1923 మార్చి 28 – 1985 జూన్ 12 నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో, అంతా వాడే (భగవంతుడే) చేయిస్తున్నాడనుకో. తమ బ్రతుకు తాము బ్రతకలేని బలహీనులున్నారు. తమ కాళ్ల మీద నిలబడ లేని వారికి గదా కర్ర ఆసరా. వారికి తోడ్పడండి. అయితే అది వారిపై జాలితో చేసే సహాయమని అనుకోక వారిని భగవత్ స్వరూపులుగా భావించి సేవ చెయ్యండి. కనిపించని దేవునిపై మనసు నిలవడం లేదని బాధపడక కనిపించే ఈ దేవుళ్లను ప్రేమతో ఆరాధించండి. ఆ సేవలో కలిగే తృప్తే ముక్తి అని దివ్య సందేశమిచ్చినది ఒక (ఆ) సామాన్య గృహిణి. అంతే కాదు తాను స్వయంగా ఆచరించి చూపి ఆదర్శమూర్తి అయి, మాతృత్వ అవతారమూర్తిగా వాసికెక్కినది. ఆమే జిల్లెళ్ళమూడి అమ్మగా ప్రసిద్ధురాలైన అనసూయాదేవి.
జిల్లెళ్ళమూడి గుంటూరు జిల్లా బాపట్లకు 14 కి.మీ. దూరంలో ఉన్న కుగ్రామం. 1941లో అమ్మ ఆ ఊరి కరణంగారు బ్రహ్మాండం నాగేశ్వరరావుగారి అర్ధాంగిగా జిల్లెళ్ళమూడిలో అడుగు పెట్టింది. నాటి నుంచి ఆ గ్రామం రూపురేఖలే మారిపోయాయి. అమ్మ ఉనికితో జిల్లెళ్ళమూడి పుణ్యక్షేత్ర మయ్యింది. జిల్లెళ్ళమూడి పేరు వినగానే ఆదరణ, ఆప్యాయత, అన్నదానం మనసులో మెదులుతాయి. అమ్మ 1923 మార్చి 28న మన్నవ గ్రామంలో జన్మించింది. అమ్మ అలౌకిక స్థితిని, ఆధ్యాత్మిక శక్తిని ప్రతిఫలిస్తూ ఎన్నో సంఘటనలు పుట్టినప్పటి నుంచి జరుగుతూనే ఉ న్నాయి. తనను దర్శింప వచ్చిన వారందరికీ అమ్మే స్వయంగా వంట చేసి ఆతిథ్య మిచ్చేది. తన బిడ్డలలో ఏం చూస్తున్నామో అందరిలోను దాన్ని చూడటమే దైవత్వమనీ, కూతురునీ కోడలునీ ఒకేలా చూడటమే అద్వైతమని, డ్రస్సుని, అడ్రస్సుని బట్టి గాక ఆకలే అర్హతగా ఏ విధమైన విచక్షణా లేకుండా దేశ, జాతి, మత కులాల కతీతంగా అన్నం పెట్టి, ఆదరించేది. తానుంటున్న ఇంటికి ‘అందరిల్లు’ అని నామకరణం చేసిందీ జగత్కుటుంబిని. ఆమె ఇంటికి ఎవరు వచ్చినా “నాన్నా, అమ్మా అన్నం తిన్నావా? అన్నదే తొలి పలకరింపు. అయితే అన్నదానం అన్న మాట అమ్మకు అంగీకారం కాదు. ఇక్కడ ఎవరి అన్నం వారు తిని వెళుతున్నారు. అదిక్కడ లేకపోతే వారు రారు. వచ్చినా తినలేరు అనేది అమ్మ. ఈ విధంగా ఆధ్యాత్మికతలో సామ్యవాదాన్ని రంగరించి ఆధ్యాత్మికతను ఆదరణను పునరుజ్జీవితం చేసిన తత్త్వవేత్త. 1956 తర్వాత అమ్మ దివ్య మాతృప్రేమ, ఆరమరికలు లేని ధార్మికత జన బాహుళ్యానికి తెలిసి రాకపోకలు పెరిగేయి. సందర్శకుల సంఖ్య వందలకు చేరుతున్నందున అమ్మ, ఆశీస్సులతో అన్నపూర్ణాలయం 1958 ఆగష్టు 15న ప్రారంభమైంది.
