“Mother of All” జనవరి – మార్చి 2021 సంచికలో డా॥ బి. ఎల్. సుగుణ ‘నా జీవితం అబద్ధం – చరిత్ర బద్ధం’ అనే శీర్షికతో సోదాహరణంగా ఎన్నో విశేషాంశాలను సుబోధకం చేశారు. దీనిని ధారావాహికంగా రచింప పూనటం ఎంతో ముదావహం.
శ్రీ మిన్నీకంటి గురునాధశర్మ గారిని గురించి చాలామంది విని ఉండరు. ‘అమ్మ మహిమల కదంబము’ శీర్షికతో శ్రీ ఎ.వి.ఆర్. సుబ్రహ్మణ్యం వ్రాసిన వ్యాసంలో శ్రీ శర్మగారు రచించిన పద్యాలు, సంఘటనలు వివరించారు. అది సామాన్యులకు ఎంతో ఆవశ్యకం, ఆసక్తికరం. అట్లే గ్రంథంలోని మిగిలిన పద్యాలకు కూడా అలాంటి వివరణతో సశేషంగా అందిస్తే విశేషంగా ఉంటుంది.
ఇక శ్రీ పి.ఎస్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారి ‘ధన్యజీవులు’ శీర్షిక సరే సరి-సదా నూతనము, పరమార్థ ప్రబోధకము. శ్రీ గోపాల్ అన్నయ్య హాస్యాస్పదంగా ఒక మాట అన్నాడు “మేము ఉంటామో, ఉండమో. మా తర్వాత మాగురించి ‘ధన్యజీవులు’గా ఎలా వ్రాస్తారో ఒకసారి చూసుకుంటాం.. వ్రాసి చూపించండి” – అని, అది వాస్తవం; అందరికీ అలాగే అనిపిస్తుంది. ‘ధన్యజీవులు’ శీర్షిక ఒక విలక్షణ విశిష్ట రచన పరంపర.
మువ్వురికి శుభాభినందనలు;
‘వాత్సల్యామృత వర్షిణి అమ్మ’కి వందన సహస్రములు.