“అడిగితే అడిగినవి ఇస్తాను. అడగకపోతే అవసరమైనవి ఇస్తాను” అన్నది అమ్మ. అమ్మే మరోసారి “తోలు నోరుకాదు తాలుమాటరాదు” అన్నది అందుకే మీ కవసరమైన వన్నీ ఇస్తాను అన్నమాట అమ్మ అక్షరాల నిలుపుకొన్నది. నిలుపుకొంటున్నది.
రామకృష్ణ అన్నయ్య అనుభవాలనే ఒకసారి నెమరువేసుకొందాం అన్నయ్య మాటలలోనే. 1977 అక్టోబరు 9వ తేదీన విశాఖపట్నం నుండి మద్రాసు రైల్లోవెళ్ళాను. దారిలో టికెట్ ఇన్స్పెక్టరు నా వద్ద నుండి నా టికెట్ తీసికొని తిరిగి నాకు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. నేను మద్రాసు సెంట్రల్ స్టేషన్లో దిగి టికెట్ కోసం అతనిని వెతకటం మొదలు పెట్టాను. ఆ టికెట్ దొరకకపోతే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. చాలా ఆందోళనగా ఉంది. అప్పుడు కూలీ ఒకడు నా దగ్గరకు వచ్చి నా విషయం తెలుసుకున్నాడు. ఎలా బయటకు వెళ్లాలో తెలియక తికమకపడే నాకు ధైర్యం చెప్పాడు. “ఏమీ ఫర్వాలేదు. మీరేమి కంగారుపడకండి. మీ సామానులు తీసికొని నేను ముందు నడుస్తూ ఉంటాను. మీరు ప్రక్కలకి చూడకుండా నా వెంటనే రండి” అని చెప్పాడు. అనుమానంగా చూసే నా వంక చూస్తూ మళ్ళీ అన్నాడు. “మీకేమి భయం లేదు. నేనున్నాను నా వెంట రండి” అన్నాడు. ఇక నా సమాధానం కోసం ఎదురుచూడకుండానే నా సామాను నెత్తిన పెట్టుకొని ముందుకు సాగాడు. నేను అతన్ని అనుసరించక తప్పలేదు. ఇద్దరం బయటకు వచ్చాం. అతను నా సామానులు నాకు అప్పగించి కూలీ డబ్బులు అయినా అడక్కుండా వెళ్ళిపోయాడు. అపుడు నాకు అమ్మే ఆ కూలిరూపం లోనైనా వచ్చి ఉండాలి లేక అమ్మే ఆ కూలిలోనైనా ప్రవేశించి ఉండాలి అనిపించి “అమ్మా ! నాకోసం నీకెంత కష్టం వచ్చిందీ!” అని రెండు చేతులెత్తి నమస్కరించాను.
ఈ సందర్భంలో నాకు జరిగిన అనుభవం అప్రస్తుతం కాదనుకుంటాను. అవి నేను విజయవాడ ప్రక్కన ఉన్న పెనుమాక గ్రామంలో మేనేజర్గా పనిచేస్తున్న రోజులు. బహుశా 1989 సంవత్సరంలో అనుకుంటాను. ఒక రోజు ఖమ్మం నుండి వస్తున్నాను. చేతిలోని బ్యాగ్ లో బ్యాంక్సేఫ్ కీస్ ఉన్నాయి. విజయవాడ స్టేషన్లో రైలు దిగి నడుస్తున్నాను. ఒకతను నాకు ఎదురై “ఏమండీ ! మీ బ్యాగ్ లో నుండి ఒక్కొక్కటీ క్రిందపడిపోతున్నాయి చూసుకోండి” అన్నాడు. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నిజమే. వెంటనే తాళాలన్నీ ఏరి బ్యాగ్ లో వేసుకొని అతనికి కృతజ్ఞతలు చెబుదామనీ చూశాను. ఎక్కడా కనబడలేదు. ఎలాగైనా అతనికి కృతజ్ఞతలు చెబుదామనీ పట్టుదలగా విజయవాడ స్టేషన్ అంతా గాలించాను. కాని అతడు ఎక్కడా కనబడలేదు. అమ్మే అతనిరూపంలో వచ్చి నన్ను అప్రమత్తుణ్ణి చేసిందా?