1973లో అమ్మ 50వ జన్మదినోత్సవం సందర్భంగా అమ్మా పుట్టినరోజు కానుకగా ఏమి కావాలి అంటే – ఒక లక్ష మంది బిడ్డలు బారులుతీరి ఒకే పంక్తి భోజనం చేయాలి అన్నది అమ్మ కోరిక. 70 ఎకరాల స్థలంలో పందిళ్లు వేశారు. వంద గడపలైనా లేని ఆ చిన్న గ్రామంలో లక్షా అరవై వేల మంది భోజనం చేశారు. ఆపైన బిడ్డలతో పాటు పశుపక్ష్యాదులు, జీవరాశు అన్నిటికీ ఆహారం అందించారు.
1985 మే నెల నుంచి అమ్మ అస్వస్థతతో ఉన్నది. నేను వచ్చిన పని అయిపోయింది. ఇక నన్ను పోనీయండి. నవ్వుతూ పంపించండి అని అంటూ ఉండే అమ్మ జూన్ 12 రాత్రి 10 గంటలకు పార్థివ శరీరం వీడి అనంతశక్తిలో లీనమయ్యింది. ఆమె సన్నిధిలో ఒక అలౌకిక ఆనందం, దివ్య వాతావరణం ఎందరికో అనుభవమయ్యేది. దశాబ్దాలుగా దేశ విదేశాల నుంచి అసంఖ్యాకంగా వచ్చి తమ ఆవేదనలను, కష్టసుఖాలను అమ్మకు నివేదించి, పరిష్కారాలు లభించి సాంత్వన పొందేరు. అమ్మ దృష్టిలో దుష్టులు శిష్యులు అనే భేదం లేదు. అందరూ విశిష్టులే! అక్కడ లాలనే గానీ పాలన లేదు. అనేక అంశాలపై అమ్మ ఇచ్చిన వివరణలు వేలాదిగా ఉన్నాయి. ఆమె స్పృశించని, తర్కించని విషయం లేదు. అమ్మ దర్శనం, అమ్మ వాక్కు అన్ని సందేహాలను పటాపంచలు చేసి మనలో పరిణతి, పరిణామం కలిగిస్తాయి. అమ్మ చిన్నతనంనుండీ ఎందరికో వివిధ రీతులలో దర్శనం ఇచ్చింది. కాశీకృష్ణమాచార్యుల వారికి రాజరాజేశ్వరిగా, ప్రసాదరాయ కులపతి (కుర్తాళం పీఠాధిపతి) గారికి చండికగా, లక్ష్మీకాంత యోగికి గాయత్రిగా, ఇంకా ఎందరెందరికో పార్వతిగా, లలితగా, సీతగా, భూదేవిగా, సరస్వతిగా, మరియమ్మగా, రాముడిగా, కృష్ణుడిగా వివిధ దైవ స్వరూపాల్లో కనిపించింది. మౌనస్వామి, వాసుదాస స్వామి, రఘువరదాసు, లక్ష్మణయతీంద్రులు, సద్గురు శివానందమూర్తి, కల్యాణందభారతి వంటి ఆధ్యాత్మికవేత్తలు, పీఠాధిపతులు, ఎక్కిరాల భరద్వాజ, పుట్టపర్తి, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, దువ్వూరి వెంకటరమణశాస్త్రి, పొత్తూరి వెంకటేశ్వర రావు, పన్నాల రాధాకృష్ణశర్మ వంటి ప్రముఖులు అమ్మను దర్శించుకుని ఆశీస్సులు పొందిన వారే! వెష్టర్ లేండ్, రిచర్డష్మన్, మిస్. మార్వా హెంఫిల్, రోడ్నీ అలగ్జాండర్, జిమ్ హేరీసన్, తిమోతీకాన్వే వంటి విదేశీయులు అమ్మను దర్శించుకున్నారు. అమ్మతాత్వికతను అధ్యయనం చేస్తూ కొందరు, అమ్మ సాన్నిధ్యం కోసం కొందరు జిల్లెళ్ళమూడిలో అమ్మ సన్నిధిలో నెలల తరబడి ఉండి పునీతులైనారు. కొందరు అమ్మ గురించి అద్భుతమైన గ్రంథాలు రాసి పాశ్చాత్య ప్రపంచానికి అమ్మను గురించి తెలియజేశారు. రమణ మహర్షి దిన చర్యను సోదరి నాగమ్మ, రామకృష్ణపరమహంస సంభాషణలు డా॥ M, అమ్మతో సంభాషణలను భవాని కుమారి, వసుంధర వంటి వారు అక్షర బద్దం చేశారు. అమ్మ మాటల్లో చేతల్లో, అమ్మ సన్నిధిలో జరిగే సన్నివేశాలకు సాక్షి అయి అమ్మ విశ్వజనీన సందేశాన్ని, సార్వకాలిక సత్యాలను స్పృశిస్తూ అనేక వ్యాసాలు రాసిన ధన్యజీవి కీ.శే. కొండముది రామకృష్ణగారు, అమ్మ తత్త్వచింతనకు ఆది గ్రంథాలుగా సంకలించిన వ్యాసుడు శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి. అమ్మ తన పర్యటనలో రమణాశ్రమంలో ఉన్న ప్రఖ్యాత రచయిత చలంగారికి దర్శనమిచ్చి ఊరట కలిగించింది. కంచి పరమాచార్యుల వద్దకూ వెళ్లింది. యతి నియమాలకు విరుద్ధమైనా పరమాచార్యులవారు రాత్రిపూట అమ్మ దర్శనానికి అంగీకరించారు. ఇరువురూ 15 నిమిషాల పాటు మౌనమై మా భాష అన్నట్టు ఉండిపోయారట !
ప్రముఖుల ఉవాచ
శాస్త్రజ్ఞుడైన డా. శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారిని మీరు శాస్త్రజ్ఞులై ఉండి ఒక మానవిని దైవంగా ఎలా అంగీకరిస్తున్నారు. అని అడిగితే – శాస్త్రవేత్తను కనుకనే పరిశోధించి తెలుసుకున్న సత్యాన్ని అంగీకరించకుండా ఉండలేను. అలాగే సత్యమైన అమ్మను అంగీకరించక పోవటం కూడా శాస్త్రజ్ఞుని లక్షణం. కాదు అని చెప్పేరు. అమ్మ ప్రచారానికి సుముఖం కాదు. ప్రఖ్యాత జర్నలిస్ట్ కోటంరాజు రామారావుగారు అమ్మా నిన్ను గురించి పత్రికలలో రాయాలమ్మా, అంటే – నీవు ఏ పత్రికలో చదివి వచ్చావు నాన్నా? అని అడిగింది. అమ్మ మతాన్ని ఉద్ధరించటానికి కాదు. మానవుణ్ని ఉద్దరించటానికి అవతరించింది. అంటారు ప్రఖ్యాత సాహితీ వేత్త ఆర్.ఎస్. సుదర్శనంగారు. ఇరవయ్యో శతాబ్దంలో ఆంధ్రదేశంలో పరమాద్భుతం జిల్లెళ్ళమూడి అమ్మ అవతార ఆవిర్భావం, తన ప్రేమ, వాత్సల్యం, కనికరం, అనురాగం, అనుగ్రహం లోకానికి అందించటానికి మన్నవలో పుట్టింది. జిల్లెళ్ళమూడి మెట్టింది. మానవ జీవితానికి జ్ఞానభిక్ష పెట్టింది – అని చెబుతారు. డా. అక్కిరాజు రమాపతిరావు గారు. అమ్మ సంస్థలు – సేవా కార్యక్రమాలు
