జిల్లెళ్ళమూడి వెళ్ళటం, వెళ్ళాలనుకోవటం సంకల్పం అమ్మదని నమ్ముతూనే, అంతా మనం అనుకున్న ప్రకారం జరుగుతుంటుందని సాధారణంగా అనుకుంటూ వుంటాం. మానవ సహజమయిన అజ్ఞానంతో, అహంభావంతో, వాస్తవంగా జరిగేది అంతా అమ్మ ప్రణాళిక మాత్రమే కాని, మన ప్రమేయం ఈషణ్మాత్రం లేదు, వుండదు.
1980 ప్రథమార్ధంలో సిండికేట్ బ్యాంక్ గుంటూరు జిల్లాలో మూడు బ్రాంచీలు ప్రారంభించ టానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది. అవి నరసరావుపేట దగ్గర సాతులూరు, గుంటూరు దగ్గర ముట్లూరు, ములుకుదురు.
మా డివిజనల్ మేనేజర్ శ్రీ రామచంద్రరావు గారు. నాకు, నా మిత్రుడు ధర్మసూరికి ఒక ప్రపోజల్ ఇచ్చాడు. మాకు జిల్లెళ్ళమూడితో వున్న అనుబంధం ఆయనకు బాగా తెలుసు. అందుకని ఆయన మమ్మల్ని పిలిచి. ముట్లూరు, ములుకుదురు ఈ రెండు ప్రదేశాలు బాపట్లకు దగ్గరలో వున్నాయి. మీకు జిల్లెళ్లమూడికి తరచూ వెళ్ళటానికి అనుకూలంగా వుంటుంది. కాబట్టి మీరిద్దరూ ఈ బ్రాంచీలకి ప్రారంభ మేనేజర్లుగా వెళ్లండి” అని సూచించారు. మేముకూడా అంగీకారం తెలిపాము. తరువాత కొద్దిరోజుల్లోనే నాకు ముట్లూరు బ్రాంచికి, ధర్మసూరికి ములుకుదురు బ్రాంచికి పోస్టింగ్స్ వచ్చాయి. ముట్లూరు గ్రామం చేబ్రోలుకి అయిదు మైళ్ళ దూరంలో లోపలగా వుంటుంది. ములుకుదురు పొన్నూరు పక్కన మెయిన్ రోడ్ మీద వుంటుంది. బ్రాంచి ప్రారంభ కార్యక్రమం మా బాధ్యత కాబట్టి కొంచెం పని ఎక్కువగానే వుండేది. నేను ముట్లూరులోనే శ్రీ పులిపాక గోపాలరత్నం గారింట్లో అతిథిగా వుండేవాడిని. నా భోజనాలు అవన్నీ వాళ్ళింట్లోనే. ధర్మసూరి పగలంతా పని చూసుకుని సాయంత్రంకి జిల్లెళ్ళమూడి చేరేవాడు. పగలు భోజనం చేసి చేయక, సాయంత్రం మాత్రం జిల్లెళ్ళమూడిలో భోజనం కుదిరేది.
ఇంత పథ్యం ఎందుకు చెబుతున్నానంటే, ఒకరోజు సాయంత్రం మేమిద్దరం అమ్మ దగ్గర కూర్చున్నా. అమ్మ మా భోజనాల సంగతి ప్రస్తావించింది. నేను చెప్పాను “అమ్మా! నాకేం పర్వాలేదు. నేను గోపాలరావు గారింట్లో అతిథిగా హాయిగా వున్నాను. వారింట్లోనే భోజనాలు, కాఫీలు, అని చెప్పి, ధర్మసూరికే కొంచెం ఇబ్బందిగా వుందమ్మా! ఆయన పగలు సరిగా భోజనం చేయటం లేదు” అని చెప్పాను.
అమ్మ వెంటనే “నువ్వు ఆకలికి వుండలేవు కాబట్టి నీకు ముట్లూరు……. వాడు ఎలాగైనా వుండగలడు. కాబట్టి, వాడికి ములుకుదురు” అంటూ ఆపేసింది.
అంటే…. మేము ఏఏ బ్రాంచీలకు రావాలో, ఎవరికి ఏది సరిపోతుందో, ఎవరి తత్త్వాన్ని బట్టి వాళ్ళకి ఆయా ప్రదేశాలు నిర్ణయించింది తనేనని చెప్పకనే చెప్పింది.
అందుకే “ఠక్కుర ప్రకరా గమ్య మహా మహిమ శోభితా” అని స్తుతించారు పన్నాల వారు అంబికా సహస్రంలో. “ఠక్కుర” అంటే దేవతలు, వేల్పులు. ఠక్కుర ప్రకరములు అనగా దేవతా సమూహములు. దేవతా సమూహాలకే అగమ్యములు అమ్మ సంకల్పములు. మనమెంత?