మరొక సంఘటన : నేను బాపట్లశాఖలో మేనేజర్గా ఉన్న రోజులు. సంవత్సర ముగింపు సమయం. మా బ్రాంచిలో డిపాజిట్స్ లక్ష్యానికి బాగా తక్కువగా ఉండటంలో చాలా ఆందోళనగా ఉన్నాను. చేసేదేమిలేక ప్రక్కన ఉన్న ఆంజనేయస్వామి వారి గుడి వైపు తిరిగి ‘అమ్మ’కు నమస్కరించుకున్నాను. ఆ రోజు మరుసటిరోజు ఒకవ్యక్తి మా బ్యాంకుకు వచ్చాడు. పొట్టిగా ప్రత్యేక వ్యక్తిగా కనిపించాడు. ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చి “మీరు డిపాజిట్స్ గురించి ఆందోళనగా ఉన్నారు కదా ! ఏమి ఫర్వాలేదు. మీరు వెంటనే అర్బన్ బ్యాంక్ సెక్రటరీ ప్రసాద్ గారిని కలవండి. ఆయన మీ నాన్నకు (మా నాన్నగారు ఆయనకి ఎలా తెలుసునో?) మిత్రులు కూడా ! ఆయన మీకు తప్పకతోడు పడ్తాడు” అన్నాడు. నేను ఆయన సూచనను అంగీకరిస్తూ మీరెవరండీ అని ఆరాతీశాను. ఆయన నేను ఆ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ను అన్నాడు.
నేను ప్రసాద్ గారిని కలవటం ఆయన మాకు కావల్సిన మేరకు డిపాజిట్స్ వెయ్యటం,, మేము డిపాజిట్ లక్ష్యాన్ని చేరటం జరిగింది. ఆ తర్వాత ఒక రోజు నేను ప్రసాద్ గారిని కల్సి నా కృతజ్ఞతలు తెలియచేసి వారి వైస్ ప్రెసిడెంట్ గారిని పిలవమన్నాను నా కృతజ్ఞతలు తెలియచెయ్యటానికి. వారు వారి వైస్ ప్రెసిడెంట్ను పిలిపించారు. ఆశ్చర్యం ఆయన నా దగ్గరకు వచ్చిన వైస్ ప్రెసిడెంట్కాదు. ఆయనకు మొక్కుబడిగా కృతజ్ఞతలు చెప్పి మీ ఇంకో వైస్ ప్రెసిడెంట్ను పిలిపించండి అన్నాను. ఈయనే మా వైస్ ప్రెసిడెంట్ మరెవరూ లేరు అన్నాడు ప్రసాద్ గారు. నేను నా దగ్గరకు వచ్చిన వ్యక్తి పోలికలు చెప్పాను. అలాంటి వ్యక్తి ఎవరు తనకు తెలియదన్నాడు. ఆశ్చర్యపోవటం నా వంతు అయింది. మరి నా దగ్గరకు వచ్చి నాకు మార్గోపదేశం చేసిన ఆ విచిత్రవ్యక్తి ఎవరు ? ఇంకెవరు అమ్మే !
జిల్లెళ్ళమూడి నిర్వహణలో రామకృష్ణ అన్నయ్యకు ఆ అనుభూతులకు లెక్కలేదు. ఎన్నోసార్లు ఈ వస్తువులు లేవే అని చింతపడ్తూ ఉంటే అవి తీసికొని ఎవరో ఒకరు వస్తూ ఉండేవారు. ఎన్నోసార్లు జిల్లెళ్ళమూడికి ఏమాత్రం పరిచయం లేని వ్యక్తులు కూడా వాళ్ళల్లో ఉండేవారు. ఏదో వ్యవహారంలో ఎవరో సోదరులు కష్టపడ్తూ ఉండే జిల్లెళ్ళమూడి రెడ్డి సుబ్బయ్య అన్నయ్యవెళ్ళి వారికి ఎంతో సహాయం చేశాడట. తీరా చూస్తే రెడ్డి సుబ్బయ్య అన్నయ్య జిల్లెళ్ళమూడిలో ఉన్నాడట. మరి ఆ సహాయం చేసిన ఆ సుబ్బయ్య అన్నయ్య ఎవరు ? ఇంకెవరు అమ్మే!