అమ్మ మూఢనమ్మకాలని, అపోహలని ప్రోత్స హించలేదు కానీ శ్రద్ధాభక్తులతో సాంప్రదాయాలను పాటించడాన్ని కాదనలేదు. ప్రతి ఒక్కరి గురించి, వారి వంశపారంపర్యంగా ఉన్న సంప్రదాయాలను గురించి అమ్మకి క్షుణ్ణంగా తెలుసు. ఇలాంటిదే ఒక సంఘటన.
శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ అన్నయ్యతో నాకు ఎంతో అనుబంధం ఉండేది. ఆయనతో కలిసి ఎన్నో అభిషేకాలు, పూజలు చేసేవాడిని. తాను చేసే ప్రత్యేక పూజలకు కూడా నేను దగ్గర ఉండాలని పిలిచేవాడు. అది మాయందు ఆయనకు ఉన్న ఆత్మీయత.
అలాగే ఒకసారి అమ్మ గదిలో తన పూజ ఉందనీ మేమిద్దరం ( నేను, నా శ్రీమతి లక్ష్మి) కూడా ఉండి ఆ పూజ చూడడానికి రావాలని చెప్పాడు. మేము వెళ్ళి అమ్మకు ఎదురుగా ఉన్న గోడకు ఆనుకొని కూర్చున్నాము. ఆయన పూజ ఎంతో శ్రద్ధాభక్తులతో అద్భుతంగా చేశారు. చివరకు అమ్మ అన్నయ్య దంపతులకు ఎర్రని తోరము కట్టింది.
తరువాత మమ్మల్ని ఇద్దరినీ తన దగ్గరకు రమ్మని సౌంజ్ఞ చేసింది. అమ్మ దగ్గరకు వెళ్ళగానే మా ఇద్దరికీ కూడా తోరాలు కట్టి తలలపై పూలు చల్లి ఆశీర్వదించింది. తరువాత అన్నయ్య చెప్పాడు. ఈ రోజు అనంతపద్మనాభ చతుర్దశి అని, తన పుట్టిన రోజు కూడా అదేనని, అమ్మను అనంతపద్మనాభుడిగా పూజ చేసుకొన్నాను అని.
మాకు అమ్మ దర్శనభాగ్యం, అమ్మ స్వయంగా తోరాలు కట్టడం మా అదృష్టంగా భావించాము.
ఇంటికి వచ్చి మా అమ్మతో పై వివరాలు చెప్పగా ఆవిడ ఆశ్చర్యంగా “అవునురా, మన వంశంలో ఈ వ్రతం ప్రతిసంవత్సరం చేయడం ఆనవాయితీగా ఉంది. చాలా ఏళ్ళు మేము (మా అమ్మ నాన్నగార్లు) చేశాము. ఏవో అవాంతరాలతో మానేశాము. అమ్మకి ఎంత దయ! మనకి మళ్లీ చేయమని గుర్తు చేస్తోందేమో” అని చెప్పింది.
ఆ తరువాత మేమిద్దరం బెంగుళూరు వెళ్ళడం అక్కడ వరుసగా కొన్ని సంవత్సరాలు మేము ఈ వ్రతం చేసుకోవడం జరిగాయి.
ఒక సంవత్సరం మేము ఎందువల్లనో ఈ వ్రతం గురించి మరచిపోయాము. వ్రతం అయిపోయిన మూడు నాలుగు రోజుల తరువాత సోదరుడు పమిడిపాటి ఆదినారాయణ రాజు జిల్లెళ్ళమూడి నుంచి వచ్చి ఇవి నీకు అమ్మ ఇవ్వమంది అని రెండు తోరాలు నా చేతిలో పెట్టాడు. ఇలా జరుగుతుంది అని అస్సలు ఊహించని నాకు ఆనందాశ్చర్యాలకు అవధులు లేకుండా పోయాయి. మేము మరచిపోయినా అమ్మ మరచిపోలేదు. పైగా ఒకసారి అనంతవ్రతం పూజ చేస్తే ప్రతి సంవత్సరం విడవకుండా చేయాలనే నియమం ఉందట. మా వ్రతాలు నిర్విఘ్నంగా జరగాలనేమో అమ్మ మాకు తోరాలు పంపించింది. ఇది అమ్మ అపారమైన కరుణ కాక మరేమిటి ?
మనం అమ్మని సదా తలవకపోయినా అమ్మ మనల్ని ఎల్లప్పుడూ కనిపెట్టుకొనే ఉంటుంది కదా!
ఈ సంవత్సరం అనంతపద్మనాభ చతుర్దశి నాడు ఇదంతా గుర్తుకు వచ్చి కళ్ళు చెమర్చాయి.