1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అభయప్రదాయిని

అభయప్రదాయిని

Kondamudi Subba Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 10
Month : February
Issue Number : 7
Year : 2011

“పలికెడిది భాగవతమట

పలికించెడి వాడు రామభద్రుండట” అని అన్నాడు మహాకవి పోతన. అని అనటమే కాదు, ఆయన కలం కదలలేని పరిస్థితి వచ్చినపుడు, స్వయంగా శ్రీరామచంద్ర మూర్తే పోతనరూపంలో వచ్చి ఆ పద్యరచన పూర్తిచేశాడని జనబాహళ్యంలో ఉన్న విషయం. “అలవైకుంఠపురమ్ములో నగరిలో అమూల సౌధమ్ము దాపల” పద్యరచన శ్రీరామచంద్రుడే చేశాడని అంటారు.

ఇలాంటి ఘటనే మానాన్నగారు “శ్రీరామకృష్ణ అన్నయ్య” జీవితంలో కూడా జరిగింది. అన్నయ్య ‘మాతృశ్రీ’ మాసపత్రికకు 20సంవత్సరములు సంపాదకత్వం వహించిన విషయం లోకవిదితమే. వారు వ్రాసిన సంపాదకీయాలు లోకోత్తరమైనవి అని అనటం కూడా నిస్సందేహం. అందులోని తీయని మర్మం ఏమిటంటే ? అన్నయ్య సంపాదకీయం వ్రాసిన ప్రతీసారీ ‘అమ్మ’ కు వినిపించి అమ్మ అంగీకారం పొందేవారు. అప్పుడు అమ్మ ఒకసారి అన్నయ్యను ఉద్దేశించి అన్నదట. “నాన్నా! ఇలా ప్రతిసారీ నాకు వినిపించనక్కరలేదు. నీవు కలం తీసికొని రచనసాగించు. ఆ కలాన్ని నడిపించే బాధ్యత నాది” అని. అలా హామీ పొందిన అన్నయ్య అదృష్టము ఏమని చెప్పగలం. ఆ హామీతోనే అన్నయ్య “దాదాపు 250 సంపాదకీయాలు,” ‘జీవిత మహోదధిలో తరంగాలు” “అన్నపూర్ణాలయం” “హైమాలయం” “అనసూయా వ్రతకల్పం” “అనసూయాకళ్యాణం” “శ్రీచరణవైభవము” “వాత్సల్యగంగ” “అంతస్సూత్రం” “అక్షరోపాసన” “మాతృదర్శనం” “మాతృసంహిత” గ్రంథాలు విరచించారు. ఆ రచనలలో అన్నయ్య కలం ఎంతవరకు సాగిందో ? ఎక్కడ? ఎప్పుడు ? అమ్మ ఆ కలాన్ని నడిపిందో వారిద్దరికే ఎరుక  (అన్నయ్య పాటలు)” అన్నగ్రంధాన్ని అన్నయ్య తదనంతరం శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య ఫౌండేషన్ తరుపున ప్రచురించటం జరిగింది.

ఆ గ్రంధాన్ని మొదట నవంబరు 11వ తేదీన ఆవిష్కరించాలని భావించాము. ఎందుకంటే ఆ రోజు అన్నయ్య జీవితములో విశిష్టమైన రోజు. అన్నయ్యను అమ్మకు దగ్గర చేసినరోజు. అన్నయ్య అమ్మకు అంకితమైన శుభదినం. కాని తరువాత ఈ గ్రంధాన్ని ‘హైమ’ అక్కయ్య జన్మదిన ఉత్సవాల సందర్భంగా ఆవిష్కరించాలని భావించటం జరిగింది. అప్పటికీ పుస్తకప్రచురణ పూర్తిగా కాలేదు. ఆ సందర్భంలో నేను అన్నయ్య పుస్తకాలు అముద్రిత రచనలు దాచిన బీరువా తలుపులు తెరవటం జరిగింది. ఒక్కసారిగా రెండు కాగితాలు క్రిందపడ్డాయి. ఉలిక్కిపడి నేను వాటిని చేతుల్లోకి తీసికొని, ఏమిటివి అని పరిశీలించాను. ఒక్కసారి సంభ్రమాశ్చర్యాలకు లోనయినాను. అవి హైమక్కయ్యమీద అన్నయ్య వ్రాసిన పాటలు అందులో ఒకటి మరీ ప్రత్యేకించి హైమక్కయ్య జయంతిపాట. ఒళ్ళంతా గగుర్పొడిచింది. ఒక్క క్షణం నిశ్చేష్టుడనైనాను. ఏమిటిది ? ఈ పాటలు ఎక్కడివి ? ఇంతకాలం నాకు ఎందుకు కనిపించలేదు ? ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేశాయి.

మెరుపులా ‘అమ్మ’ అన్నయ్యకు ఇచ్చిన అభయం “నాన్నా! కలం నీవు తీసికో, దాన్ని నేను నడిపిస్తాను” మనసులో మెదిలింది. అమ్మకు చేతులెత్తి నమస్కరించాను. అమ్మ అన్నయ్యకు ఇచ్చిన అభయాన్ని ఇంకా కొనసాగిస్తున్నారని అర్థం చేసికొన్నాను. పోతన్న వ్రాయలేని పద్యాన్ని రామచంద్రమూర్తి పూర్తి చేశాడని విన్నాను. ‘అన్నయ్య’ పుస్తకానికి శోభను పరిపూర్ణతను చేకూర్చటానికి ఈ గీతాలను దివి నుండి భువికి పంపించిన అభయ ఈ మధ్యకాలంలో అన్నయ్యవ్రాసిన “అక్షరోపాసన ప్రదాయిని అమ్మ కరుణను కని పులకించిపోయాను.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!