జిల్లెళ్ళమూడి అమ్మ శతజయంతి ఉత్సవాలను (1923-2023) పురస్కరించుకుని అప్పికట్ల గ్రామంలో 05/03/2023 ఆదివారం సాయంత్రం 3గంటలకు అమ్మ శోభాయాత్ర, అప్పికట్ల గ్రామ ప్రధాన వీధుల్లో అత్యంత శోభాయమానంగా జరిగింది. తదనంతరం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి 5గంటలకు అమ్మ శతజయంతి సందేశ సభ నిర్వహించాము.
శ్రీ కొండముది ప్రేమకుమార్ స్వాగత వచనాలు పలికి, ప్రారంభించారు. శ్రీ యల్.సత్యనారాయణ గారు సభా నిర్వహణ చేయగా సభలో పాల్గొన్న శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ సభ్యులు శ్రీ M.దినకర్, శ్రీ M. సాయిబాబు గార్లు అమ్మను గూర్చి మాట్లాడుతూ “నీ కున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో” అని, “డ్రస్సు అడ్రస్సు” ను బట్టి కాక ఆకలే అర్హతగా అన్నం పెట్టమని జిల్లెళ్ళమూడికి అందరిల్లు అని పేరు పెట్టి, విశ్వజననిగా ప్రేమామృతాన్ని పంచిన అమ్మ నడయాడిన ప్రదేశాలలో అప్పికట్ల గ్రామం ఉండటం విశేషమని తెలియ జేశారు. అప్పికట్ల గ్రామ పెద్దలు మాట్లాడుతూ అప్పికట్ల గ్రామ కరణం శ్రీ కొండముది రామకృష్ణ గారి జన్మస్థలంలో అమ్మ శతజయంతి ఉత్సవాల సందర్భంగా కరణం గారి కుమారులు గ్రామాన్ని మర్చిపోకుండా సభను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అప్పికట్లకు కరణం అమ్మకు ఉప కరణం అయిన కొండముది రామకృష్ణ గారి ద్వారా జిల్లెళ్ళమూడితో గ్రామానికి అనుబంధం ఏర్పడిందని గ్రామ పెద్దలు జిల్లెళ్ళమూడితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం అమ్మను ఆ రోజులలో దర్శించుకున్న గ్రామ పెద్దలకు సత్కారం చేయటం జరిగింది. సభలో అప్పికట్ల గ్రామ సర్పంచ్ రజని, భారతి వేణు, మాధవరావు, కొండముది రామకృష్ణ గారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.