అంత నా భూమిజాత శకుంత పవన
వన్యజంతు సంతాన మనన్యకరుణ
తోడ నను జూచి యిట్లు మాటాడజొచ్చె
సాదరాతురభీతి విస్మయము లెనయ॥
తెరువరి ! యొక్క మాటవిను, తెల్వివహింపుము వెన్కముందు లీ
వరయుము, బంధువర్గముల, భార్యను, బిడ్డల, దల్లిదండ్రులన్
త్వరపడి వీడి సంసరణ వైభవము న్విడనాడి యెవ్వరే
నరయగరానివాని కొఱకై యిటు ద్రిమ్మర నీకు జెల్లునే॥
కనిపింపరానియాతవి జూడ నీరీతి వ్యర్థ ప్రయాసంబునందనేల ?
కనులకు గనిపించి, తను సుఖంబొదవించు సంసార సంపద జాలదొక్కొ
ధనధాన్యములు పశుధనములు తనయులు సతులు బంధులు
పురోహితులు పతులు
సతతంబు నాత్మహర్షము గలిగింపగా నతులితానందము
నందరాదె
వెదకినను గానిపింపని విభుడెవండొ
గలడటంచు దలంచుచు కాయకష్ట
మందగానేల నీ రీతి మందబుద్ధి
తిరిగి యింటికి పోపొమ్ము తీవ్ర పడక
స్థిరమైకంటికి గట్టిగా కనుపడేదే లేదటం చెంచి, న
శ్వరమంచు న్వీడనాడి కన్పడని యే బ్రహ్మంబొ కద్దంచు దు
ర్భరమౌ భ్రాంతి వహించి దానినె మదిన్ భావించి యుత్కంఠనీ
సరణిన్ ప్రాజ్ఞులు పండు వంటి నిజ సంసారంబు వర్జింతురే!
అనవిని సంశయం బెడదనంది యొకింత మనంబు తొట్రు పా
టెనసిన నిల్చి యించుక చలించిన డెందము చిక్కబట్టి యో
ఘనతరులార ! సంసరణ కంటికి దోచెడు లేని సౌఖ్య మె
లను విను డెండమావుల విలాసముగాక నిజంబె యంచనన్.
అవిరళ వృక్ష సంకుల మనారత సంచరదుగ్ర సత్త్వ సం
భవరవ భీకరంబు, విషపన్నగ కంటక సంవృతంబ యో
దవ దహనాకులంబు, జనతా మరణాంతిక మీ వనంబు నీ
కెవని సహాయమంచడుగనే మది నచ్చెరుపాటు జెందుచున్.
విజనత సహాయమగునాకు విపినసీమ
నంటి వాహనమేదేని యైన లేదె
యనిన “నాశయే” నాకు వాహనమ యటంటి
రాడె నీతోడ నొక యంగరక్షకుండు ?
అనగ “విశ్వాస” మను గట్టి యంగరక్ష
కుండు గల డంటి, నీకట్టు లుండెనేని
పొమ్ము జయమగు నన్వేషణమ్ము నందు
పొందెదవుగాక నిర్మలానంద మనిరి.
ఈరీతినెల్లరకే నుత్తరమొసంగ జెలగి వారిడిన యాశీస్సులంది.
వనము వసియించు వనదేవతల బోలు తరుల విహంగమ సత్వతరుణమలయ
పవమానరుతముల పరిపరివిధముల మానసవృత్తులు మలయుచుండ
నెఱుగని వానికై యేకతంబున నింక దిరుగంగ జొచ్చితి పరమనిష్ట
గాని వెదకెడు నీశ్వరుగానలేక
వాని గాంచెడు గాంక్షను మానలేక
తిరిగి తిరిగి వేసారి వేసరితిగాని
అంతటను గల్గువాడు నాకందరాడు.
మల్లెతీగెలలో ఘుమాయించు తావుల నిలచినట్టులె దోప బలుకరించి
వనరాణి యగుపిక స్వరమాధురీ తరంగాళిలో దోచిననాలకించి
శ్యామాభిరామమౌభూమీజ చైతన్యమందు దోచిన దానియందుజూచి
దళమైన చెట్ల సందున జొచ్చు రవికాంతి యందు దీపించి నందు సరసి
అన్నిచోటుల భ్రమియించునట్టి విభుని
చూడ గాంక్షింప దనపొడ జూపినాడు.
కనుమొరగి ఎండమావుల కరణి మెఱసి
కట్టెకను కట్టు నన్ను నట్టెట్టు ద్రిప్ప.
పేదమనస్సున దను జూడ ప్రేమతోడ
నెంచి వెన్నెల పూలు పూయించునన్ను
మోసగించుచు దాగుడుమూతలాడు
చున్నవాడోయి నందుని పిన్నవాడు
ఇట్లు దలచి గ్రుమ్మరుచు శ్రమించి పొక్కి
దట్టమగు నీడగల యొక చెట్టు క్రింద
గూలబడి విశ్రమింపగా గోరి యచట
గూరుచుంటిని యూరక కొంతసేపు