కనుకనే తనది తెలిసీ తెలియని స్థితి- అని అమ్మ స్వయంగా ప్రకటించింది- అనుకుంటూ ఉంటాడు నావంటి వాడు.
అమ్మకు ఏ అంశం పైనా సమగ్ర పరిజ్ఞానం లేదు అనేది ఈ వాక్యానికి అర్థమై ఉంటుందని సరిపెట్టుకుంటూ ఉంటాడు. ఇలా అనుకుంటే మనం పొరపడినట్లే అని చెప్పక తప్పదు.
ఒక సందర్భంలో ఒక సోదరుడు అమ్మను మహెూన్నతంగా కీర్తించి నప్పుడు అమ్మ చేసిన కీలకమైన ప్రకటన మన ఆలోచనా లోచనాలను తెరిపిస్తుంది.
“నాది తెలిసీ తెలియని స్థితి ” అన్నది అమ్మ. ఈ వాక్యం పైపైన చూడగానే తన సంగతి ఇలా ప్రకటించింది అమ్మ- అనిపిస్తుంది మనకు.
ఈ వాక్యాన్ని అమ్మకే అన్వయించి అర్థం చేసుకుంటాం మనం. అమ్మ ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టింది. సామాన్య గృహిణిగా జీవితం గడిపింది. అమ్మకు ప్రాథమిక విద్యాభ్యాసమైనా లేదు. “అమ్మ” అని వ్రాయటం కూడ తెలియక ‘అంఆ’ అని సంతకం చేస్తూ ఉంటుంది. అమ్మకు ప్రపంచ జ్ఞానం లేదు. అమ్మ చేసిన ఆధ్యాత్మిక సాధన ఏమీ కనిపించదు. తాత్విక సత్యాల పట్ల అమ్మకు అవగాహన అసలే ఉండదు- అనిపిస్తుంది మనకు.
మనం ఇలా అనుకోవటానికి కూడ అమ్మ మాటలనే ఆధారంగా తీసుకుంటాం. “నేనేమీ చదువుకోలేదుగా నాన్నా!” అని తరచుగా అమ్మ అంటూ ఉంటుంది.
“నాకు తెలిసి దీపారాధన కూడా చెయ్యలేదు” అని అమ్మ స్వయంగా ప్రకటించింది. ఇవన్నీ గ్రంథాలలో చూసీ స్వయంగా వినీ ఏ విషయంలో అయినా అమ్మకున్నది మిడిమిడి జ్ఞానం మాత్రమే.
ఈ సందర్భంలో మనం గమనించ వలసిన మరో ముఖ్యాంశం ఉన్నది. అమ్మ చెప్పిన అన్ని వాక్యాలకూ మనం యథాతథంగా అర్థం చెప్పుకోవటం సరిపోదు. కొన్ని వాక్యాలకు పైకి కనిపించే సామాన్యార్థం కాక, లోతైన గూఢార్థం ఏదో ఉండి ఉంటుంది అని మనం ఆలోచించాలి.
అమ్మ చెప్పిన మరో వాక్యం ఇందుకు ప్రేరణ కలిగిస్తుంది మనకు. “మరుగే నా విధానం” అని అమ్మ చేసిన ప్రకటన గమనార్హం.
“నాది తెలిసీ తెలియని స్థితి” అని అమ్మ చేసిన ప్రకటనను కొంచెం నిదానించి పరిశీలించాలి.
“అమ్మను గురించి నాకు తెలియనిది ఏమున్నది? ఎంతో కాలంగా అమ్మతో నాకు సాన్నిహిత్యం ఉన్నది కదా!” అనుకుంటే పొరబడినట్లే అని నాకు అనిపిస్తుంది.
అమ్మను గురించి తెలిసినట్లే ఉండి, ఇంకా తెలియనిది ఎంతో ఉందనీ మనం ‘తెలిసింది’ అనుకుంటున్నది కూడ అంతంత మాత్రమే – అనీ
తెలిసిందని అనుకుంటున్న అంశాలలో కూడ తెలియని కోణాలు ఎన్నో ఉన్నాయని మనం గుర్తించాలి.
‘మీకు ఎంతో కొంత తెలిసి కూడా ఇంకా అలా గుర్తించ వలసిన అవసరం ఉన్నదని మనకు గుర్తుచేసేదే “మరుగే నా విధానం” అని అమ్మ చెప్పిన వాక్యం.
అమ్మ అంటే జిల్లెళ్ళమూడిలో మంచం మీద కూర్చున్నదే కాదుగా, ఆదీ అంతమూ లేనిదీ, సర్వానికీ ఆదీ అంతమూ అయినదీ సర్వానికీ ఆధారమైనది – అని అమ్మ చెప్పిన మాట మనకు రాజ బాట.
అలాగే, “రూపం పరిమితం. శక్తి అనంతం” అని అమ్మ చేసిన ప్రకటన కూడ మనకు దారి చూపుతుంది.
జిల్లెళ్ళమూడిలో మంచంమీద కూర్చొని మనందరినీ ఆప్యాయంగా పలుకరించే ‘పరిమిత రూపం’ గల అమ్మ మనకు ఎంతో కొంత తెలిసి ఉండవచ్చు.
అమ్మ అంటే అదీ అంతమూ లేనిదీ అంతా తానే అయినదీ అనీ ‘అపరిమితమైన శక్తి’ అనీ మనకు తెలుసా!
తెలియనిదీ తెలుసుకో వలసినదీ నా స్థితి’ అని ఈ వాక్యంలో అమ్మ మనకు సూచన చేస్తోందని అభిప్రాయం. అదే అమ్మ తత్త్వం.
ఈ తత్త్వాన్ని అన్వేషించి, అవగాహనకు తెచ్చుకోవటం, ఆ అవగాహన అనుభూతిగా పరిణతి చెందటం సామాన్యమైన విషయం కాదు.
ఈ తత్త్వం తెలివితో, పాండిత్యంతో తెలిసేది కానే కాదు. మనలో సమర్పణ భావం ఉంటే, అమ్మ అనుగ్రహిస్తే అప్పుడు మాత్రమే తెలుస్తుందని నాకు అనిపిస్తోంది.
అమ్మ తత్త్వాన్ని అన్వేషించి, అవగాహన చేసుకోవటం, అనుభూతి చెందటం అనేవి మన ప్రజ్ఞతో కాక అమ్మ అనుగ్రహంతో మాత్రమే సాధ్యం అనిపిస్తుంది.
అప్పుడు ‘తెలిసీ తెలియని’ అమ్మస్థితి కొంతైనా మనకు తెలిసే అవకాశం ఉంటుంది- అనిపిస్తోంది.
మనకు తెలిసిన ఈ రూపం చాటున మనం తెలుసుకో వలసిన శక్తి దాగి ఉండటమే “మరుగు”. అదే తన విధానమని ప్రకటించి, మన ఆలోచనలను సంస్కరిస్తోంది అమ్మ.
అలాంటి “లోచూపు”ను ప్రసాదించవలసిందిగా అమ్మను ప్రార్థిస్తూ అమ్మకు ప్రణమిల్లుతూ …