విశ్వజనని, మాతృశ్రీ మన అమ్మకు కోట్లాది మంది బిడ్డలు. ఆ తల్లికృపకు పాత్రులైన వారికి ఎన్నెన్నో అనుభవాలు. సూర్యోదయం ప్రతి ఉదయం చూసినా నిత్యనూతనమే.
అదే విధంగా ప్రతి అనుభవమూ హృదయానందకరమే. ఇటువంటి మధురమైన అనుభవాలను, అనుభూతులను అందరి ముందూ వుంచి ఆ ఆనందంలో ‘అందరూ పాలుపంచుకోవాలనే ఆశలో అమ్మతో మనకు కలిగిన అనుభవాలను ఈ విధంగా తెలియజేసుకోవడం మనందరికీ ఆనందకరమేకదా!
నాకు కలిగిన ఒక అనుభవాన్ని వివరిస్తున్నాను. ఈమని దేవేంద్రమణి నా బాల్య స్నేహితురాలు. వాళ్లది శ్రీకాకుళం. 1959 లో మా నాన్నగారు ఉద్యోగరీత్యా శ్రీకాకుళంలో వున్నప్పుడు మా ఇద్దరికీ స్నేహం కుదిరింది. అప్పుడు నాకు ఆరేళ్ళు. తనదీ నా వయస్సే. ఇద్దరం కలిసి ఆడుకునే వాళ్ళం. రెండేళ్ళ తర్వాత నాన్నగారికి అక్కడి నించి ట్రాన్స్ఫర్ అయింది.
మళ్ళీ 1967లో శ్రీకాకుళం వెళ్ళాం. మా మణి అక్కడే వుంది. మా స్నేహం మళ్ళీ చిగురు తొడిగింది. ఒకే ప్రాణంగా వుండే వాళ్ళం. అలా రెండేళ్ళు గడిపేశాం. ఆ ఊరు వదలివచ్చేసినా మా స్నేహం మాత్రం సాగిపోతూనే వుంది.
1970లో నా పెళ్ళికి మణి వచ్చింది. నేను కాపురానికి చిత్తరంజన్
వెళ్ళిపోయాను. ఎప్పుడు కలకత్తా వెళ్తున్నా శ్రీకాకుళం రైలు స్టేషన్కి వచ్చేది. రైలు ఆగిన రెండు నిముషాల్లో ఎన్నో మాట్లాడుకునే వాళ్ళం.
1972లో మణి వివాహం జరిగింది. గొల్లపూడి రామ్మోహనరావుగారిని వివాహం చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది మణి. మనుషులం దూరమైనా మా కుటుంబాల ద్వారా ఒకరి గురించి మరొకరం తెలుసుకుని తృప్తి పడేవాళ్ళం.:
1988లో ఒకసారి 1994లో ఒకసారి కలుసుకున్నాం మేమిద్దరం. ఇక్కడ, మణి, మోహన్ రావుల గురించి నాలుగు మాటలు చెప్పాలి.
మణి లక్షాధికారులు ఇంట పుట్టింది. నిజం పచ్చలూ, నిజం కెంపులూ మొదటిసారి వాళ్ళింట్లోనే చూశానునేను. పెద్ద ఇల్లు వారిది. చూడ్డానికి బంగారు బొమ్మలా వుంటుంది. అన్నీ వున్నా మంచితనం, వినయంలో తనకు తనే సాటి.
ఇక మోహన్ రావుగారు, జ్ఞాని, విజ్ఞాని. ఇంజనీరింగ్ తర్వాత ఎలక్ట్రానిక్స్లో డబుల్ పి. హెచ్. చేశారు. టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన స్వంతంగా బిజినెస్ ప్రారంభించారు. ఎన్నో పేటెంట్లు సాధించారు. తన రంగంలో సాటిలేని ప్రతిభాశాలి.
ఇప్పటికీ భగవద్గీత పారాయణచేస్తూ మార్నింగ్ వాక్ చేస్తారు. ఉపనిషత్తులు ఔపోసన పట్టేశారు. ఇక ఆ వినయవిధేయతలు చూస్తే ఎంతటి వారికైనా చేతులెత్తి నమస్కారం చెయ్యాలనిపిస్తుంది. మంచితనానికి మారుపేరు మోహన్రావుగారు. వారి గురించి చెప్పాను కదా!
. మళ్ళీ అసలు విషయానికి వస్తాను. మణి నా దగ్గరకు 2004లో వచ్చింది. “తిరుపతి వెళ్ళాలి నీ సాయం కావాలి” అంది. మా శ్రీవారు శివరావుగారు అప్పుడు గుంతకల్లో పనిచేస్తున్నారు. తిరుపతి, కాళహస్తి, కాణిపాకం వంటి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగాం నేనూ మా మణి.
