జీవితము సంఘటనల కూర్పు మాత్రమే కాదు. అమ్మ బిడ్డలకు జీవితము అమ్మతో అనుభవాలమయం కూడా. నేను 1968-73 మధ్యకాలంలో గుంటూరు జిల్లా మాచర్ల కాలేజిలో లెక్చరర్ గా పని చేసినాను. అప్పుడు జిల్లెళ్ళమూడి వెళ్ళడం అమ్మను దర్శించుకోవడం జరిగింది. అమ్మ చూపు మన హృదయాంతరాళలోకి వెళ్ళుతున్నట్లు, మనస్సు లోతులలోకి ప్రవహిస్తున్నట్లు తెలుసుకున్నాను. మనలో ఒకరిగా, మళ్ళీ అమ్మ వేరుగా ఉంటున్నట్లు తెలుసుకున్నాను. తరువాత ప్రతి 4, 5 నెలలకి, మనస్సు చికాకుగా ఉన్నప్పుడు అమ్మతో చెప్పుకుందుకు మళ్ళీ చాలా సంతోషముగా ఉన్నప్పుడు కూడ అమ్మతో నివేదించుటకు, కుటుంబముతోటి విడిగాను వెళ్తుండేవాడిని. “నేను ఏమీ మహిమలు చేయనని” అమ్మ చెబుతున్నా, నేను చూసినవి, విన్నవి మా కుటుంబ సభ్యులు అనుభవించినవి యెన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని క్రింద పేర్కొంటున్నాను.
1970 ప్రాంతములో నేను వెళ్ళినప్పుడు అమ్మపిలిచి ‘నీవు కాలేజీలో ఏ సబ్జెక్టు చెబుతావురా’ అని అడిగితే పొలిటికల్ సైన్స్ అని చెప్పినాను. “ఒరే మా కాలేజీలో పొలిటికల్ సైన్స్ లేడు. పాలిటిక్స్ ఉందేమొ తెలియదు. నీవు సాయంత్రం మా విద్యార్థులకు నీ సబ్జెక్టు గురించి మాట్లాడు అంది”. అప్పుడు కాలేజి పొలాలలో పాకలలో అన్నపూర్ణాలయమునకు 2 ఫర్లాంగుల దూరంలో ఉండేది. శ్రీ విరాల రామచంద్రమూర్తిగారు ఇన్ఛార్జి ప్రిన్సిపాల్. హాల్లో ఒకే కుర్చీ ఉంది. నన్ను కుర్చీ మీద కూర్చోమంటే “కుర్చీ మీద కూర్చుని మాట్లాడటం నాకు అలవాటు లేదు. నుంచుని మాట్లాడుతాను” అని అమ్మని ప్రిసైడ్ చేయమని ఆహ్వానిస్తున్నాను. అని ‘అమ్మా రావమ్మా అనసూయ రావమ్మా’ అని. మాట్లాడటం మొదలు పెట్టేశాను.. మైక్ లేదు. నేను మాట్లాడేది ఆ హాల్లో కూర్చున్న వాళ్ళకే వినబడుతుంది. ఒక గంట సేపు సోక్రటీస్ నుండి మొదలు పెట్టి డెమోక్రసీ, మోనార్కీ, డిక్టేటర్షిప్, మార్క్సిజమ్, సోషలిజమ్ల గురించి చెప్పి, గాంధిజమ్, అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా గాంధిదాకా మాట్లాడినాను. తరువాత అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మాట్లాడిన వాటిలో కొన్నింటిని విశదీకరించమని అడిగింది. బాగా మాట్లాడింది. అంటే కుర్చీ మీద కూర్చొని అన్నీ విన్నది అన్న మాట. నా అదృష్టానికి నేను చాలా సంతోషించినాను. కొన్నాళ్ళ తరువాత నేను గుంటూరులో, యోగిపుంగవులు, రామభక్తులు. అమ్మని, అమ్మతత్వాన్ని తెలుసుకున్న వారు అయిన శ్రీరంగన్నబాబుగారి యింటికి