అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామినా
పరమం పురుషం దివ్యం యాతిపార్ధానుచిన్తయన్।।
ఓ పార్థా ! మనస్సును ఎల్లవేళలా నా స్మరణ యందే నియుక్తము చేసి ఏ మాత్రము మార్గము తప్పక నన్నే దేవదేవునిగా ధ్యానము చేసెడివాడు నన్ను తప్పక చేరగలడు.
– భగవద్గీత అష్టమాధ్యాయము
ఏమేవ్ ! ఎవరొచ్చారో చూడు! హడావుడిగా లోపలికి వచ్చాడు ఆ గృహస్థు. అంతే హడావుడిగా బయటకు వచ్చింది ఆ ఇల్లాలు. స్వయంగా ‘జిల్లెళ్ళమూడి అమ్మే’ మనింటికి వచ్చింది, ఆనందం పట్టలేకపోతున్నాడు. విచిత్రంగా చూస్తూ విస్తుపోతున్నది ఇల్లాలు. ఆ ఇంటాయన ఒక వ్యక్తిని వెంట బెట్టుకొని లోనికి తీసుకు వచ్చాడు. అమ్మ వచ్చింది ! కుర్చీ తీసుకొనిరా ! కాళ్ళు కడుగుదాం రా! కాళ్ళు తుడవటానికి మెత్తని గుడ్డ పట్టుకురా! అమ్మ తింటానికి ఏర్పాటు చేయి. పనులు పురమాయిస్తున్నాడు. ఏర్పాట్లు చక చక జరిగిపోతున్నాయి. ఆ వ్యక్తికి సకల మర్యాదలు, షోడశోపచారాలు జరిగాయి. పంచభక్ష్యాలతో విందుచేయబడింది. నూతన వస్త్రాలు బహుకరించబడ్డాయి. ఇలా సకల లాంఛనాలతో ‘అమ్మ’ కు వీడ్కోలు పలికారు. అంతకు మునుపు ఇంటిల్లి పాది ఆమె ఆశీర్వచనాలు తీసికొన్నారు. ఆ వచ్చినామె ఎవరో? ఎవరికి తెలియదు. ఆ వస్త్రధారణ, ఆహారము ఆమె ఒక వీధి భిచ్చగత్తెను తలపిస్తున్నది. అయితే ఆ ఇంటిలో అందరూ ఆ గృహస్తు అడుగుజాడల్లో ఆమెను ‘జిల్లెళ్ళమూడి అమ్మ’ గానేభావించారు.
ఒక ‘అతిధి’ని వెంట బెట్టుకొని వచ్చాడు ఇంట్లో గృహస్తు ‘ఎవరూ?’ అన్నట్లుగా ప్రశ్నార్థకంగా చూసింది ఆమె. “త్వరగా బట్టలు సర్దు” మేము జిల్లెళ్ళమూడి వెళ్తున్నాము” అన్నాడు. “ఎందుకు ఇప్పుడు జిల్లెళ్ళమూడి ఏ పండగా కాదే” అని వివరం అడిగింది. తన ఆలోచనలు ఇల్లాలికి వివరించాడు అతడు. “ఈయన మనకు బాగా తెలిసిన వాడు. ఇంతవరకు ‘అమ్మ’ను చూడలేదు. ‘అమ్మ’ ప్రేమను చవి చూడలేదు. ఆయనకు ‘అమ్మ’ ప్రేమనురుచి చూపించాలని జిల్లెళ్ళమూడి తీసికొనిపోయినాను. అమ్మ ఏం చెప్పింది “అందరూ నా బిడ్డలే. నేనే వారిని కని వారి తల్లులకు పెంపుడిచ్చాను” అని చెప్పింది కదా ! ఇలా ఈ తల్లిబిడ్డలను కలుపుతున్నాను” ఈ మాటలు విన్న తరువాత ఎవరు మాత్రం ఆయన చర్యను హర్షించరు? ఇలా ఎందరిని అమ్మ దగ్గరకు తన స్వంత ఖర్చులతో తీసికొని వచ్చాడో లెక్కించలేము.
` ఇంటి ముందు రిక్షా ఆగింది. ఇంటాయన బరువైన పెద్ద సంచీ తీసికొని దిగాడు. భారంగా మోస్తూ ఇంట్లోకి వెళ్ళాడు. “ఏమిటవి ?” కళ్ళతోనే ప్రశ్నించింది ఇల్లాలు. అందులో ఉన్నవి ఒక్కొక్కటి బయటకు తీశాడు. అవి అన్ని ‘అమ్మ’ ఫోటోలు ఫ్రేమ్ కట్టించి తెచ్చాడు. అన్ని ఒకే రకమైన ఫోటోలు. “అన్ని ఒకే రకమైన ఫోటో ఏం చేసుకుంటాము” అని భర్తను ప్రశ్నించింది.
