

న్విలసితమైన వీవనల వేమరు వీచుచు “బాటసారి ! యే

 వలనికి బోయెదీ వనుచుఁ ప్రశ్న యొనర్పగఁ జొచ్చెనింక, న

 వ్వల జనుచుండ నన్నిన వన్య మృగంబులు సంశయంబునన్.

 

నిలునిలు పోకుపోకు మేవనింగన నెచ్చటి కేగెదోయి, నీ

 యలసత తొట్రుపాటుఁగన నక్కట ! యక్కటికంబు వింతయున్

 గలిగెడు మాకు నొంటరిగఁగానఁబ నేమిచరింప ‘పాంధ’ యం 

చలమట దోచగా నడిగినట్టుల ప్రశ్న యొనర్చె వెండియున్

 

ఎవని వెదుకంగ తెరువరీ యెచటి కేగె

 దనుచుఁ దెలిసి కొనంగ నత్యాతురమున 

నడుగఁ జొచ్చె నత్తోట విహంగ చయము 

కలకలాకులనిస్వనోత్కళికతోడ.

 

సకల చరాచరాత్మక విశాల జగద్బహిరంతరాత్మ రూ

 పకు వెదుకంగనేగుటనో, వాయు శకుంతవనాంత వృక్షముల్

 ప్రకటిత సానుభూతిహిత భావముతో ననుగాంచి సాదరా

 త్మకమతి బల్కరించి రనుమానములేదని లోదలంచుచున్.

 

వెదకెదను కానిపిఁపని విభుని కొఱకు

 పలుకరించిన బలుకని ప్రభువు కొఱకు 

నంచు నొక్క సమాధాన మండరకును 

జెప్పిపోవుచుకుంటి నా చెట్ల నడుమ.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!