వెళ్ళినాను. ఆయన నా ఎదురుగా శ్రీరామచంద్రమూర్తి ఫొటొ దగ్గర నిలబడి ‘రామా! నరసింహమూర్తిగారికి ఏమన్నా ప్రసాదం యిమ్మని, ఖాళీ చేతులలోంచి ద్రాక్ష పళ్ళు తెప్పించి నాకు యివ్వబోయారు. “నేను షుగర్ పేషంట్ని నేను తీసుకోను” అన్నాను. మళ్ళా యీసారి అరటిపండ్లు తెప్పించినారు. “నాకు భగవంతుడు యిచ్చినా పళ్ళు తీసుకోను” అంటే ఏమి కావాలి? అంటే, కొబ్బరి ముక్కలు యివ్వండి అన్నాను. వెంటనే కొబ్బరి కాయకొట్టిన చప్పుడు వినబడింది. రెండు ఖాళీ చేతుల నుండి రెండు కొబ్బరి ముక్కలు యిచ్చినారు. నేను సంతోషంగా తీసుకున్నాను. ఆ మరునాడు జిల్లెళ్ళమూడి వెళ్ళినాను. అమ్మ గది పక్కవరండాలో కూర్చున్నాను. అమ్మ నన్ను చూసే అవకాశం లేదు. హైదరాబాద్ నుండి ఒక పెద్ద ఆఫీసరు కుటుంబంతో వచ్చి అమ్మ గదిలోకి వెళ్ళినారు. వాళ్ళు తెచ్చిన పెద్ద అరటి పళ్ళగెల, హైదరాబాదు స్వీట్స్ అమ్మకి సమర్పించుకున్నారు. బయట నరసింహమూర్తి కూర్చున్నట్లున్నాడు వాడిని కూడ లోపలికి రమ్మని చెప్పితే నేను లోపలకి వెళ్ళినాను. వాళ్ళందరికి అరటిపళ్ళు యిచ్చి నాకు వలిచి ఒక పండు నోటికి అందించింది. నేను తీసుకోలేదు. “ఒరే నేను భగవంతుణ్ణి కాదురా! అమ్మను, తిను” అంది. అక్కడ ఉన్న వాళ్ళందరు ఆశ్చర్యంగా నాకేసి చూసి తినండి బాబు అన్నారు. అరటి పండు తిన్నాను. తర్వాత హల్వా కొంచెం నాచే తినిపించి, ఒక కె.జి. స్వీట్స్ పాకెట్ నాకు యిచ్చి “యింటికి పట్టుకొని వెళ్ళు, అంది. ఎప్పుడూ నేను భగవంతుడు యిచ్చినా తినను, నేను చేయను’ అటు వంటి శపథాలు చేయకు ఏది నీ చేతిలో ఉండదు” అంది. గుంటూరులో నేను అన్న మాటలకు సమాధానము చెప్పింది.
తరువాత నాకు తాడేపల్లిగూడెం ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ మా రెండవ అబ్బాయి చి|| రవిశంకర్కి రోజు సాయంత్రం 4 గంటలకు జ్వరం వచ్చి రాత్రి 8 గంటలకు తగ్గేది. పబ్లిక్ పరీక్షలు ముందు. బాగా నీరసింసించాడు. అన్ని పరీక్షలు అయినాయి. అన్ని రకాలు మందులు అయినాయి. నిస్పృహతో జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మకు చెప్పుమన్నాను. “సరే లేరా. నీవు యింటికి వెళ్ళేటప్పటికి తగ్గుతుంది”. అలాగే నేను వెళ్ళేటప్పటికీ ఆడుకుంటున్నాడు. తరువాత నేను ఎప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళినా “టెంపరేచర్ గాడు ఒళ్ళు చేస్తున్నాడు. ఇంజనీర్ అవుదామనుకుంటున్నాడు” అనేది. అలాగే అమ్మ ఆశీర్వచనములతో యిప్పుడు వాడు అమెరికాలో ఒక పెద్ద కంపెనీ వైస్ ప్రెసిడెంట్స్లో ఒకడు.
తరువాత నాకు కాకినాడ ట్రాన్స్ఫర్ అయింది. 1983లో నాకు విపరీతమైన కడుపులో మంట ఆఖరికి చప్పిడి అన్నంతిన్నా మండి పోయేది. డాక్టర్లు పరీక్ష చేసి ఇది అల్సర్. డయాబిటిక్ కనుక ఆపరేషన్ కుదరదు. మందులు వేసుకుంటూ కాలక్షేపం చేయండి అన్నారు. జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మతో మొరపెట్టుకున్నాను. ఆ వేళ జనవరి 25 అమ్మా! నా పుట్టినరోజు నీ సమక్షంలో జరుపుకుంటున్నాను అన్నాను. “నీకు అల్సర్ కాదు. వికారము. వాంతులున్నాయా” అని అడిగింది. లేవు అంటే “హైపర్ అసిడిటి. హోమియోపతి మందు వేసుకో” అని పులిహోర, పాయసం పెట్టింది. మళ్ళీ యీ నాటిదాకా కడుపులో మంట లేదు.
అమ్మదయ వల్ల మా నలుగురు పిల్లలు యిద్దరు కొడుకులు, యిద్దరు – కూతుళ్లు సుఖసంతోషములతో ఉన్నారు. మా శ్రీమతి జానకీ సుబ్బలక్ష్మి వయస్సు 70 సంవత్సరములు. మేము అమ్మ నామం చేసుకుంటూ, మదర్ ఆఫ్ ఆల్, విశ్వజనని, యితర ఆధ్యాత్మిక గ్రంథములు చదువుకుంటూ, అభిషేకములు, కుంకుమ పూజలు చేసుకుంటూ, తృప్తిగాను సంతోషముగాను జీవయాత్ర చేస్తున్నాము.
క్రిందటి సంవత్సరములాగే యీ సంవత్సరము కూడ పుట్టినరోజు జిల్లెళ్ళమూడిలో జరుపు కుందామని తోచింది. శ్రీ బులుసు సత్యనారాయణ శాస్త్రిగారు, శ్రీ చాగంటి వెంకట్రావుగార్ల ప్రోత్సాహముతో నేను మా శ్రీమతి జనవరి 21న బయలు దేరి జిల్లెళ్ళమూడి వెళ్ళినాము. శ్రీ నాదెండ్ల లక్ష్మణరావుగారు మాకు మంచి వసతి చూపించి, హైమాలయ వంటశాలలో భోజనాలు ఏర్పాటు చేసినారు. జనవరి 23న శ్రీ నాగేశ్వరాలయంలో అభిషేకము చేసిపూజ చేసుకున్నాము. 24వ తారీఖున హైమకు చీరపెట్టి, అభిషేకము చేసి, తామరపూలతో పూజ చేసుకున్నాము. జనవరి 25, నా 79వ పుట్టినరోజు. ఆ వేళ ఉదయం వసుంధర అక్కయ్య నా నెత్తిమీద చమురు పెట్టి అమ్మ తరఫున ఆశీర్వదించింది. పరిషత్ తరఫున శ్రీ వల్లూరి రమేష్ గారు మాకు బట్టలు పెట్టినారు. ఆ బట్టలుకట్టుకొని, అమ్మకి చీర నాన్నగారికి పంచ కండువాలు పెట్టి, అభిషేకము చేసి తామర పూలతో పూజ చేసుకున్నాము. వసుంధర అక్కయ్య పాయసం పెట్టింది. అన్నపూర్ణాలయంలో అందరికి బంతి మీద పాయసం వడ్డించినారు. “అమ్మా! నేను బ్రతికున్నంత కాలము ప్రతి సంవత్సరము పుట్టిన రోజు, జిల్లెళ్ళమూడిలో నీ సమక్షంలో చేసుకునేలా ఆశీర్వదించ”మని ప్రార్థించినాము. జనవరి 26న “ఏ పూర్వజన్మలో ఏ పుణ్యమో చేసి జిల్లెళ్ళమూడిలో అమ్మ ఒడి చేరావు. ప్రేమానురాగాలు అమ్మకాభరణాలు, నాకేమి కొదవింక కోయిలా, గొంతెత్తి పాడవే కోయిలా” అని పాడుకుంటూ బాపట్లకి ఆటో ఎక్కినాము. సాయంత్రానికి తృప్తితో, ఆనందంగా కాకినాడ చేరినాము.
॥ జయహోమాతా శ్రీ అనసూయా. రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి ॥