ఓసి పిచ్చి ముఖమా ? అన్నీ మన కోసం కాదే మనకు తెలిసినవారికి అందరికి పంచాలి. మన పిల్లలందరికీ తలా ఒకటి ఇవ్వాలి. ఇలా ఎందుకు ? అన్నట్లు చూసింది ఆమె. “ఈ ఫోటో రూపంలో ఉన్న అమ్మను వారి బిడ్డల దగ్గరికి చేర్చినట్లు. వారు ప్రతిరోజు ‘అమ్మ’ను దర్శించుకొనే వీలు కల్పించినట్లు. ఇలా తల్లీబిడ్డలను కలిపే అవకాశం దొరికింది” తన సంతృప్తినివ్యక్తం చేశాడు.
అతిధిని వెంటబెట్టుకొని ఇంటికి వచ్చాడు ఆ గృహస్థు. ఒకసోదరుడ్ని ఎలా ఆదరిస్తామో అలా ఆదరిస్తున్నాడు. కాని ఆ అతిధి ఆయనకి సోదరుడు కాదే! అతిధి వాలకం అతని ఆహార్యము, వస్త్రధారణ గృహస్తుకు ‘సమతూకం’గా లేదు. ఎంతో ప్రేమగా అతనిని లోపలికి తొడ్కొని వచ్చాడు. కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళిచ్చాడు. తుడుచుకోవటానికి టవల్ ఇచ్చాడు. భార్యను పురమాయించి ‘భోజనానికి’ ఏర్పాటు చేశాడు. వంట పూర్తి అయిన తరువాత అతనికి ప్రత్యేక ఆసనం వేసి, కొసరి కొసరి వడ్డించి, విశిష్ట మర్యాదలు చేశాడు. అతని భోజనం అయిన తర్వాత అతనికి తన ఇల్లంతా త్రిప్పి చూపించాడు. ఆఅతిధి కళ్ళవెంబడి నీళ్ళు. జీవితంలో ఎన్నడూ ఎరుగని ఆ మర్యాదలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. తను గడిపిన తన జీవితం మొత్తం కళ్ళ ముందు కదిలింది. దుఃఖముతో కదిలిపోయాడు. “స్వామి ! నేను మీ మర్యాదలకు తగను. నేనొక దొంగను ఆనుపానులు తెలుసుకోవటం కోసం ఇలా తిరుగుతున్నాను. సొంత తమ్ముడిలా ఆదరించి ఇంత మర్యాదగా భోజనం పెట్టారు. నా జీవితంలో ఇలాంటి ఆదరణ ఎప్పుడూ చూడలేదు” అని భోరున ఏడుస్తూ గృహస్థు కాళ్ళమీద పడ్డాడు. ఇంటాయన అతిధిని లేపి కౌగలించుకొని, అతని కళ్ళు తుడిచి ఓదార్చాడు. “సొంత తమ్ముడిలా కాదు. నువ్వు నా సొంత తమ్ముడవే! మనందరం ఆ జిల్లెళ్ళమూడి అమ్మ బిడ్డలమే ఈ ఆదరణకు ఎన్నో రెట్లు ఆదరణ నాకు అక్కడ లభిస్తుంది అని ఓదార్చి పంపించాడు.
ఎవరా గృహస్తు ? అందరిలో తన తల్లి “జిల్లెళ్ళమూడి అమ్మ”ను చూడగల్గిన జ్ఞానసంపన్నుడెవరు? అందరు ‘అమ్మ’ను దర్శించుకోవాలి, అమ్మ ప్రేమను పొందాలని తల్లిచే అసలైన ఆ అమ్మ బిడ్డ ఎవరూ అమ్మ చెప్పిన ‘విశ్వకుంబ’ భావనను నరనరాన జీర్ణించుకొన్న ‘విశ్వాసి’ ఎవరు ?
ఎవరో కాదు ఆయన శ్రీ మోగులూరి సీతా రామచంద్రరావుగారు. అమ్మ కరుణను పూర్తిగా పొందినవాడు అమ్మ అభయంతో ఈ లౌకిక జీవితాన్ని అలౌకిక వాసనలతో గడుపుతున్నవాడు. అమ్మ కరుణతో జీవితాన్ని ఎలా జయించవచ్చో చెప్పటానికి ఒక ఉదాహరణ శ్రీ రామచంద్రరావుగారు. ప్రతి ఇల్లూ జిల్లెళ్ళమూడి కావాలి అన్న సంకల్పానికి ప్రతీక రామచంద్రరావుగారి ఇల్లు.