“కులము లోన నొకడు.
గుణవంతుడుండిన
కులము వెలయు వాని గుణముచేత”
అన్నాడు మహాకవి వేమన.
ఆభాగ్యం రామకృష్ణ అన్నయ్య రూపంలో పొందిన మా కుటుంబ అదృష్టము ఏమని చెప్పగలము ? దీనికితోడు కారుణ్యమూర్తి, అనంత వాత్సల్యామృతవర్షిణి, జగజ్జనని ‘అమ్మ’ ఇచ్చిన అభయం కూడ తోడైతే బంగారానికి సువాసన అబ్బినట్లే!
శ్రీ రామకృష్ణ అన్నయ్యకు మరణ గండం ఉన్నదని తెలిసినప్పుడు జరిగిన సంఘటనలు ఒక మహామాయ’ కు రూపం మాత్రమే. చరిత్ర పునరావృతం అవుతుంది అనేది లోకంలో ఉన్న నానుడి. జగద్గురువు ఆదిశంకరాచార్యుడు ద్వారా హిందూ మతోద్ధారణ జరగాలనేది దైవసంకల్పం. శంకరుడు సన్యాసదీక్ష తీసుకోవాలి. దానికి తల్లి అనుమతి ఇవ్వాలి. దాని కొరకు మహామాయ కల్పించిన సంఘటన మొసలి సంఘటన. శంకరుడు స్నానం కొరకు నదిలో దిగితే ఒక మొసలి శంకరుని కాలుపట్టుకున్నది. శంకరుడు తల్లితో “అమ్మా ! నేను సన్యాసం స్వీకరిస్తే ఈ మొసలి నన్ను వదులుతుంది” అన్నాడు. తల్లి గత్యంతరం లేక శంకరుని సన్యాసదీక్షకు అనుమతించింది. సరిగ్గా ఇలాంటి మాయా సంఘటనే “రామకృష్ణ అన్నయ్యకు మరణగండం” సంఘటన. మాతృరథానికి సారధిగా రామకృష్ణ అన్నయ్యను ఎన్నుకున్న అమ్మ కల్పించిన మాయ ఇది. తల్లడిల్లిన అన్నయ్య తల్లి అన్నపూర్ణమ్మగారు అన్నయ్యను అమ్మకు అప్పగించి “అమ్మా! ఇక వీడు నా కొడుకు కాదు. నీ కొడుకే! చంపుకుంటావో! బ్రతికించుకుంటావో నీ ఇష్టం” అన్నది. ఆ బాధ్యత స్వీకరించిన అమ్మ అన్నయ్య తల్లి అన్నపూర్ణమ్మ గారికి అభయం ఇచ్చింది. ఆ అభయం రామకృష్ణ అన్నయ్యకు మాత్రమే కాదు మొత్తం అయిన కుటుంబానికి. ఆ తరువాత జరిగింది. అదంతా ఒక చరిత్ర.
మొత్తం రామకృష్ణ అన్నయ్య కుటుంబం అమ్మకు శరణాగతి అయింది. అమ్మ ఆ కుటుంబానికి కల్పవృక్షం అయింది. శుభా అశుభాలు అన్నీ అమ్మ సమక్షంలోనే అన్నపూర్ణమ్మగారు జిల్లెళ్ళమూడిలో తుదిశ్వాస వీడక పోయినా అంతిమయాత్ర జిల్లెళ్ళమూడి అమ్మ పాదసన్నిధి లోనే జరిగింది. అన్నయ్య నాయనమ్మ లక్ష్మి నరసమ్మగారు తన జీవిత అంత్యకాలంలో చాలా సంవత్సరాలు జిల్లెళ్ళమూడిలో ఉన్నది. ఆమె పెట్టుపోతలు అమ్మ కనుసన్నలలో జరిగినాయి. కాని నరసమ్మగారి కంటే ముందే అమ్మ తన అవతారం చాలించి దేవాలయంలో చేరింది. నరసమ్మగారు అన్న పానీయాలు మానివేసి ‘అమ్మ’ వెంట నడిచివెళ్ళింది. రామకృష్ణ అన్నయ్య పెద్ద సోదరి వసుమతిగారు బావగారు వెంకటరత్నంగారు ఇక్కడే అంతిమయాత్ర చేశారు. రెండవసోదరి సీతమ్మగారి అంతిమ సంస్కారాలూ ఇక్కడే. ఇలా అందరిని ఉద్ధరించిన శక్తి అమ్మే! అన్నయ్య భార్య ‘పద్మావతి అక్కయ్య’ చరిత్ర ఒక్కసారి అవలోకిస్తే అమ్మ ‘అభయం’ ఎంతటి మహిమాన్వితమో అవగతం అవుతుంది. రాములవారి వెంట నడిచాడు లక్ష్మణస్వామి. మరి నా సంగతి ఏమిటి? అని ప్రశ్నించింది ఊర్మిళాదేవి. ఆమెకు ప్రసాదించబడింది. “మహానిద్ర”. అలాగే అమ్మను అహర్నిశలు సేవించాడు. ‘అన్నయ్య’. మరి పద్మావతి అక్కయ్య సంగతి ఏమిటి? అమ్మ అన్నయ్యను అనుగ్రహించిన తీరు ఈ లోక విలువలకు అతీతమైనది. పద్మావతి అక్కయ్య పూర్తిగా అమ్మను గురించి జపతపాలలో మునిగితేలేది. జపం తప్పు మరో ప్రపంచం లేకుండా గడిపింది. “అమ్మకోటి” చెయ్యాలన్న తపన తప్ప అన్యం ఎరుగదు. ఆలెక్కలతోనే అందరిని ఒక రకంగా విసగించేది కూడ. అయితే నేమి ‘రామా’ అని పలుకలేని వాల్మీకి మరా ! మరా ! అని పలికినా మోక్షం ఇచ్చిన పరమాత్మ పద్మావతి అక్కయ్యకు మాత్రం మోక్షం ఎందుకు ప్రసాదించదు ?
మరో విశేషం అక్కయ్య జీవిత చరమదశలో జరిగింది. అక్కయ్య అవసానదశలో కాలు సెప్టిక్ అయింది. బాపట్ల డాక్టర్ మిండాల వెంకటేశ్వర్లుగారి ఆస్పత్రిలో చేర్చారు. డాక్టరుగారు మోకాలు క్రిందిభాగంలో ఉన్న మాంసం అంతా తొలగించటం ప్రారంభించారు. ఆ దృశ్యం చూసే వారందరి హృదయాలను కలచి వేసేది. ఇక అక్కయ్య ఎంత బాధకు లోనవుతుందో అని అందరు వేదనపడేవారు. సరిగ్గా ఇక్కడే ‘అమ్మ’ తన దయను ప్రసరించింది. ఆ బాధ ఏమాత్రం అక్కయ్యకు తెలియకుండా చేసింది. శరీరాన్ని ఎంత ఖండఖండాలుగా తొలిగిస్తున్నా బాధ మాత్రం అక్కయ్యకు తెలిసేది కాదు. ఇది ‘ఖండయోగం’ అని యోగదశలలో ఒకానొక దశ అని తెలిసినవాళ్ళు సెలవిచ్చారు. అమ్మ తన అభయాన్ని నిలుపుకొనేందుకు అక్కయ్యకు అయచితంగా ప్రసాదించిన వరం ఇది. ఇంతటి ‘అభయాన్ని’ ఇచ్చిన ‘అభయ ప్రదాయిని’ అమ్మకు దాసోహం అనటం తప్ప అన్నయ్య కుటుంబీలకు అన్యధా శరణం నాస్తి.