అమ్మా!
ఎన్నోసార్లు మా కష్టాలు నీతో మొరపెట్టుకుందా మనుకున్నాను.
కష్టాలు ఎవరికి లేవు? కష్టాల రూపం కూడా నేనే అంటావు
కష్టాలు సుఖాలు నేనిచ్చినవే అంటావు. ఇక నేనేమని చెప్పుకుండేది ?
హైమక్క కరుణామయి కదా! అని హైమాలయంలో కూర్చుంటే
మా కోరికలు వెల్లడించక ముందే – మమ్మల్ని చూచి
జాలి పేగుల తల్లి కంటి వెంట నీరు జలాజలా కారుస్తుంది.
పైకి పాలరాయే గాని మనసు వెన్న – అక్కకేమని చెప్పేది?
ఏమైనా అన్నీ భరించగలదానివి సహనమూర్తివి
నీకే చెప్పుకుందామని నీ వద్దకు వస్తే
మా మనోయవనికపై నీ జీవిత చరిత్ర కదులుతుంది
నీ కళ్ళముందే కన్నకూతురుని కట్టుకున్న భర్తను దాటించిన దానివి
మా పిల్లలు కూడా పరీక్షలు తప్పారురా అన్న దానివి
ఇక మా బాధా నివారణలు ఎలా అడిగేది ? ఏమని అడిగేది ?
నిన్ను చూచి జాలి పడాలా ? కోపగించుకోవాలా ?
నీ మాదిరిగా బండరాయిగా నిలబడాలా?
అప్పు డప్పు డనిపిస్తుంది.
నాన్నగారి తీయని పలకరింపు – నీవు పెట్టిన గోరుముద్దలు
మీరు చూపిన ఆప్యాయత, కరుణా వగైరా వగైరా
అన్నీ మీరే తీసికెళ్ళారా ? మా దగ్గర ఏమీ మిగల్చలేదా ? అని
త్రిమూర్తుల లాంటి కృష్ణత్రయానికి కూడా మనశ్శాంతి కరువు చేసి
అందరూ జిల్లెళ్ళమూడి వచ్చి ఉండండి నాన్నా !
అన్న నీ మాటల్లో ఎంత నిజముందో ? అర్ధం కావటం లేదు
నీ సేవలో జీవితాలు ధన్యం చేసుకొన్న ఎందరో అక్కయ్యలు
అన్నయ్యలు వాళ్ళను తలచే వాళ్ళేరీ ఈనాడు ?
హరిదాసుగారిలా ఇంటింటికి తిరిగి సంస్థకు సేవ చేసుకుందామంటే
దుర్బలమౌతున్న ఆర్థిక శారీరక పరిస్థితులు సాగనివ్వవు
ఎనభై ఏళ్ళు నిండినా కడుపు తీపితో, నిత్యబాలింతవై పిల్లల్ని కంటున్న తల్లివి
మా కోరికలు చూచి విసుగు పుట్టటం లేదా ? ఎందుకమ్మా ! నీకీ కరుణ?
అప్పుడు చదువురాని గోపికలు తరించారు నిన్ను పొంది ఆరాధించి
ఇప్పుడు చదువుకున్నా మనుకుంటున్న మూర్ఖులం నిన్నేం గుర్తించగలిగాం ?
నీ ప్రేమలో కొట్టుకుపోయామే గాని, ఆరాధించవలసినంతగా ఆరాధించలేక పోయాం
నీ విచ్చిన చిల్లర కాసులతో ఈ జీవితాన్ని లాక్కొస్తున్నాం.
చివరకు నిన్ను కూడా ఆదరణాలయంలో చేర్చి
నీ పుట్టిన రోజుకు కల్యాణానికి తృణమో పణమో చెల్లించాల్సి వస్తుందేమో ?
నీ పిల్లల్ని ఇంత దీనుల్ని చేశా వేమమ్మా?
ఎన్ని జన్మల పుణ్యఫలమో ? ఈ అక్కయ్యల అన్నయ్యల అనుబంధం
ఇది నీ ప్రసాద ప్రసారమే
దీంతోనే ఆనందిస్తున్నాం, తృప్తిపడుతున్నాం
నీవు మమ్మల్ని మభ్యపెట్టడానికి చెప్పిన నీ అనుభవ వేదాంత నిధులు
“జీవితమంటే సమస్యల తోరణమని – సమస్యలతో రణమని
అలలు లేనిది సముద్రం కాదు
బాధలు లేనిది జీవితం కాదు
శిల్పం అందంగా రావాలంటే ఉలిదెబ్బ లవసరం
సహనదేవత నారాధించటానికి బాధలనే పూజాపుష్పాలు కావాలి
ద్వంద్వాలే సృష్టి – శిక్షణ కూడా రక్షణే”
అన్న నీ పలుకులు సార్వకాలిక సత్యాలైనా
మేం తట్టుకోలేకపోతున్నాం మా జీవనాలలో
అతి సామాన్యులం కదమ్మా ? నీ బిడ్డలను ఎందుకిట్లా చేశావు ?
అన్నిసార్లు పట్టిన ఆ పాదాలు మిమ్మల్ని రక్షించకుండా ఉంటాయా ?
అన్న నీ ఓదార్పు – హామీ మమ్మల్ని మనుషులుగా నిలబెడుతున్నాయి
పాశ్చాత్య విద్యా ప్రభావంతో కొట్టుకుపోతున్న మా పిల్లల్ని కూడా
నీ ఒడిలోకి లాక్కోవూ ? నీ అక్కున చేర్చుకోవూ ?
నీవు అందరమ్మవు – అందరికీ సుగతి నిచ్చే దానివి
ఈ అభాగ్యుడి అభ్యర్థన మన్నించవూ ?