అమ్మ అధ్యక్షురాలిగా శ్రీ విశ్వజననీ పరిషత్ ప్రారంభమయ్యింది 1970-71 ప్రాంతాలలో, ఆ తరువాత శ్రీ అనసూయేశ్వరా ట్రస్ట్, హైదరాబాద్లో జిల్లెళ్ళమూడిలో అమ్మ సేవాసమితి వంటి అనేక సంబంధ సంస్థలు ఏర్పాటయ్యాయి. ఈ జాతి సంస్కృతి సంప్రదాయాలు ఆంగ్లంలో కాదు సంస్కృత భాషలో ఉన్నాయి అని అందరూ అంగీకరిస్తారు. 1971లో అమ్మ మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ ప్రారంభించింది. తర్వాత ఒక సంస్కృత నాఠశాల స్థాపించారు. వేద పాఠశాల కూడా నడుపబడుతున్నది. ఈ విద్యార్థులందరికీ ఉచిత వసతి భోజన సదుపాయాలున్నాయి. వైద్యో నారాయణో హరి: అని నానుడి. రోగికి వైద్యుడు నారాయణుడైనట్లే, వైద్యునికి రోగి నారాయణుడే అని చెప్పిన అమ్మ ఒక అలోపతి వైద్యునికి వైద్యశాల నెలకొల్పి ఉచిత వైద్య సేవలందిస్తున్నది. ఉద్యోగ విరమణ చేసిన వారికి, తమను చూడటానికెవరూ లేరనుకున్న వారికి, ఉన్నా దూర ప్రాంతాల్లో ఉండి సాయపడలేని సంతానమున్న వారికి, ఇతరేతర కారణాల వల్ల ఒంటరిగా ఉంటున్న వృద్ధులకు – ప్రశాంత వాతావరణంలో జీవితం గడపటానికి “ఆదరణాలయం ఏర్పాటు చేశారు. విశ్వజనని అనే తెలుగు మాస పత్రిక, మదర్ ఆఫ్ ఆల్ అనే ఆంధ్ర ఆంగ్ల భాషలలో ఒక త్రైమాసిక సంస్థ ఆధ్వర్యంలో వెలువడుతున్నాయి. ఏం చూడాలి ??
ఇవిగాక శ్రీ అనసూయేశ్వరాలయం, హైమాలయం, నవనాగేశ్వరాలయం, వరసిద్ధి వినాయకాలయం, యాగశాల, ధ్యాన మందిరం, అమ్మ ఉపయోగించిన వస్తువులు, అమ్మ ఫొటోలతో ఉన్న వాత్సల్యాలయం దర్శించదగినవని. ఈ ఆలయాలలో పూజలు, అర్చనలు ఉచితంగానే చేసుకోవచ్చు. ఇటీవలే డిసెంబర్ 2న రేకుల షెడ్డులో ఉన్న పాత అన్నపూర్ణాలయం స్థానంలో నూతనంగా సుమారు 4 కోట్ల వ్యయంతో నిర్మించిన భవనం బెంగుళూరు కైలాసాశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్రపురి మహాస్వామి వారిచే ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి సన్నపనేని రాజకుమారి, డా. పొత్తూరి వెంకటేశ్వరరావు ప్రభృతులు పాల్గొన్నారు. ఈ సంస్థల కార్యక్రమాలన్నిటిని శ్రీ విశ్వజనని పరిషత్ సమన్వయం చేస్తుంది. ఎందుకు చూడాలి ?
జిల్లెళ్ళమూడి సందర్భకుల గురించి అమ్మ చెప్పిన మాట – వృధాగా వచ్చిపోవటం లేదు. వచ్చే సంకల్పమే కొంత ఫలం. తర్వాత ఎన్నటికీ వృధా కాదు.” ఇది అక్షర సత్యం. అనేకానేక వత్తిడులతో, మానసిక శారీరక సమస్యలతో సతమతమవుతున్న నేటి సమాజికులు జిల్లెళ్ళమూడి దర్శించి ప్రశాంతతను, ఆధ్యాత్మికోన్నతిని అమ్మ వాత్సల్యామృత అనుభూతిని పొంద వచ్చు. ఏదేని ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. ఇంకెందుకు ఆలస్యం. ప్రయాణ సన్నాహాలు మొదలు పెట్టండి.
వాత్సల్య రస సర్వస్వం వనితాలోక భూషణమ్
వన్డే వన్దారు మందారం పరంజ్యోతిర్ముదా సదా