హైదరాబాద్లో మా ఇంటికి వచ్చింది. రాగానే గోడమీద అమ్మ ఫొటో చూసింది. అది వరకు ఎన్నోసార్లు మాటల్లో అమ్మ గురించి చెప్పాను. అమ్మ గురించి మరికొన్ని వివరాలు అడిగింది. వెళ్ళబోతూ “అమ్మ ఫొటో నాకు ఇస్తావా” అని అడిగింది. సమయానికి నాదగ్గర అమ్మ ఫొటోలు మంచివి లేవు. వెతికి ‘మదర్ ఆఫ్ ఆల్’ పుస్తకాలు తీసి రెండు కాపీలు మణికి ఇచ్చాను. తీసుకు వెళ్ళింది. 2004 ఏప్రిల్ నెలలో.
2005 ఫిబ్రవరిలో మణికి అమ్మ కలలో కనబడి ‘నాకు ధాన్యాభిషేకం చేస్తావా?’ అని అడిగిందిట. “నా దగ్గర ధాన్యం ఎక్కడుందమ్మా!” అందిట మణి. “పోనీ మూడు దోసిళ్ళ మట్టితో నాకు అభిషేకం చెయ్యి” అందిట అమ్మ.
మణికి మెలకువ వచ్చి అప్పటికప్పుడు అర్ధరాత్రి నాకు ఫోన్ చేసింది. వాళ్ళ అర్థరాత్రి మనకు పట్టపగలేగా! అంతా వివరంగా చెప్పి ఇప్పుడు ఏం చెయ్యమంటావు? అని అడిగింది.
ఏం చెయ్యాలి! నాకూ అంతు పట్టలేదు. అందుకే. ‘అమ్మ చెప్పింది నువ్వు విన్నావు. నీకేం చెయ్యాలనిపిస్తే అదే చెయ్యి” అన్నాను.
చేద్దామా! మానేద్దామా అని తర్జన భర్జన పడి చివరికి సూపర్ మార్కెట్కి వెళ్ళి మట్టి కొనుక్కొచ్చి నేనిచ్చిన పుస్తకం అట్టమీద వున్న అమ్మ ఫొటోకి అభిషేకం చేసిందిట. ఆ విషయం నాకు చెప్పింది. మళ్ళీ కలలో కనిపిస్తుందేమో అమ్మ అంది. మళ్ళీ కనిపించలేదు.
ఈ జనవరి ఒకటవ తారీకున ఫోన్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పింది. మళ్ళీ జనవరి 4వ తారీకు సాయంత్రం ఫోన్ చేసింది. “నిన్న రాత్రి అమ్మగారు నాకు కలలో కనిపించారే! ధాన్యాభిషేకం కోసం డబ్బు పంపించమన్నారు. అసలెప్పుడు ధాన్యాభిషేకం? ఎంత పంపించాలి? ఎవరికి పంపించాలి?” అంటూ అడిగింది.
నాకు నోట మాటరాలేదు. అంతకు ముందే మా ఆడపడుచు లలిత, శ్రీరామ్మూర్తిగారూ, మా ఇంటికి వచ్చారు. ధాన్యాభిషేకం గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళటు వెళ్ళారు, ఇటు ఈ ఫోన్. ఫిబ్రవరి 17న ధాన్యాభిషేకం. మేమందరం మామూలుగా వెయ్యి రూపాయలు ఇస్తాం అని చెప్పాను..
“నీకు పంపిస్తాను. నువ్వు అందజేస్తావా?” అని అడిగింది. తప్పకుండా అన్నాను. వారం తిరిగే సరికి 35 డాలర్లకి చెక్ వచ్చింది. ఆ డబ్బు ధాన్యాభిషేకానికి పంపించాం రవి అన్నయ్య ద్వారా.
ఏనాడూ తననిచూసి ఎరుగని మణి మీద అమ్మకి ఎందుకింత దయ కలిగింది? అడిగి మరీ ఎందుకు చేయించుకుంది? ఈ ప్రశ్నలకు సమాధానం మనకు తెలియదు. తెలుసుకోవాలని ఆరాట పడటం కూడా అవివేకమే!
మనం చేయగలిగింది ఒక్కటే ఆ లీలా మానుష వేషధారిణికి, ఆ లీలానాటక సూత్రధారిణికి, ఆ అవ్యాజకరుణామూర్తికి మరొక్కసారి మనసారా నమస్కరించటమే.
జయహోమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి.